Share News

But not change! అయినా మారరే!

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:40 PM

But not change! నాలుగు రోజుల కిందట విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లే మార్గంలో 550 బైక్‌ సైలెన్సర్లను పోలీసులు రోడ్డు రోలార్‌తో ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ శబ్దాలనిచ్చే ఈ సైలెన్సర్లను అమర్చిన యువత నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఆరు నెలల కాలంలో తనిఖీల్లో పట్టుబడిన సైలెన్సర్లను ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రోలర్‌తో ధ్వంసం చేశారు.

But not change! అయినా మారరే!
సైలెన్సర్లను రోలర్‌తో ధ్వంసం చేస్తున్న దృశ్యం

అయినా మారరే!

రోతపుట్టిస్తున్న బైక్‌ సైలెన్సర్లు

జిల్లా వ్యాప్తంగా పోలీస్‌ శాఖ డ్రైవ్‌

పట్టుబడినవి కొన్నే..

కఠిన చర్యలకు దిగితేనే ఫలితం

నాలుగు రోజుల కిందట విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లే మార్గంలో 550 బైక్‌ సైలెన్సర్లను పోలీసులు రోడ్డు రోలార్‌తో ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ శబ్దాలనిచ్చే ఈ సైలెన్సర్లను అమర్చిన యువత నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఆరు నెలల కాలంలో తనిఖీల్లో పట్టుబడిన సైలెన్సర్లను ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రోలర్‌తో ధ్వంసం చేశారు.

రాజాం, మార్చి 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో యువత నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లను అమర్చి బైక్‌లు నడుపుతున్నారు. దీనిపై అనేకసార్లు హెచ్చరించిన పోలీసులు ఇక ఉపేక్షించేది లేదంటూ చర్యలకు దిగారు. గత ఆరు నెలలుగా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన 550 బైక్‌ సైలెన్సర్లను తొలగించారు. రూ.1500 చొప్పున రూ.8.25 లక్షల అపరాధ రుసుం వసూలు చేశారు. అయినా జిల్లాలో ఇంకా భారీ శబ్దం ఇచ్చే సైలెన్సర్లతో బైక్‌లు రాకపోకలు సాగిస్తూనే ఉన్నాయి.

రోడ్లపై మితిమీరిన వేగంతో, చెవులకు చిల్లుపడే శబ్దంతో వెళ్తున్న వాహనాలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఆ వాహనం పలానా కంపెనీ అని తెలుసుకోవడానికి వీలులేని స్థితిలో కుర్రకారు మార్చేస్తున్నారు. ముఖ్యంగా సైలెన్సర్లు (పొగ గొట్టాలు)ను మార్చి...భారీ శబ్ధాలనిచ్చే సైలెన్సర్లను అమరుస్తున్నారు. వైల్డ్‌బోర్‌, కాక్‌టైల్‌ షార్మర్‌, డాల్ఫిన్‌, మెగాఫోన్‌, టెయిల్‌గన్నర్‌ వంటి రకరకాల పేరుతో వచ్చే ఈ సైలెన్సర్లు భారీ శబ్ధాన్నిస్తాయి. రూ.10 వేల నుంచి రూ.23 వేల వరకూ వీటి ధర పలుకుతోంది. అనుసంధానంగా ఇతరత్రా పరికరాలు అమర్చేందుకు మెకానిక్‌కు మరో రూ.3 వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. వీటి ధర అధికమైనా లెక్క చేయడం లేదు. ఆరోగ్యానికి హానికరమైనా, పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నా, పోలీసులు హెచ్చరిస్తున్నా బేఖాతరు చేస్తున్నారు.

మారిపోతున్న వాహనం..

