సంక్రాంతికి అత్తవారింటికి వచ్చి..
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:54 PM
మిత్రులతో కలసి మడ్డువలస రిజర్వాయర్‌లో నాటు పడవపై షికారుకు వెళ్లిన వ్యక్తి మృతిచెందాడు. పటువర్ధనం సమీపాన గల మడ్డువలస రిజర్వాయర్‌లో బుధవారం చోటుచేసుకున్నఈ సంఘటనకు సంబంధించి పోలీసులు స్థానికులు తెలిపిన వివరాలివీ
వంగర, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): మిత్రులతో కలసి మడ్డువలస రిజర్వాయర్‌లో నాటు పడవపై షికారుకు వెళ్లిన వ్యక్తి మృతిచెందాడు. పటువర్ధనం సమీపాన గల మడ్డువలస రిజర్వాయర్‌లో బుధవారం చోటుచేసుకున్నఈ సంఘటనకు సంబంధించి పోలీసులు స్థానికులు తెలిపిన వివరాలివీ.. విశాఖపట్నం జిల్లా గోకవరం మండలం ఎర్రపాలెం గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ (49) సంక్రాంతి పండుగకు పటువర్దనంలోని అత్తవారింటికి వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి నాటు పడవలో రిజర్వాయర్‌లో విహారానికి వెళ్లాడు. నాటు పడవ బోల్తా పడడం...రాజ్‌కుమార్‌కు ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. అతని స్నేహితులు విషయాన్ని గ్రామస్థులకు తెలపడంతో కొంతమంది యువకులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రిజర్వాయర్‌లో గాలించి... కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రాజ్‌కుమార్‌ను గుర్తించారు. వెంటనే ప్రైవేటు వాహనంలో రాజాం లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. విశాఖ జిల్లా గోకవరం మండలం ఎర్రపాలేనికి చెందిన రాజ్‌కుమార్‌కు నాలుగేళ్ల క్రితం పటువర్ధనానికి చెందిన తోరిక వాణితో వివాహమైంది. భార్య కూలి పనులు చేస్తుండగా...రాజ్‌కుమార్ ఆటో నడుపుతూ జీవించేవారు. వీరికి దయ, నవ్య అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పండగకు అత్తవారింటికి వచ్చిన రాజ్‌కుమార్ మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారు ఆస్పత్రి వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ షేక్ శంకర్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
రాజాం రూరల్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని బొద్దాం గ్రామ సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయాలకు గురయ్యారు. బస్సు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో బెహరా భవాని, బెహరా ఇషికా, దువ్వాపు రమణలు గాయపడ్డారు. స్థానికులు స్పందించి బాధితులను రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించి... ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం వారికి మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. గాయపడిన ముగ్గురూ మండల పరిధిలోని పెనుబాక గ్రామానికి చెందినవారిగా పొలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.