Share News

మండుతున్న ఎండలు

ABN , Publish Date - Apr 03 , 2026 | 11:45 PM

జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు.

మండుతున్న ఎండలు
శుక్రవారం మధ్యాహ్నం ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద జనసంచారం లేక నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు

- జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

- 35 డిగ్రీలకుపైగా నమోదు

- ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

విజయనగరం రూరల్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. దీంతో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో రాకపోకలు సాగించేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఎండవేడిమిని తట్టుకునేందుకు కొందరు గొడుగులు వేసుకుని.. మరికొందరు మహిళలు చున్నీలు, చీర కొంగులను పైన కప్పుకొని రాకపోకలు సాగిస్తున్నారు. ఎండల తీవ్రతతో విజయనగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3.30 గంటల వరకు రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఫుట్‌పాత్‌ వ్యాపారులు సైతం ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకూ, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని, ఈ మేరకు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం 4 గంటల తరువాత క్రమేణా ఉష్ణోగ్రతలు తగ్గినా, వేడి మాత్రం రాత్రి వరకూ కొనసాగుతుందని అంటున్నారు. పిల్లలు, గర్భిణిలు, బాలింతలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Updated Date - Apr 03 , 2026 | 11:45 PM