Bustle of nominations in Rajam రాజాంలో నామినేషన్ల కోలాహలం
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:23 AM
Bustle of nominations in Rajam రాజాం మునిసిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు చివరిరోజు కావడంతో పట్టణంలో సోమవారం ఎన్నికల కోలాహలం కనిపించింది. కూటమి అభ్యర్థులతో పాటు వైసీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ఉత్సాహంగా కదిలారు.
రాజాంలో నామినేషన్ల కోలాహలం
చైర్‌పర్సన్ పదవికి 14 మంది నామినేషన్ల దాఖలు
రాజాం / రూరల్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాజాం మునిసిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు చివరిరోజు కావడంతో పట్టణంలో సోమవారం ఎన్నికల కోలాహలం కనిపించింది. కూటమి అభ్యర్థులతో పాటు వైసీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ఉత్సాహంగా కదిలారు. నిర్దేశిత పత్రాలతో నామినేషన్‌లను ఎన్నికల అధికారులకు సమర్పించారు. చీపురుపల్లి రోడ్‌లోని ఆంజనేయ దేవాలయం నుంచి జనసేన చైర్‌పర్సన్ అభ్యర్థిగా బనిశెట్టి సౌజన్యలత టీడీపీ నాయకులతో కలిసి ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా పాలవలస పద్మావతి నామినేషన్ వేశారు. ఆమె వెంట విజయనగరం మాజీ ఎంపి బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం మాజీ డిప్యుటిమేయర్ కోలగట్ల శ్రావణి, రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి డా.తలే రాజేష్, రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఫ టీడీపీ నుంచి టికెట్ ఆఽశించి భంగపడ్డ పలువురు అభ్యర్థులు కౌన్సిలర్ స్థానాలకు ఇండిపెండెంట్‌లుగా నామినేషన్లు వేశారు. పట్టణానికి చెందిన ప్రముఖ బంగారం వ్యాపారి కొత్తా మధుసూధనరావు ఎనిమిదో వార్డు నుంచి కౌన్సిలర్‌గా నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.
చైర్‌పర్సన్ పదవికి 14 మంది నామినేషన్లు
రాజాం మునిసిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం సోమవారం మధ్యాహ్నం అధికారికంగా ముగిసినప్పటికీ అభ్యర్థుల సంఖ్య రాత్రి పది గంటల సమయంలో తేలింది. సహాయ ఎన్నికల అథారిటీ, రాజాం మునిసిపల్ కమిషనర్ ఆకురాతి రామచంద్రరావు అందించిన వివరాల ప్రకారం.. రాజాం మునిసిపాలిటీలో 32 వార్డులకు గాను చైర్‌పర్సన్ పదవి కోసం 14 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కౌన్సిలర్ల విషయానికొస్తే.. కూటమి, వైసీపీ, ఇండిపెండెంట్, రెబల్ అభ్యర్థులు కలిపి 240 మంది నామినేషన్లు వేశారు. వీరిలో అత్యధికంగా వైసీపీ నుంచి 118 మంది, బీఎస్పీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ముగ్గురు, టీడీపీ నుంచి 69, జనసేన నుంచి 16, 32 మంది స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇదిలా ఉంటే నామినేషన్ల పరిశీలన ఈనెల 17న జరగనుంది. 18, 19 తేదీలలో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు.