Share News

can not change! ఏం మారలే!

ABN , Publish Date - Jan 13 , 2026 | 11:40 PM

can not change! జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అదుపులోకి రావడం లేదు. డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు తగ్గడం లేదు. నేటికీ చాలా మంది ప్రయాణంలో హెల్మెట్‌ను వాడడం లేదు. ఒకవైపు పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. న్యాయస్థానాలు కీలక ఆదేశాలు ఇస్తున్నాయి. జరిమానాలు, శిక్షల తీవ్రత పెరిగింది. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు. దీంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి.

 can not change! ఏం మారలే!

ఏం మారలే!

తగ్గని డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

హెల్మెట్‌ లేకుండానే ప్రయాణాలు

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు

భారీగా అపరాధరుసుం వసూలు

జైలుశిక్షలు అమలుచేస్తున్న కోర్టులు

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అదుపులోకి రావడం లేదు. డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు తగ్గడం లేదు. నేటికీ చాలా మంది ప్రయాణంలో హెల్మెట్‌ను వాడడం లేదు. ఒకవైపు పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. న్యాయస్థానాలు కీలక ఆదేశాలు ఇస్తున్నాయి. జరిమానాలు, శిక్షల తీవ్రత పెరిగింది. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు. దీంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి.

విజయనగరం, జనవరి 13(ఆంధ్రజ్యోతి):

హెల్మెట్‌ ధరించకపోవడం, పరిమితికి మించి ప్రయాణాలు చేయడం, అతివేగం, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, మైనర్ల వాహనాలు నడపడం వంటి కారణాలతో జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 2022లో జరిగిన ప్రమాదాల్లో 244 మంది మృతిచెందారు. 925 మంది క్షతగాత్రులయ్యారు. 2023లో 213 మంది మృతిచెందితే..826 మంది క్షతగాత్రులయ్యారు. 2024లో 166 మంది మృతిచెందితే 695 మంది క్షతగాత్రులయ్యారు. 2025లో 420 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 200 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. 65 వేల మందికి ఈ-చలానాలు విధించారు. 35 వేల మంది నుంచి జరిమానాలు వసూలు చేశారు. ఓ 100 మందికి న్యాయస్థానాలు ఒకటి నుంచి వారం రోజుల పాటు జైలుశిక్షలు కూడా విధించాయి. దాదాపు లక్ష వరకూ కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 274 వరకూ కేసులు నమోదయ్యాయి. అయినా సరే ప్రజల్లో ఎటువంటి మార్పు రావడం లేదు.

చట్టాలు కఠినం చేసినా..

గత ఏడాది మార్చి 1 నుంచి హెల్మెట్‌ ధారణకు సంబంధించి కీలక ఆదేశాలు వచ్చాయి. మార్చి1 కంటే ముందు హెల్మెట్‌ లేకుండా ప్రయాణానికి సంబంధించి రూ.135 జరిమానా వేసేవారు. మారిన నిబంధనలతో రూ.1000 కట్టాల్సిందే. లైసెన్స్‌ లేకుండా బండి నడిపితే రూ.10 వేలు వసూలు చేస్తారు. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు, రవాణా శాఖ సిబ్బందితో వాగ్వాదానికి దిగితే కేసులు నమోదు చేస్తారు. 90 రోజుల్లో జరిమానా కట్టకపోతే బండి సీజ్‌ చేస్తారు.

ప్రస్తుతం ఇలా..

హెల్మెట్‌ లేకుంటే రూ.1000, వెనుక కూర్చున్న వారు హెల్మెట్‌ ధరించకపోతే రూ.1000, వాహనానికి ఇన్సూరెన్స్‌ లేకపోతే రూ.1000, రెండోసారి పట్టుబడితే రూ.2000, భారీ సైలెన్సర్లతో సౌండ్‌ పొల్యూషన్‌కు పాల్పడితే రూ.2000, అదే రెండోసారి దొరికితే రూ.4000, పరిమితికి మించి వాహనాల్లో ఎక్కించుకుంటే మనిషికి రూ.200 చొప్పున జరిమానా విధిస్తారు. మైనర్లు డ్రైవింగ్‌ చేసి పట్టుబడితే రూ.1000, నిషేధం ఉన్న ప్రాంతాల్లో పార్కింగ్‌ చేస్తే రూ.1500 నుంచి రూ.2000, బైక్‌ రేసుల్లో పాల్గొంటే రూ.5000, రెండోసారి అందులో దొరికితే రూ.10,000, తాగి వాహనం నడిపితే మూడు నెలల జైలుశిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తున్నారు. కానీ ప్రజల్లో మాత్రం మార్పురావడంలేదు.

కేసులు ఇలా..

ద్విచక్రవాహనంపై హెల్మెట్‌లు లేకపోవటంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. 2024లో 64, 524 కేసులు నమోదుకాగా.. 2025లో 19, 966 కేసులు ఈ కారణంతోనే నమోదయ్యాయి.

ప్రజలు సహకరించాలి

ప్రజలు సహకరిస్తేనే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు తప్పకుండా హెల్మెట్లు పెట్టుకోవాలి. కార్లుపై వెళ్లేవారు షీటు బెల్టు పెట్టుకోవడం తప్పనిసరి. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే మాత్రం భారీ జరిమానాలు, జైలుశిక్ష తప్పదు. హైకోర్టు ఆదేశాల మేరకు జరిమానాలు, కేసులు నమోదుచేస్తాం. ప్రజల కోసం, ప్రజల బాగుకోసమే ఈ ప్రయత్నం. అందుకే ప్రజలు సహకరించాలి. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి.

- ఏఆర్‌ దామోదర్‌, ఎస్పీ, విజయనగరం

===================

Updated Date - Jan 13 , 2026 | 11:40 PM