Share News

Broken or Cracked... చీలినా విరిగినా... అవే!

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:54 PM

Broken or Cracked... Still the Same! జిల్లాలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలోని గిరిజన విద్యాలయాలకు వంట పాత్రలు, గ్యాస్‌ స్టవ్‌లు సప్లయ్‌ కావడం లేదు. ఎప్పుడో ఎనిమిదేళ్ల కిందట అందించిన పాత్రలు పూర్తిగా పాడైపోయాయి. వినియోగానికి పనికిరాకుండా తయార య్యాయి.

Broken or Cracked... చీలినా విరిగినా... అవే!
ఆర్‌ఆర్‌బీ పురం ఆశ్రమ పాఠశాలలో అధ్వానంగా ఉన్న వంట పాత్రలు

  • విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం

  • మండిపడుతున్న విద్యార్థి సంఘాలు

  • అధికారులు స్పందించాలని విన్నపం

  • ఇండెంట్‌ పెట్టామంటున్న ఏటీడబ్ల్యూవో

జియ్యమ్మవలస, జూన్‌17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలోని గిరిజన విద్యాలయాలకు వంట పాత్రలు, గ్యాస్‌ స్టవ్‌లు సప్లయ్‌ కావడం లేదు. ఎప్పుడో ఎనిమిదేళ్ల కిందట అందించిన పాత్రలు పూర్తిగా పాడైపోయాయి. వినియోగానికి పనికిరాకుండా తయార య్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రస్తుతం వాటిపైనే వంటావార్పు చేస్తున్నారు. అయితే దీనిపై గిరిజన విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. పాడైపోయిన పాత్రల్లో వంటలు చేసి.. విద్యార్థులకు పెడితే వారి ఆరోగ్యంపై ప్రభావం పడదా? అని ప్రశ్నిస్తున్నారు. వంట పాత్రల పంపిణీ విషయంలో తాత్సరం ఎందుకని మండిపడుతున్నారు.

ఇదీ పరిస్థితి..

- పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో మినీ గురుకులం (బాలికలు), ఏపీటీడబ్ల్యూయూ ఆర్‌జేసీ (బాలికలు)తో పాటు 47 ఆశ్రమ పాఠశాలలు, గురుకులం పాఠశాలలు నాలుగు, గురుకులం జూని యర్‌ కాలేజీలు నాలుగు వరకూ ఉన్నాయి. పోస్ట్‌మెట్రిక్‌ హాస్టళ్లు ఎనిమిది, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలలు (ఈఎంఆర్‌ఎస్‌) నాలుగు, ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలు 350 వరకూ ఉన్నాయి. వీటిలో 22 వేల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

-సీతంపేట ఐటీడీఏ పరిధిలో సీతంపేట, భామిని, పాలకొండ, వీరఘట్టం మండలాలకు సంబంధించి 18 ఆశ్రమ పాఠశాలలు, నాలుగు పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లు , గురుకులాలు ఎనిమిది వరకూ ఉన్నాయి. వీటి పరిధిలో వెయ్యికి పైగా గిరిజన విద్యార్థులు ఉన్నారు. 3, 4 తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికీ నెలకు రూ. 1,150, 5నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్ధికి రూ. 1,400, ఇంటర్మీడియట్‌ ఆపైన చదువుతున్న వారికి రూ. 1,500 చొప్పున ప్రభుత్వం పౌష్టికాహారం కోసం ఖర్చు చేస్తోంది. అయితే ప్రతీచోట మెనూ సక్రమంగా అమలవుతుందా? లేదా? అనేది పక్కన పెడితే వారికి వండి వడ్డించే పాత్రలు మాత్రం అత్యంత దారుణంగా తయారయ్యయి.

- జిల్లాలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు, ఏకలవ్య పాఠశాలలు, పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లకు 2018 నుంచి ప్రభుత్వం ద్వారా వంట పాత్రలు సప్లయ్‌ పూర్తిగా లేదని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. 2016-17లో అప్పటి టీడీపీ ప్రభుత్వం వంట పాత్రలు సరఫరా చేసినట్లు వారు చెబుతున్నారు. వాటితోనే ఇంతవరకు వంటా వార్పులు చేస్తున్నారు. అయితే ఆయా పాత్రలు ఇప్పుడు పూర్తిగా పాడయ్యాయి. వినియోగంచడానికి వీలు లేని విధంగా తయారైన పాత్రలతోనే వసతి గృహ సంక్షేమాధికారులు పని కానిచ్చేస్తున్నారు.

- గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన గ్యాస్‌ స్టవ్‌లు కూడా పూర్తిగా పాడయ్యాయి. అయితే ఇప్పటికీ కానీ వాటిపైనే వంటలు చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.

ఇండెంట్‌ పెట్టాం

గిరిజన సంక్షేమ పాఠశాలలు, కళాశాలల్లో వంట పాత్రలు పరిస్థితి అధ్వానంగా ఉన్నాయనేది మా దృష్టికి వచ్చింది. వాటి కోసం ఇండెంట్‌ పెట్టాం. త్వరలో వస్తాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాం.

- కె.చంద్రబాబు, ఏటీడబ్ల్యూవో, కురుపాం సబ్‌ డివిజన్‌

Updated Date - Jun 17 , 2026 | 11:54 PM