Never Returned అంత్యక్రియల కోసం వచ్చి.. అనంతలోకాలకు
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:13 AM
Came for the Funeral… Never Returned అంత్యక్రియల కోసం విశాఖ నుంచి మన్యం జిల్లాకు వచ్చిన వారు.. తిరిగి ఇళ్లకు చేరుకోలేదు. చెరువులో స్నానానికి దిగిన యువకులు ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
నీట మునిగి ఇద్దరు విశాఖ వాసులు మృతి
కొమరాడ మండలంలో ఘటన
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
కొమరాడ, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): అంత్యక్రియల కోసం విశాఖ నుంచి మన్యం జిల్లాకు వచ్చిన వారు.. తిరిగి ఇళ్లకు చేరుకోలేదు. చెరువులో స్నానానికి దిగిన యువకులు ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాదకర ఘటన కొమరాడ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మార్కొండపుట్టి గ్రామానికి చెందిన కలిపింటి నారాయణమ్మ (80) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఆమె కుమారుడు కలిపిండి శ్రీనివాసరావు శనివారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న విశాఖపట్నంలో ఉంటున్న శ్రీనివాసరావు తోడల్లుడు తామరపు మల్లేశ్వరరావు కుమారుడు భరత్ (20), నలుగురు స్నేహితులతో కలిసి మార్కొండపుట్టికి వచ్చాడు. దహన సంస్కరణల కార్యక్రమంలో వారంతా పాల్గొన్నారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత శ్మశానవాటిక పక్కనే ఉన్న చెరువు వద్దకు ఐదుగురు యువకులు వెళ్లారు. స్నానం చేస్తుండగా భరత్ (20)తో పాటు స్నేహితుడు ఎస్.దుర్గా ప్రసాద్ (17) చెరువులోని లోతైన ప్రాంతంలోకి వెళ్లి నీటమునిగిపోయారు. మిగిలిన ముగ్గురు స్నేహితులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నీటమునిగిన వారిలో ఒకరిని ఒడ్డుకు తెచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ ముగ్గురు స్నేహితులు ఒడ్డుకు చేరుకుని కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. దీంతో ఆందోళన చెందిన వారు పోలీసులకు సమాచారం అందించారు. కొమరాడ ఎస్‌ఐ జగదీష్‌నాయుడు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువులో గల్లంతయిన యువకుల కోసం గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు గంట తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు చెరువులో యువకుల మృతదేహాలను గుర్తించి.. ఒడ్డుకు చేర్చారు. విగతజీవులుగా పడి ఉన్న యువకులను చూసి కుటుంబ సభ్యులు, బంధువులు భోరున విలపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి పంపించినట్టు ఆయన చెప్పారు.
కుటుంబాల నేపథ్యమిదీ..
- మృతుల్లో ఎస్.దుర్గాప్రసాద్ తల్లి కొన్నాళ్ల కిందట చనిపోయింది. తండ్రి ప్రమోద్‌కుమార్ సరిగా చూడకపోవడంతో తన చెల్లితో కలిసి విశాఖపట్నం అక్కయ్యపాలెంలోని పిన్ని ఇంటిలో ఉంటున్నాడు. ప్రస్తుతం జగన్నాథపురం బాసర కాలేజ్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నట్లు బంధువులు తెలిపారు. కాగా దుర్గా ప్రసాద్ మృతితో సోదరి కన్నీరుమున్నీరైంది.
- భరత్ ఇంటర్ మధ్యలో చదువు ఆపేసి ఖాళీగా ఉంటున్నాడు. తండ్రి మల్లేశ్వరరావు విశాఖపట్నం జైల్లో రోడ్డు జంక్షన్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారంతా ఇసుకతోటలో ఉంటున్నారు. భరత్ సోదరికి వివాహం జరిగింది. కాగా చేతికందొచ్చిన కొడుకు మరణాన్ని మల్లేశ్వరరావు జీర్ణించుకోలేకపో తున్నారు. బిడ్డ జ్ఞాపకాలను తలుచుకుని గుండెలవిసేలా రోదించారు.