Share News

Brought...! money రాబెట్టారు...!

ABN , Publish Date - May 17 , 2026 | 12:21 AM

Brought...! money జిందాల్‌ భూ సేకరణలో జరిగిన తప్పును సరిదిద్దే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. ఒకరికి బదులు ఇంకొకరికి ఇచ్చేసిన నష్టపరిహారం సొమ్ములో కొంత తిరిగి రాబెట్టగలిగారు.

Brought...! money రాబెట్టారు...!

రాబెట్టారు...!

జిందాల్‌ భూ సేకరణలో ఒకరి భూమికి బదులు మరొకరికి పరిహారం

బాధితుడి ఫిర్యాదుతో మేల్కొన్న రెవెన్యూ అధికారులు

నష్టపరిహారంలో రూ.2,48,620 తిరిగి చెల్లింపు

మరో పక్షం రోజుల్లో మిగతా డబ్బులు అందించేందుకు అంగీకారం

శృంగవరపుకోట మే 16 (ఆంధ్రజ్యోతి)

జిందాల్‌ భూ సేకరణలో జరిగిన తప్పును సరిదిద్దే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. ఒకరికి బదులు ఇంకొకరికి ఇచ్చేసిన నష్టపరిహారం సొమ్ములో కొంత తిరిగి రాబెట్టగలిగారు. వేరొకరి భూమికి చెందిన నష్టపరిహారాన్ని తీసుకున్న కుటుంబ సభ్యులు శనివారం విజయనగరం రెవెన్యూ డివిజనల్‌ అధికారి పేరున తీసిన రూ.2,48,620 డీడీను తహసీల్దార్‌ కార్యాలయానికి అప్పగించారు. మిగిలిన సొమ్మును మరో పదిహేను రోజుల్లో చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లు తహసీల్దార్‌ డి.శ్రీనివాసరావు జిల్లా ఉన్నతాధికారులకు నివేదించారు. వివరాల్లోకి వెళితే..

చీడిపాలెం సర్వే నెంబర్‌ 6-14లోని 1.24 ఎకరాలను 2008లో జిందాల్‌ అల్యూమినియం కంపెనీకు అధికారులు రిజిస్ట్రేషన్‌ చేశారు. ఈ భూమికు చెందిన యజమాని ఊలం సింహాచలం. అయితే అప్పట్లో ఇతని కుటుంబం జిందాల్‌ కంపెనీకి భూమిని ఇచ్చేందుకు ఇష్టపడలేదు. జిందాల్‌ యాజమాన్యం, స్థానిక నేతలు తీవ్ర ఒత్తిడి తెచ్చినప్పటికీ ససేమిరా అన్నారు. భూమిని అప్పగించలేదు. జిందాల్‌ యాజమాన్యాన్ని భూమిలోకి అడుగుపెట్టనివ్వలేదు. ఇదే సమయంలో జిందాల్‌ భూ సేకరణ వ్యతిరేక ఉద్యమంలో సింహాచలం కుమారుడు మల్లేశ్వరరావు, కోడలు పార్వతి అలుపెరుగని పోరాటం చేశారు. జైలుకు వెళ్లారు. కోర్టు చుట్టూ తిరిగారు. అయినప్పటికీ ఈభూమిని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం జిందాల్‌ యాజమాన్యానికి అప్పగించేసింది. వీరికి రావాల్సిన నష్టపరిహారాన్ని వేరొకరి ఖాతాకు జమచేసేశారు. ఊలం సింహాచలం కుటుంబానికి బదులు ఊరం సింహాచలం కుటుంబానికి ఇచ్చేశారు. భూమికి చెందిన నష్టపరిహారం రూ.2,48,620, ఉద్యోగానికి బదులు ఒన్‌టైం సెటల్‌మెంట్‌ కింద రూ.3,00,000, షేర్లు వాటాగా రూ.2,48,620ను ఊరం సింహాచలం భర్త అప్పారావు ఖాతాలో వేసేసారు. దీనిపై ఊలం సింహాచలం కుమారుడు మల్లేశ్వరరావు స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్‌ పీజీఆర్‌ఎస్‌లోనూ ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు తప్పు జరిగినట్లు గుర్తించారు. ఆ సొమ్మును తిరిగి వెనక్కి ఇచ్చేయాలని ఊరం సింహాచలం కుటుంబానికి స్థానిక రెవెన్యూ అధికారులు నోటీస్‌లు అందించారు. తిరిగి చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో ఊరం సింహాచలం కుమారుడు మహేష్‌ నష్టపరిహారం సొమ్మును తాజాగా అందించారు. ఇంకా ఒన్‌టైం సెటల్‌ మెంట్‌కు చెందిన సొమ్ము, షేరు వాటాగా తీసుకున్న సొమ్మును తిరిగి చెల్లించాల్సి ఉంది. వీటిని కూడా మరో పదిహేను రోజుల్లో చెల్లించేందుకు అంగీకరించినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

-----------

Updated Date - May 17 , 2026 | 12:21 AM