Burden of arrears... loss of employment బకాయిల భారం.. ఉపాధి దూరం
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:13 AM
Burden of arrears... loss of employmentచేనేత కార్మికుల బతుకులు మారడం లేదు. ఒకప్పటిలా విరివిగా ఉపాధి దొరకడం లేదు. ప్రత్యామ్నాయ అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపురించింది. యంత్రాలతో తయారయ్యే మిల్లు, పవర్‌లూమ్ వస్త్రాలతో పోటీపడే పరిస్థితి లేదు. మరోవైపు వారికి పనులు కల్పించి ఆర్థికంగా అండగా ఉండాల్సిన సహకార సంఘాలకు తాళాలు పడుతున్నాయి.
బకాయిల భారం.. ఉపాధి దూరం
చేనేత కార్మికులకు ఆర్థిక ఇబ్బందులు
పని చూపించాల్సిన సహకార సంఘాలు డీలా
ఆప్కో నుంచి వసూలు కాని బకాయిలు
సంఘాల్లో పేరుకుపోతున్న వస్త్రాలు
నేడు జాతీయ చేనేత దినోత్సవం
చేనేత కార్మికుల బతుకులు మారడం లేదు. ఒకప్పటిలా విరివిగా ఉపాధి దొరకడం లేదు. ప్రత్యామ్నాయ అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపురించింది. యంత్రాలతో తయారయ్యే మిల్లు, పవర్‌లూమ్ వస్త్రాలతో పోటీపడే పరిస్థితి లేదు. మరోవైపు వారికి పనులు కల్పించి ఆర్థికంగా అండగా ఉండాల్సిన సహకార సంఘాలకు తాళాలు పడుతున్నాయి. కార్మికులు తయారు చేసిన చీరలు సంఘ కార్యాలయాల్లో పేరుకుపోవడం.. అమ్ముడైన వాటికి ఆప్కో నుంచి బిల్లులు రాకపోవడం వెరసి చాలా సహకార సంఘాలు మూతపడిపోయాయి. పనుల్లేక కార్మికులు వలసబాట పడుతున్నారు.
రాజాం/రూరల్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో 13 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,500 మంది సభ్యులు కొనసాగుతున్నారు. గతంలో 4 వేల మందికిపైగా సభ్యులు ఉండేవారు. ఈ రంగానికి ఆదరణ తగ్గడంతో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు వెళ్లిపోయారు. ప్రస్తుతం కోటగండ్రేడు, కొట్టక్కి, బొద్దాం, రాజాం, పెనుబాక సహకార సంఘాల్లో మాత్రమే కార్మికులు వస్త్రాలను తయారు చేస్తున్నారు. వైసీపీ హయాంలో చేనేత నేస్తం పథకం మినహా కార్మికులకు ఎటువంటి సహకారం లభించలేదు. గతంలో ప్రభుత్వాలు రాయితీపై బ్యాంకు రుణాలు, మగ్గాలు, ఇతరత్రా పరికరాలు అందించేవి. చేనేత కార్పొరేషన్ ద్వారా విరివిగా రుణాలు కూడా అందేవి. క్రమేపీ అవన్నీ నిలిచిపోయాయి. ప్రధానంగా సంఘాలలో పేరుకుపోతున్న సరుకు అమ్ముడుపోవడం లేదు. అలాగే అమ్మిన వస్త్రాలకు చెల్లింపులు జరగడం లేదు. దీంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
నిలిచిపోయిన కార్యకలాపాలు
జిల్లాలో హెచ్చుమంది చేనేత కార్మికులు రాజాం నియోజకవర్గంలోనే ఉన్నారు.. రాజాంలోని మల్లిఖార్జున, పెనుబాక, బొద్దాంలోని చేనేత సహకార సంఘాలు మంచిస్థాయిలో ఉండేవి. కార్మికులకు వెన్నుదన్నుగా ఉండడంతో వారికి చేతినిండా పని దొరికేది. నాలుగురాళ్లు రావడంతో అయిదేళ్లూ నోటికి వెళ్లేవి. అయితే చాలాకాలంగా సంఘాలకు పాలకవర్గాలు లేకపోవడంతో కార్మికుల కష్టసుఖాలు చూసేనాథుడే కరువయ్యాడు. అధికారులు పర్సన్ ఇన్‌చార్జిలుగా ఉన్నారు. నిధులు లేవంటూ వారూ సంఘాలకు తాళాలు వేసుకూర్చున్నారు. కొన్ని నెలలుగా చేనేత సహకార సంఘాల కార్యకలాపాలు నిలిచిపోయాయి.
