Can sugarcane acreage be increased? చెరకు విస్తీర్ణం పెంచగలరా?
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:17 AM
Can sugarcane acreage be increased? చెరకు క్రషింగ్ సీజన్ కొనసాగుతున్న దశలో డిప్యూటీ కేన్ కమిషనర్ పాత్ర చాలా కీలకం. ఆయన రైతులకు అందుబాటులో ఉండాల్సిన సమయమిది.
చెరకు విస్తీర్ణం పెంచగలరా?
ఆ అధికారికి ఏడు జిల్లాల్లో ఇన్‌చార్జి బాధ్యతలు
బొబ్బిలి డిప్యూటీ కేన్ కమిషనరుపై పనిభారం
అసలే సుగర్ ఫ్యాక్టరీల మూతతో తగ్గుతున్న చెరకు పంట
చెరకు క్రషింగ్ సీజన్ కొనసాగుతున్న దశలో డిప్యూటీ కేన్ కమిషనర్ పాత్ర చాలా కీలకం. ఆయన రైతులకు అందుబాటులో ఉండాల్సిన సమయమిది. వచ్చే సీజన్‌లో చెరకు పంట సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ఏం చేయాలి అనేదానిపై కూడా ఇప్పుడే చర్చించాలి.. రైతులకు సూచనలివ్వాలి. మరి ఇవ్వగలుగుతారా? ఆయన ఆ పరిస్థితిలో లేరని రైతులే అంటున్నారు. ఏడు జిల్లాల్లో ఇన్‌చార్జి బాధ్యతలు చూడడమే దీనికి కారణం.
బొబ్బిలి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): బొబ్బిలి పట్టణంలో కీలకమైన జిల్లా స్థాయి డిప్యూటీ కేన్ కమిషనర్ కార్యాలయం ఉండడంతో ఒకప్పుడు చెరకు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉండేది. వారు ఏ సమస్య ఉన్నా వెంటనే సంప్రదించేవారు. రెండు సుగర్ ఫ్యాక్టరీలు మూతపడినా ఈ నాటికీ అంతో ఇంతో చెరకు పంట కనిపిస్తోంది అంటే కీలక అధికారి అందుబాటులో ఉండడంతోనే. ఇక్కడ డీసీసీగా ఎం.సత్యనారాయణ పనిచేస్తున్నారు. అయితే ఏడు జిల్లాల్లో అదనపు బాధ్యతలు చూస్తున్నారు. దీంతో నిత్యం స్థానికంగా అందుబాటులో ఉండలేని పరిస్థితి.
ప్రస్తుత చెరకు క్రషింగ్ సీజన్ కార్యకలాపాలతో పాటు వచ్చే సీజన్‌లో చెరకు పంట సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి అవసరమైన సమావేశాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. సమీక్షల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. చెరకు సాగు చేసే రైతులకు అవసరమైన సలహాలు ఇవ్వాల్సిన తరుణం. అయితే తూర్పు, పశ్చిమగోదావరి, గుంటూరు ఏలూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, మన్యం జిల్లాల్లో చెరకు సంబంధిత కార్యకలాపాలు చూసేందుకు అధికారులు ఎవరూ లేకపోవడం, చాలామంది రిటైర్ కావడంతో బొబ్బిలిలో డిప్యూటీ కేన్ కమిషనరుగా పనిచేస్తున్న సత్యనారాయణకు ఆయా జిల్లాల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన విపరీతమైన పనిభారాన్ని ఎదుర్కొంటున్నారు. ఎవరికీ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండలేకపోతున్నారు. మరోవైపు రైతులకు సంబంధించిన కోర్టు కేసులకూ కూడా ఆయన హాజరు కావాల్సి ఉంది.
- లచ్చయ్యపేట ఎన్‌సీఎస్, బీమసింగి సహకార చక్కెర కర్మాగారాలు పూర్తిగా మూతపడడంతో జిల్లాకు చెందిన చెరకు పంటను సంకిలి చక్కెర కర్మాగారానికి రైతులు రవాణా చేస్తున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి అటు చెరకు రైతులకు, ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యానికి అనుసంధానంగా కేన్ అధికారులు వ్యవహరిస్తున్నారు.
- లచ్చయ్యపేట ఫ్యాక్టరీని మూసివేయడంతో ఇక్కడ చెరకు అభివృద్ధి మండలి (సీడీసీ) కి ప్రభుత్వ పరంగా నామినేటెడ్ చైర్మన్, డైరెక్టర్ల నియామక ప్రక్రియ నిలిచిపోయింది. సీడీసీ పాలకవర్గం ఉంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫ్యాక్టరీ పరంగా చెరకు రైతులకు అమలు చేయాల్సిన పథకాలపై పర్యవేక్షణ ఉండేది. ఫ్యాక్టరీ పూర్తిగా మూతపడడంతో ఆ నామినేటెడ్ పదవులు కూడా లేకుండా పోయాయి.