Share News

పగిలిన అద్దాలు.. విరిగిన పరికరాలు

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:27 PM

జిల్లాలో చాలా ఆర్టీసీ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. బ్రేకేస్తే బావురుమంటున్నాయి..

పగిలిన అద్దాలు.. విరిగిన పరికరాలు
మరమ్మతులకు గురైన బస్సు

- నిత్యం మొరాయిస్తున్న ఆర్టీసీ బస్సులు

- కాలం చెల్లినవే అధికం

- వేధిస్తున్న సిబ్బంది కొరత

- ప్రయాణికులకు తప్పని పాట్లు

జిల్లాలో చాలా ఆర్టీసీ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. బ్రేకేస్తే బావురుమంటున్నాయి.. గేరేస్తే గుర్రుమంటున్నాయి. చాలా బస్సులకు బ్రేకులు సరిగ్గా లేవు. హెడ్‌లైట్ల వెలుగులు కూడా అంతంత మాత్రమే. ఎక్కువ శాతం డొక్కుబస్సులే ఉన్నాయి. పగిలిన అద్దాలు, విరిగిన నట్లు, ఇతర పరికరాలు రణగొణ ధ్వనులు సృష్టిస్తున్నాయి. అటు సిబ్బందికి, ఇటు ప్రయాణికులకు రోత పుట్టిస్తున్నాయి. మరమ్మతులకు గురైన బస్సులను బాగు చేసేందుకు సరిపడ సిబ్బంది కూడా లేరు. అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. పని ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతున్నారు.

విజయనగరం, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో విజయనగరం, ఎస్‌.కోట ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. సుమారు 179 ఆర్టీసీ బస్సులు రోజుకు సగటున 63 వేల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్‌ సిబ్బంది మొత్తం 820 మంది వరకు ఉన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో నూతన నియామకాలు లేవు. అటు కొత్త బస్సుల జాడలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాకు 22 వరకూ కొత్త బస్సులను సమకూర్చింది. త్వరలో మరికొన్ని బస్సులు రానున్నాయి. అయితే, ఈ రెండు డిపోల్లో కాలం చెల్లిన బస్సులు అటు సిబ్బందికి, ఇటు ప్రయాణికులకు రోత పుట్టిస్తున్నాయి. బస్సులో కునుకుతీస్తామంటే కుదరదు. పగిలిన అద్దాలు, విరిగిన నట్లు రణగొణ ధ్వనులు సృష్టిస్తున్నాయి. కదులుతున్న పరికరాలను సిబ్బందే తాళ్లు, వైర్లతో కట్టి మమ అనిపించేస్తున్నారు. చాలా బస్సులకు స్టార్టింగ్‌ ట్రబుల్‌. దీంతో వాటిని ఆన్‌లోనే ఉంచాల్సిన పరిస్థితి. దీంతో డీజిల్‌ అదనంగా ఖర్చవుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వచ్చిన తరువాత 55 మంది ఎక్కవలసిన బస్సులో సుమారు 150మందికి పైగా ఎక్కుతుండడంతో అవి మొరాయిస్తున్నాయి. వాస్తవానికి 13 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను కాలం చెల్లినవిగా పరిగణిస్తారు. కానీ, ఇప్పుడు పల్లెవెలుగు సర్వీసుల కింద నడుపుతున్న బస్సులన్నీ 13 లక్షల కిలోమీటర్లు ఎప్పుడో దాటిపోయినట్టు తెలుస్తోంది. తొలుత సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌లుగా ఉండే బస్సులు ఐదు లక్షల కిలోమీటర్లు దాటిన తరువాత వాటిని పల్లెవెలుగులుగా వినియోగిస్తుంటారు. ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల కోసం కొత్త బస్సులను కొనుగోలు చేస్తారు. వైసీపీ హయాంలో కొత్త బస్సుల కొనుగోలు అన్నదే జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాకు 22 కొత్త బస్సులను కేటాయించింది.

సిబ్బంది కొరత..

రెండు డిపోల్లో మెకానిక్‌ల కొరత ఉంది. ఏళ్ల తరబడి పోస్టులు భర్తీ చేయడం లేదు. 40 శాతం కాంట్రాక్ట్‌ సిబ్బందితోనే నడిపిస్తున్నట్టు ఆర్టీసీ యూనియన్‌ నేతలు చెబుతున్నారు. డిపోల్లో నిపుణులైన మెకానిక్‌లు లేకపోవడం, విడి పరికరాలు సక్రమంగా సరఫరా కాకపోవడంతో బస్సుల మరమ్మతుల సక్రమంగా జరగడం లేదు. బస్సు డిపోల్లోకి చేరుకున్న తరువాత లోపాలను లాగ్‌ రిజిస్టర్‌లో నమోదుచేయాలి. వాటిని రాత్రికి మెకానిక్‌లు సరిచేస్తారు. కానీ సిబ్బంది లేకపోవడంతో ఈ విధానం సక్రమంగా అమలుకావడం లేదు. అది బస్సుల కండీషన్‌పై ప్రభావం చూపుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అప్రెంటీస్‌లో భాగంగా డిపోల్లో నియామకాలు చేపట్టింది. కానీ డ్రైవర్లు, కండక్టర్ల కొరత ఉంది. ఒక్కోబస్సుకు డ్రైవర్‌, కండక్టర్‌, గ్యారేజీ మెకానిక్‌, సహాయకుడు కలుపుకొని ఐదుగురు సిబ్బంది ఉండాలి. కానీ బస్సుల నిష్పత్తి చూసుకుంటే ఇద్దరు కూడా లేని పరిస్థితి నెలకొంది. సిబ్బంది కొరత కారణంగా ఉన్న వారిపై భారం పడుతోంది. 8 గంటల పాటు డ్యూటీ చేయాల్సి ఉండగా 12 గంటలకు మించి చేయాల్సి వస్తోంది. దీంతో విధుల్లో సిబ్బంది అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

పెరుగుతున్న పనిభారం..

ఇటీవల కాలంలో ఆర్టీసీ ఉద్యోగులు అనారోగ్యానికి గురవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వారి ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిట్నెస్‌ పరీక్షలు చేయాలి. ముఖ్యంగా 17 రకాల వైద్య పరీక్షలు తప్పనిసరి. ప్రతి మూడు, ఆరు నెలలకు ఒకసారి వారికి వైద్య శిబిరాలు నిర్వహించి పరీక్షలు చేయాలి. బీపీ, షుగర్‌, కంటి పరీక్షలతో పాటు ఈసీజీ వంటివి చేస్తుండాలి. అప్పుడే వారి ఆరోగ్య సమస్యలు గుర్తించవచ్చు. కానీ ఆర్టీసీలో అటువంటిదేమీ లేకుండా పోతోందన్న విమర్శలు ఉన్నాయి. దీంతో విధి నిర్వహణలో వారు అనారోగ్యానికి గురవుతున్నారు.

Updated Date - Jun 05 , 2026 | 11:27 PM