జిల్లాలో ఇటీవల ద్విచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఇందులో కళాశాల యువత కొనుగోలు చేసే రేస్‌ బైక్‌లే అధికం. షోరూముల్లో కొనుగోలు చేసినప్పుడు అవి సాధారణ బైక్‌లే. కానీ తరువాత వాటికి ఇష్టారాజ్యంగా విడిభాగాలను అమర్చుతున్నారు. సైలెన్సర్లతో పాటు హ్యాండిల్‌, వీల్స్‌ను ఆకర్షవంతంగా, తమ అభిరుచులకు అనుగుణంగా మార్చేస్తున్నారు. కాలం చెల్లిన పాత బైక్‌లను సైతం అందంగా రంగులు అద్ది రోడ్లపై తిప్పుతున్నారు. ముఖ్యంగా పాత ఆర్‌ఎక్స్‌-100, బుల్లెట్‌, కేటీఎం రేస్‌ బైక్‌లను వినియోగిస్తున్నారు. ఇందులో 90 శాతం వాహనాలు పర్యావరణానికి, ఇటు ప్రజలకు ఇబ్బంది కలిగించేవే. ఈ వాహనాల సైలెన్సర్లలో కొద్దిపాటి మార్పుచేస్తే అవి వెలువరించే శబ్దం ప్రత్యేకం. ఎదుటి వారికి అసౌకర్యం. ఇవేవీ పట్టకుండా కుర్రకారు రహదారులపైకి వస్తుండడం రోత పుట్టిస్తోంది. వాస్తవానికి ప్రతీ మోటారు వాహనం కంపెనీ తమ బైక్‌కు నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత డెసిబుల్‌ శబ్దాన్ని వెలువరించే నిర్దిష్ట ప్రమాణాలతో సైలెన్సర్‌ను తీర్చిదిద్దుతారు. అలాంటి డిజైన్లకే రవాణా శాఖ అనుమతిస్తుంది. మనిషి సాధారణంగా 60 డెసిబుల్స్‌ వరకూ శబ్దం వినగలరు. అంతకు మించిన శబ్దం వింటే కర్ణభేరిపై ప్రభావం పడుతుంది. వినికిడి లోపం కలుగుతుంది.

చట్టం చెబుతున్నదిదే..

ఒక వాహనం నిర్ణీత డెసిబుల్స్‌ కంటే ఎక్కువ శబ్ద కాలుష్యం చేస్తే అది మోటారు వాహన చట్టం ప్రకారం నేరం. నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యం చేస్తే ఆ వాహనదారుడిపై ఎంవీఐ యాక్ట్‌ 1988 సెక్షన్‌ 190(2) ప్రకారం పోలీసులు కానీ రవాణా శాఖ అధికారులు కానీ కేసు నమోదు చేయవచ్చు. సంబంధిత వాహనదారుడికి తొలిసారి అయితే రూ.1,000 జరిమానాతో పాటు కేసు నమోదు చేయవచ్చు. రెండోసారి పట్టుబడితే రూ.2 వేలు జరిమానాతో పాటు కఠిన చర్యలకు సిఫారసు చేయవచ్చు. మోటారు కంపెనీ ఉత్పత్తి చేసిన బైక్‌ను ఎట్టి పరిస్థితుల్లో విడి పరికరాలు మార్చకూడదు. ఇది చట్టరీత్యా నేరం. అందుకే జిల్లా పోలీస్‌ శాఖ కఠిన చర్యలకు దిగింది. ఇప్పటికైనా ఈ భారీ శబ్దం ఇచ్చే సైలెన్సర్లకు చెక్‌ పడుతుందో? లేదో? చూడాలి.

చట్టరీత్యా నేరం

అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లను వినియోగించడం నేరం. కళాశాల యువతే ఎక్కువగా వినియోగిస్తున్నట్టు తనిఖీల్లో తేలింది. అందుకే పిల్లల కదలికపై, వారు వినియోగించే బైక్‌లపై తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలి. ఇప్పటికైనా అధిక శబ్దం ఇచ్చే సైలెన్సర్లను అమర్చిన వారు వాటిని తొలగించాలి. లేకుంటే జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తాం.

- కె.అశోక్‌కుమార్‌. సీఐ, రాజాం

అనర్థాలు అధికం

ఎక్కువ డెసిబుల్‌ శబ్దం కలిగించే సైలెన్సర్లతో అనర్థాలు అధికం. వినికిడి లోపంతో పాటు మానసిక వ్యాధులు కలుగుతాయి. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఈ శబ్దం వింటే పెను ప్రభావం చూపవచ్చు. చిరాకుతో పాటు విపరీతమైన కోపం, తలనొప్పికి సైలెన్సర్ల శబ్దాలు కారణమవుతాయి. అందుకే యువత ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి.

- సామంతుల కిరణ్‌ఖుమార్‌, వైద్యుడు, రాజాం

Updated Date - Mar 26 , 2026 | 11:40 PM