Share News

Bus పల్లెకు చేరని బస్సు

ABN , Publish Date - May 11 , 2026 | 11:58 PM

Bus Yet to Reach the Village జిల్లాలో పలు గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసు సేవలు అందడం లేదు. ఆక్యుపెన్సీ లేదనే కారణంతో మారుమూల గ్రామాలకు సర్వీసులు నిలిచి పోయాయి. రోడ్డు సదుపాయం ఉన్నా.. వివిధ మండల కేంద్రాలకు కూడా బస్సులు వెళ్లడం లేదు.

Bus   పల్లెకు చేరని బస్సు

  • రద్దీగా ఉన్న మార్గాల్లోనే సర్వీసులు

  • గ్రామీణ ప్రాంతవాసులకు తప్పని ఇక్కట్లు

  • తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్న వైనం

  • ఉన్నతాధికారులు స్పందించాలని విన్నపం

పార్వతీపురం, మే11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసు సేవలు అందడం లేదు. ఆక్యుపెన్సీ లేదనే కారణంతో మారుమూల గ్రామాలకు సర్వీసులు నిలిచి పోయాయి. రోడ్డు సదుపాయం ఉన్నా.. వివిధ మండల కేంద్రాలకు కూడా బస్సులు వెళ్లడం లేదు. నైట్‌ హాల్ట్‌ సర్వీసులను సైతం రద్దుచేశారు. దీంతో పల్లెవాసులకు ఇక్కట్లు తప్పడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వారంతా ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.

ఇదీ పరిస్థితి..

- జిల్లాలో సాలూరు, పార్వతీపురం, పాలకొండలో ఆర్టీసీ డిపోలున్నాయి. వాటి పరిధిలో నిత్యం ఎన్నో బస్సులు నడుస్తున్నాయి. అయితే పల్లె ప్రాంతాలకు అవి చేరడం లేదు. గతంలో ఉన్న సర్వీసులను సైతం రద్దు చేసి... లాభాలొచ్చే మార్గాల్లోనే బస్సులను నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి.

- పార్వతీపురం మండలంలో వీఆర్‌పేట, గోపాలపురం, లక్ష్మీనారాయణపురం, పెదమరికి తదితర గ్రామాలకు పక్కా రహదారులు ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేదు. గతంలో పెదమరికి వరకు బస్సు సర్వీసులు నడిచేవి. ఆ తర్వాత ఆక్యుపెన్సీ లేదనే కారణంతో ఆయా గ్రామాలను ఆర్టీసీ సేవలను నిలిపివేశారు. దీంతో పెదమరికితోపాటు కృష్ణపల్లి, లక్ష్మీనారా యణపురం, బండిదొరవలస తదితర గ్రామాల ప్రజలు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.

- కురుపాం నియోజకవర్గంలో జియ్యమ్మవలస మండలానికి సంబంధించి చాలావరకు నైట్‌హాల్ట్‌ బస్సులను రద్దు చేశారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పార్వతీపురం నుంచి చిన్నబుడ్డిడి, పెద్దబుడ్డిడి, టీకే జమ్ములకు ఉన్న నైట్‌హాల్ట్‌ బస్సులను పూర్తిగా రద్దు చేశారు. పార్వతీపురం గడిసంగిపురం వరకు నడిచిన ఆర్టీసీ సర్వీసులను రద్దు చేసి జియ్యమ్మవలస వరకే పరిమితం చేశారు. ఇకపోతే జియ్యమ్మవలస నుంచి విశాఖ వరకు ఉన్న ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా రద్దు చేశారు. దీంతో విశాఖపట్నం, విజయగనరం వెళ్లాల్సిన ప్రజలు పార్వతీపురం వచ్చి బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇక గుమ్మలక్ష్మీపురం నుంచి గౌడుగూడ , కురుపాం నుంచి పూడి వెళ్లే బస్సులను సైతం కొద్దికాలం కిందట రద్దు చేశారు.

- పాలకొండ డిపో నుంచి బత్తిలి- భామిని, కొత్తూరు-సీతంపేటకు వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపేశారు. దీంతో సీతంపేట ఐటీడీఏ, పాలకొండ సబ్‌ కలెక్టరేట్‌కు వెళ్లాలంటే ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. భామిని, బత్తిలి రూటు శ్రీకాకుళం పరిధిలో ఉండడంతో పాలకొండ డిపో బస్సులు నిలిపివేసినట్లు తెలిసింది.

- ప్వాతీపురం నుంచి ఒడిశా సరిహద్దు ప్రాంతం అలమండ తదితర గ్రామాలకు కూడా జిల్లా కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. గుమ్మలక్ష్మీపురం, కురుపాం తదితర మండల కేంద్రాలకు కూడా బస్సులు సక్రమంగా వెళ్లడం లేదు.

Updated Date - May 11 , 2026 | 11:58 PM