Budget Bash! బడ్జెట్ భేష్!
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:23 PM
Budget Bash! రాష్ట్ర బడ్జెట్ భేష్ అనిపించింది. జిల్లాకు మేలు జరుగనుందన్న సంకేతాన్ని ఇచ్చింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లాకు ప్రత్యేక కేటాయింపుల గురించి చెప్పనప్పటికీ ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను ప్రముఖంగా ప్రస్తావించారు.
బడ్జెట్ భేష్!
విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28 వేల కోట్లు
అదే ప్రాంతంలో మన జిల్లా
ఇరిగేషన్‌కు పెద్దపీట
ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు బకాయిల చెల్లింపు
కొత్తగా నిధుల కేటాయింపు
వంశధార-నాగావళి-చంపావతి నదుల అనుసంధానానికి ప్రాధాన్యం
జలజీవన్ మిషన్‌కు ఊతం
జిల్లాకో సైబర్ పోలీస్‌స్టేషన్
బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వరాలు
రాష్ట్ర బడ్జెట్ భేష్ అనిపించింది. జిల్లాకు మేలు జరుగనుందన్న సంకేతాన్ని ఇచ్చింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లాకు ప్రత్యేక కేటాయింపుల గురించి చెప్పనప్పటికీ ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే వంశధార-నాగావళి, నాగావళి-చంపావతి నదుల అనుసంధానం పూర్తి చేస్తామన్నారు. రెండేళ్లలోనే ప్రాజెక్టులను కొలిక్కితెస్తామని భరోసా ఇచ్చారు. కాంట్రాక్టర్లకు పాతబకాయిలను సైతం చెల్లించి పనులు పట్టాలెక్కిస్తామని స్పష్టంచేశారు. రైతులకు అన్నదాత సుఖీభవ, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, ఉద్యాన పంటలకు ప్రోత్సాహం వంటివి ఊరట ఇవ్వనున్నాయి.
విజయనగరం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఆర్థిక ప్రాంతానికి బడ్జెట్‌లో రూ.28 వేల కోట్లు కేటాయించడం జిల్లాకు కలిసి వచ్చే అంశం. విశాఖ ఆర్థిక ప్రాంతంలో మన జిల్లా కూడా ఒకటి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ ఈ ఆర్థిక ప్రాంతంలో ఉన్నాయి. ఈ జిల్లాల్లో 49 ప్రాజెక్టులు ఉన్నాయి. రోడ్లు, రైలుమార్గాలు, పోర్టులు, లాజిస్టిక్స్, ఇతర రంగాలకు నిధులు కేటాయించారు. పది జిల్లాలకుగాను రూ.28 వేలు కోట్లు అంటే జిల్లాకు భారీ స్థాయిలో నిధులు సమకూరే అవకాశం ఉంది.
సాగునీటి ప్రాజెక్టులకు మోక్షం
సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపు.. ఆపై కొత్తగా నిధులు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో తోటపల్లి, తారకరామ, వట్టిగెడ్డ, పెదంకలాం, మడ్డువలస, జంఝావతి, వెంగళరాయసాగర్, నారాయణపురం, ఆండ్ర ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ విశాఖ ఆర్థిక ప్రాంతంలోనే ఉన్నాయి. రూ.28 వేల కోట్లు కేటాయింపు ఒకవైపు.. సాగునీటి ప్రాజెక్టులకు ప్రకటించిన రూ.18,224 కోట్లలో కొంత మొత్తం జిల్లాకు కేటాయించ నున్నారు. దీంతో వచ్చే రెండేళ్లలో ప్రాజెక్టులకు ఒక తుదిరూపు రానుంది. వంశధార-నాగావళి అనుసంధాన పనులు 80 శాతం వరకూ పూర్తయ్యాయి. ఏడాదిలోపు మిగతా పనులు పూర్తిచేస్తామని ప్రభుత్వం చెప్పింది. నాగావళి-చంపావతి అనుసంధానం కూడా ఉంటుందని చెప్పడం శుభ పరిణామం.
‘జలజీవన్’ వేగవంతం
జలజీవన్ మిషన్ పథకానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.4000 కోట్లు కేటాయించారు. దీంతో జిల్లాలో పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. జిల్లాలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా ఇంటింటికీ తాగునీటి కనెక్షన్లు అందించాలి. 4.10 లక్షల కుటుంబాలకుగాను 1.94 లక్షల ఇళ్లకు మాత్రమే కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. వైసీపీ హయాంలో రూ.16 కోట్ల వరకూ బకాయిలు పేరుకుపోవడంతో కాంట్రాక్టర్లు విముఖత చూపారు. కూటమి వచ్చిన తరువాత రూ.36.16 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో మొత్తం ఆవాస ప్రాంతాలు 1621 కాగా..4,10,065 కుటుంబాలు ఉన్నాయి. ఇంకా 2.15 లక్షల ఇళ్లకు కుళాయిలు వెయ్యాల్సి ఉంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వీటికి నిధులు కేటాయించడంతో పనులు ఊపందుకునే అవకాశం ఉంది.
