Public Contributions! చందాలతో బాగు చేసుకుని..!
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:56 PM
Built Better with Public Contributions! తోటపల్లి పాత రెగ్యులేటర్ పరిధిలోని కుడి కాలువకు చెందిన షట్టరును వినియోగంలోకి వచ్చింది. రైతులే కొంత మొత్తాన్ని పోగు చేసి దీనికి మరమ్మత పనులు చేపట్టారు.
యథావిధిగా సాగు, తాగునీరు సరఫరా
రబీ వరి సాగుకు సన్నద్ధం
గరుగుబిల్లి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): తోటపల్లి పాత రెగ్యులేటర్ పరిధిలోని కుడి కాలువకు చెందిన షట్టరును వినియోగంలోకి వచ్చింది. రైతులే కొంత మొత్తాన్ని పోగు చేసి దీనికి మరమ్మత పనులు చేపట్టారు. షట్టరు రిపేరైన కారణంగా కొద్దిరోజుల నుంచి సాగు, తాగునీరు సరఫరా కావడం లేదు. దీనిపై ఈ నెల 9న ‘ఆంధ్రజ్యోతి’లో ‘అటు నిరంతరం - ఇటు అవాంతరం’ శీర్షికతో కథనం ప్రచురితమైనా అధికారులు స్పందించలేదు. నిధులు సమస్య కారణంగా సంబంధిత రెగ్యులేటర్ నిర్వహణపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో దీంతో రైతులే ముందుకు వచ్చి సాగునీరు సరఫరాకు అవసరమైన చర్యలకు పూనుకున్నారు. ప్రస్తుతం ఎడమ, కుడి ప్రధాన కాలువల నుంచి సాగునీరు సరఫరా అవుతుండడంతో రైతులు రబీసాగుకు సన్నద్ధమవుతున్నారు. పాలకొండ, గరుగుబిల్లితో పాటు వంగర మండలాల పరిధిలోని వారు వరి నారుమళ్లు సిద్ధం చేసుకున్నారు. ఈ ఏడాది ఎడమ ప్రధాన కాలువకు చెందిన షట్టరు మరమ్మతులకు గురికా వడంతో నీరు అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఖరీఫ్ నుంచి యథావిధిగా సాగునీరు సరఫరా అవుతుంది. ఈనేపథ్యంలో రైతులు రబీలో తేలిక రకం వరి సాగుపై మొగ్గు చూపుతున్నారు. కుడి కాలువ పరిధిలోని వారు కూడా వరి సాగుపై దృష్టి సారించారు. ఇప్పటికే పంట పొలాల్లో దమ్ము నిర్వహించారు. ఇదిలాఉండగా ప్రాజెక్టులో నీటి నిల్వలకు అనుగుణంగానే సరఫరా చేయనున్నట్లు ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆరుతడి పంటలతో పాటు తాగునీటికే ప్రాధాన్యం ఇస్తున్నాం తప్ప వరి సాగుకు కాదని ప్రకటించారు. ఎడమ ప్రధాన కాలువ షట్టరు మరమ్మతులకు సుమారు రూ.20 లక్షలు అవసరమని, ఈ సమస్యను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లామని రెగ్యులేటర్ ఏఈ డీవీ రమణ తెలిపారు. షట్టరు మరమ్మతుల నిర్వహణకు నిపుణులు రావాల్సి ఉందన్నారు. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతామని వెల్లడించారు. ప్రస్తుతం ఎడమ ప్రధాన కాలువ నుంచి సుమారు 30 వేల ఎకరాలకు, కుడి కాలువ నుంచి 9 వేల ఎకరాలకు పైగా ఆరుతడి పంటలకు నీరు సరఫరా అవుతుందన్నారు. తాగునీటి సరఫరాకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు.