Campaigning పురాల్లో ముగిసిన ప్రచారం
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:19 AM
Campaigning Concludes in Municipalities పుర పోరులో కీలక ఘట్టం ముగిసింది. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది.
పురపోరుకు సన్నద్ధం.. రేపు పోలింగ్
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
పార్వతీపురం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): పుర పోరులో కీలక ఘట్టం ముగిసింది. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నవంబరు ఒకటో తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. మూడో తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కాగా నిబంధనల ప్రకారం 48 గంటల ముందు పురాల్లో లౌడ్ స్పీకర్లు, బహిరంగ సభలు, ర్యాలీలతో కూడిన ప్రచారాలకు తెరపడింది. మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, వీడియోగ్రాఫర్ల ద్వారా నిరంతర నిఘాకు చర్యలు చేపడుతున్నారు.
- పార్వతీపురం మున్సిపాల్టీలో చైర్‌పర్సన్ రేసులో నలుగురు ఉన్నారు. కౌన్సిలర్ అభ్యర్థులుగా 122 మంది బరిలో ఉన్నారు. ఇక్కడ 36 వార్డులున్నాయి. సాలూరు మున్సిపాలిటీలో 32 వార్డుల్లో 85 మంది వివిధ పార్టీల నుంచి కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. చైర్‌పర్సన్ పదవికి గాను ఆరుగురు పోటీలో ఉన్నారు. పాలకొండ నగర పంచాయతీలో చైర్‌పర్సన్ రేసులో ముగ్గురు ఉన్నారు. 28 వార్డుల్లో 63 మంది కౌన్సిలర్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ ఒక వార్డు ఏకగ్రీవమైంది. అయితే వారంతా గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా ప్రచారాలు చేశారు.
- పార్వతీపురం పురపాలక సంఘంలో 40,765 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 19,452 మంది, మహిళలు 21,279మంది , ఇతరులు నలుగురు ఉన్నారు. సాలూరు మున్సిపాల్టీలో 41,934 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 20,039 మంది, మహిళలు 21,893 మంది ఉన్నారు. పాలకొండ నగర పంచాయతీలో 23,466 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 11,453 మంది, మహిళలు 12012 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు.
చివరి అస్ర్తాలపై దృష్టి..
ఎన్నికల ప్రచారం ముగియడంతో పోటీలో ఉన్న అభ్యరులు తమ విజయం కోసం మిగిలి ఉన్న చివరి అస్ర్తాలపై దృష్టి సారించారు. కొందరు ఓటరు స్లిప్పులను అందించి పోలింగ్ కేంద్రాల వివరాలను తెలియజేస్తున్నారు. తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మరికొందరు వార్డుల్లో ఉంటున్న ఓటర్లకు ఫోన్లు చేసి పోలింగ్‌కు రావాలని కోరుతున్నారు. ఇంకొందరు ప్రలోభాలతో ఓటర్లను ప్రసన్నం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేఉరకు తెరవెనుక వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరోవైపు వలస ఓటర్లను రప్పించేందుకు రానుపోను ప్రయాణ ఖర్చులు తామే భరిస్తామని వారి బంధువుల ద్వారా సమాచారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రారంభం
పార్వతీపురం/పార్వతీపురం రూరల్: జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభ మైంది. నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల విధులకు హాజరవుతున్న ఉద్యోగులు, సిబ్బంది శుక్రవారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దరఖాస్తు చేసుకున్న దూర ప్రాంతాల్లోని కేంద్ర ప్రభుత్వ విధుల్లో ఉన్న సర్వీసు ఓటర్లకు పోస్టల్ ద్వారా బ్యాలెట్లు పంపిస్తున్నారు.
మద్యం దుకాణాలు బంద్
పుర ఎన్నికల నేపఽథ్యంలో పార్వతీపురం, సాలూరు, పాలకొండలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆదివారం (నవంబరు-1) సాయంత్రం ఐదు గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అదేశించారు. నవంబరు 3న ఓట్లు లెక్కింపు సందర్భంగా .. ఆరోజు కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్రమ మద్యం నిల్వలు, రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ మద్యం నిల్వలపై సమాచారం ఉంటే.. ఎక్సైజ్ కంట్రోల్ రూం (88973 89271)కు తెలియజేయాలని కోరారు.