సైబర్ నేరాలకు చెక్..
జిల్లాకు ఒక సైబర్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించారు. జిల్లాలో ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 44 పోలీస్‌స్టేషన్లు ఉన్నా సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక పోలీస్‌స్టేషన్ లేదు. ఇప్పుడు ఏర్పాటుచేయనుండడం శుభ పరిణామం. 2023లో 108, 2024లో 107, 2025లో 100 వరకూ సైబర్ నేరాలు జరిగాయి. ఇకపై నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది.
రైతు సంక్షేమం కొనసాగింపు
సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం కూడా జిల్లాకు కలిసివచ్చే అంశం. ఎందుకంటే జిల్లాలో సామాన్య కుటుంబాలే అధికం. అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,660 కోట్లు కేటాయించారు. జిల్లాలో గతసారి 2,19,503 లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. ఇప్పటివరకూ రెండు విడతల్లో నిధులు జమచేశారు. చివరి విడతలో అన్నదాత సుఖీభవ రూ.4 వేలు చెల్లించాల్సి ఉంది. కేంద్రం అందించే పీఎం కిసాన్ రూ.2 వేలతో అందించనున్నారు. గత ఏడాది మాదిరిగా బడ్జెట్‌లో అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,660 కోట్లు కేటాయించడంతో అన్నదాత సుఖీభవ పథకానికి ఈ ఏడాది సైతం డోకా లేనట్టే.
- మరో ప్రతిష్ఠాత్మక పథకం తల్లికి వందనం ఉంది. దీనికిగాను బడ్జెట్‌లో రూ.9,668 కోట్లు కేటాయించారు. గత ఏడాది మాదిరిగానే కేటాయింపులు చేశారు. గత ఏడాది 2,232 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉండగా 2,22,745 మంది విద్యార్థులకు చదువుకు సాయం అందింది.ఈ ఏడాది కూడా అదే మాదిరిగా సాయం అందే పరిస్థితి కనిపిస్తోంది.
- వ్యవసాయం అనుబంధరంగాలకు, విద్య, వైద్యానికి, గ్రామీణాభివృద్ధికి, పురపాలక శాఖల అభివృద్ధికి, పరిశ్రమల ప్రగతికి అధిక నిధులు కేటాయించడంతో జిల్లాకు శుభవార్త అనే చెప్పవచ్చు. అన్నదాత సుఖీభవ, పీఎం కిషాన్ యోజన పధకం ద్వారా ప్రతి రైతన్న కుటుంబానికి ఏడాదికి రూ.20 వేలు చొప్పున అందించనున్నారు. ఈ బడ్జెట్ వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. రైతున్న మీకోసం కార్యక్రమాన్ని రూపొందించి పంచసూత్రాలతో ప్రాధమిక రంగాలను అభివృద్ది చేయాలని నిర్ణయించారు.
- బడ్జెట్‌లో ఇరిగేషన్‌కు కూడా పెద్ద పీఠ వేశారు. జిల్లాలోని తోటపల్లి, తారకరామతీర్ధసాగర్ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. తోటపల్లి ప్రాజెక్టుకు రూ.47.81 కోట్లు, తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టుకు రూ.68 కోట్లు కేటాయించారు. మడ్డువలస, తాటిపూడి రిజర్వాయర్ అభివృద్ధికీ నిధులు కేటాయించారు.
- రూ.53,753 కోట్లతో ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్‌లో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణకు 14,277 కోట్లు కేటాయించారు. విద్యుత్ రాయితీ కోసం రూ.13,722 కోట్లు కేటాయించారు. రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని రూపొందించి పంచసూత్రాలతో ఈ రంగాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఫార్మ్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్ తదితర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో వ్యవసాయరంగానికి ఊతమివ్వనున్నారు. ప్రకృతి వ్యవసాయం, డిజిటల్ విధానాలను ప్రోత్సహిస్తామన్న భరోసా ఇచ్చారు. జిల్లాలో తారకరామాతీర్ధసాగర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న హామీ లభించింది.
- బడ్జెట్‌లో తోటపల్లి, తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం చాలా శుభపరిణామమని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే పంటలకు పుస్కలంగా సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.
---------------