Burden on Common People సామాన్యులపై గుడి‘బండ’
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:58 PM
Burden on Common People పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ ధర భారీగా పెరిగింది. గృహ వినియోగానికి సంబంధించి ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115లు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఉజ్వల్ గ్యాస్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పులు లేవు.
యుద్ధం ఎఫెక్ట్.. ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.60 పెంపు
కమర్షియల్ సిలిండర్‌పై రూ.114 వడ్డింపు
జిల్లా వినియోగదారులపై రూ.కోటి 90 లక్షల అదనపు భారం
పార్వతీపురం, మార్చి7(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ ధర భారీగా పెరిగింది. గృహ వినియోగానికి సంబంధించి ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115లు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఉజ్వల్ గ్యాస్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పులు లేవు. పెరిగిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.877.50 ఉండేది. తాజాగా రూ.60 పెరగడంతో దాని ధర రూ. 937కు చేరింది. దీనివల్ల జిల్లా ప్రజలపై సుమారు రూ. కోటి 90 లక్షలు మేర అదనంగా భారం పడనుంది. ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు నింగినంటు తుండగా.. మరోవైపు గ్యాస్ ధర అమాంతం పెరగడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 3,16,359 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో దీపం కనెక్షన్లు 1,08,485 ఉన్నాయి. గిరిజనుల ప్యాకేజీ కింద 19,084 (ఐదు కేజీల సిలిండర్లు), సీఎస్‌ఆర్ కనెక్షన్లు 9,238, పీఎంయూవై కనెక్షన్లు 34,032 , జనరల్ కనెక్షన్లు 1,45,520 వరకూ ఉన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం.. 14.2 కిలోల గ్యాస్ వినియోగదారులపై రూ. కోటి 86 లక్షలు , ఐదు కేజీల గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్న గిరిజనులపై సుమారు రూ.నాలుగు లక్షల వరకు అదనపు భారం పడుతుంది.
- జిల్లాలో వాణిజ్య అవసరాలకు వినియోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు ఎటువంటి రాయితీ ఉండదు. ప్రస్తుతం 19 కేజీల సిలిండర్ ధరపై అదనంగా రూ.115 పెంచారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార ఉత్పత్తుల సంస్థలపై ప్రభావం పడనుండగా.. అయితే ఈ భారం కూడా పరోక్షంగా ప్రజలపై పడుతుంది. గ్యాస్ ధర పెరిగిందని సాకుగా చూపి ఏకంగా ఆహార ఉత్పత్తుల ధరలు పెంచే అవకాశం ఉంది.
పెంపు ఆందోళనకరమే..
వంట గ్యాస్ సిలిండర్ పెంపు బాధాకరం. ఒక్కసారిగా రూ.60 పెంచడం అంటే మాలాంటి వినియోగదారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉంది. ఇటువంటి సమయంలో ధర పెరగడం ఆందోళనకరం. వెంటనే ధరను తగ్గించాలి.
- కె.శ్రీనివాసరావు, పార్వతీపురం...
============================
ధర తగ్గించాలి
యుద్ధం ప్రభావంతో గ్యాస్ ధర పెరగడం ఆందోళనకరంగా ఉంది. సిలిండర్‌కు రూ.60 పెంచడం దారుణం. పేదలపై ఇది పెనుభారమే. గ్యాస్ ధర తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలి.
- రామారావు, పార్వతీపురం