చేనేత శాల ఎప్పుడు?
జిల్లాలో చేనేత కార్మికుల కోసం రాజాం మండలం పెనుబాకలో చేనేత శాల ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో చేనేత కార్మికులు అధికంగా ఉన్నారు. అక్కడ చేనేత శాల ఏర్పాటుచేశారు. అటువంటి చేనేత శాల జిల్లాలో ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. రాజాం మండలం పెనుబాక సరైన ప్రాంతమని ఎంపిక చేసింది. ఇది జరిగి రెండేళ్లు అవుతున్నా ఎటువంటి పురోగతి లేదు. చేనేత కార్మిక కుటుంబాలకు ఉచిత విద్యుత్ కాస్త అండగా ఉంటోంది. మర మగ్గాలకు నెలకు 500 యూనిట్లు, సాధారణ మగ్గాలకు 200 యూనిట్లు ఉచితంగా అందిస్తోంది. జిల్లాలో 750 కుటుంబాల వరకూ ప్రయోజనం చేకూరుతోంది.
బకాయిలు పేరుకుపోయి..
కార్మికులకు చేనేత సహకార సంఘాలు నూలును సమకూరుస్తాయి. వీటితో కార్మికులు వస్త్రాలను నేసి తిరిగి సహకార సంఘాలకు అప్పగిస్తారు. ఈమేరకు సంఘాలు కార్మికులకు మజూరీ(కూలి) అందజేస్తుంది. ఈ వస్త్రాలను సంఘాలు ఆప్కోకు విక్రయిస్తాయి. గతంలో ఈ ప్రక్రియ ఆశాజనకంగా ఉండేది. అయితే ఆప్కో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం నుంచి ఆప్కోకు బకాయిలు పేరుకుపోయాయి. ఫలితంగా సంఘాలకు రావాల్సిన మొత్తం నిలిచిపోయింది. జిల్లాలోని ప్రధానమైన ఎనిమిది సహకార సంఘాలకు రూ.1.70 కోట్లు బకాయిలున్నాయి. వీటికోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా అతీగతీ లేకుండా పోతోంది.
ఫ చేనేత కార్మికుల ఉత్పత్తులైన లుంగీలు, తువ్వాళ్లు, దుప్పట్లను సంక్షేమ వసతిగృహాల కోసం ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేయాలని ఉత్తర్వులున్నా ఆ దిశగా అడుగులు పడడంలేదు.
ప్రభుత్వానికి నివేదించాం
వెంకటేశ్వర్రావు, చేనేత, జౌళిశాఖ అధికారి, విజయనగరం
జిల్లాలో చేనేత సహకార సంఘాలకు ఆప్కో బకాయిలు పేరుకుపోవడం వాస్తవమే. కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల్ని ప్రభుత్వానికి పలుమార్లు నివేదించాం. కార్మికులకు పనులు కల్పించేందుకు శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం.
సంఘాలకు బకాయిలు ఇలా..
..........................................................................................................................
గ్రామం సంఘం పేరు బకాయిలు
(లక్షల్లో)
...........................................................................................................................
రాజాం మల్లికార్జున 68.00
పెనుబాక విశ్వేశ్వర 49.50
బొద్దాం రామలింగేశ్వర 48.00
మామిడిపల్లి అన్నపూర్ణ 1.00
సురవరం అంబికేశ్వర 0.50
కోటగండ్రేడు ఉమామహేశ్వర 1.00
వల్లంపూడి బాపూజి 0.50
కొట్టక్కి కొట్టక్కి 1.50
....................................................................................................................