Build It, Reap Prosperity! నిర్మిస్తే.. సస్యశ్యామలమే!
ABN , Publish Date - Jun 29 , 2026 | 11:53 PM
Build It, Reap Prosperity! కురుపాం నియోజకవర్గంలో గుమ్మిడిగెడ్డ రిజర్వా యర్ నిర్మాణం ఎన్నికల హామీగా మారింది. ఏళ్లు గడుస్తున్నా.. నిర్మాణం దిశగా అడుగులు పడడం లేదు. 1978లో గుమ్మిడిగెడ్డపై నిర్మించిన ఆనకట్ట పరిస్థితి కూడా దయనీయంగా మారింది. దీంతో మూడు మండలాల రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు.
ప్రకటనలకే పరిమితమైన గత వైసీపీ సర్కారు
28 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉన్నా.. పట్టించుకోని వైనం
దయనీయ స్థితిలో ఆనకట్ట.. అధ్వానంగా కాలువలు
మూడు మండలాల రైతులకు తప్పని సాగునీటి ఇక్కట్లు
కూటమిపైనే ఆశలు
కురుపాం రూరల్, జూన్29(ఆంధ్రజ్యోతి): కురుపాం నియోజకవర్గంలో గుమ్మిడిగెడ్డ రిజర్వా యర్ నిర్మాణం ఎన్నికల హామీగా మారింది. ఏళ్లు గడుస్తున్నా.. నిర్మాణం దిశగా అడుగులు పడడం లేదు. 1978లో గుమ్మిడిగెడ్డపై నిర్మించిన ఆనకట్ట పరిస్థితి కూడా దయనీయంగా మారింది. దీంతో మూడు మండలాల రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రస్తుతం ఈ గెడ్డ ద్వారా కురుపాం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో 4,100 ఎకరాలకు నీరందుతుంది. అయితే దీనిని రిజర్వాయర్‌గా మార్చి, ఆరు టీఎంసీల సామర్థ్యంతో 28 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని ఏటా పాలకులు చెబుతున్నా.. కార్యరూపం దాల్చడం లేదు. గమ్మిడిగెడ్డ రిజర్వాయర్ కోసం రూ.28 కోట్లు మంజూరు చేస్తామని చెప్పిన గత వైసీపీ సర్కారు ప్రకట నలకే పరిమితమైంది. ప్రస్తుతం ప్రధాన కాలువతో పాటు కిచ్చాడ, వన్నాం, పూతికవలస డిస్ట్రిబ్యూటరీ కాలువల్లో పూడికలు, పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతో శివారు భూములకు నీరందడం లేదు. దీంతో ఏటా ఖరీఫ్ సీజన్‌లో ఆయకట్టుదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. వరుణుడిపై ఆధారపడి సాగు చేసుకోవాల్సి వస్తోంది. గత ఏడాది గోళ్లవలస, చెక్కవలస, ఈదలవలస గ్రామాల రైతులు చందాలేసుకుని యంత్రాలతో ప్రధాన కాలువల్లో పూడికలను తీయించారు. ప్రస్తుతం ఆనకట్ట ప్రధాన మదుము వద్ద షట్టరు పూర్తిగా పాడైంది. కాలువలకు వెళ్లాల్సిన సాగునీరు గెడ్డలోకి వృఽథాగా పోతుంది. ఈ క్రమంలో మూడు మండలాల రైతులు కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రిజర్వాయరు నిర్మాణానికి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై దృష్టి సారించాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు.
ప్రభుత్వం దృష్టి సారించాలి..
సుమారు రూ.28 కోట్లతో గుమ్మిడిగెడ్డపై రిజర్వాయర్ నిర్మిస్తామని చాలా కాలంగా నాయకులు, అధికారులు చెబుతున్నారు. కానీ కనీసం సర్వే కూడా చేపట్టడం లేదు. గుమ్మిడిగెడ్డపై రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే ప్రస్తుతం ఉన్న 4,100 ఎకరాలతో పాటు మరో 24 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. దీనిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు దృష్టి సారించాలి.
- బి.పార్థసారథిరావు, ఆయకట్టు రైతు, కురుపాం
=====================================
పూడికలు తీయిస్తున్నాం...
మంజూరైన రూ.3లక్షలతో ప్రధాన కాలువల్లో పూడికలు తీయిస్తున్నాం. డిస్ర్టిబ్యూటరీ కాలువల్లో పూడికతీత పనులకు నిధులు మంజూరు కాలేదు. ప్రధాన మదుము, ఆనకట్టపై షట్టర్ల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.
- బి.శంకర్రావు, ఇరిగేషన్ ఏఈ