Share News

Joy to Farmers! కరువు తీరేలా.. రైతన్న మురిసేలా!

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:23 AM

“Bringing an End to Drought, Bringing Joy to Farmers!” తీవ్ర వాయుగుండం కారణంగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నదులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వరద పోటెత్తుతుండడంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఎల్‌నినో ప్రభావంతో నిన్న మొన్నటి వరకు చుక్కనీరు లేక వెలవెలబోయిన సాగునీటి వనరులు నేడు జల సవ్వడులతో కనువిందు చేస్తున్నాయి.

  Joy to Farmers!  కరువు తీరేలా..  రైతన్న మురిసేలా!
తోటపల్లి వద్ద నాగావళి పరవళ్లు..

  • ప్రాజెక్టులు, చెరువులు, నదులకు జలకళ

  • ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, గెడ్డలు

  • పంటలకు ఊపిరి

  • శివారుకూ సాగునీరు అందే అవకాశం

  • ఆనందంలో అన్నదాతలు

  • ఎల్‌నినో ముప్పు తప్పినట్టేనా?

పార్వతీపురం/గరుగుబిల్లి/మక్కువ/పాచిపెంట రూరల్‌/ జియ్యమ్మవలస, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తీవ్ర వాయుగుండం కారణంగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నదులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వరద పోటెత్తుతుండడంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఎల్‌నినో ప్రభావంతో నిన్న మొన్నటి వరకు చుక్కనీరు లేక వెలవెలబోయిన సాగునీటి వనరులు నేడు జల సవ్వడులతో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఖరీఫ్‌ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు ఢోకా ఉండదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో అనేక ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. పంట పొలాలు, నివాస ప్రాంతాలు వరదనీటిలోనే ఉన్నాయి. జిల్లాలో పలు ప్రాజెక్టులో నీటి నిల్వలు, వరద ప్రవాహం తదిర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

- గత మూడు రోజులుగా కురిసన వర్షాలకు తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టులోకి 40 వేల క్యూసెక్కులకు పైబడి వరద చేరింది. గురువారం రాత్రి 31 వేల క్యూసెక్కులను స్పిల్‌వే నుంచి మూడు గేట్లు తెరచి దిగువకు విడుదల చేశారు. కాగా శుక్రవారం స్పిల్‌వే ఆరో గేటు మొరా యించడంతో ఏఈ కిషోర్‌కుమార్‌ అప్రమత్తమై సిబ్బందితో మరమ్మతులు చేపట్టారు. మొత్తంగా 6 గేట్లు నుంచి ఉదయం 46 క్యూసెక్కులు, సాయంత్రం 24 వేల క్యూసెక్కులను నాగావళి నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టులో ప్రస్తుతం వరద ఉధృతి కొంతమేర తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టు సామర్థ్యం 105 మీటర్లకు గాను ప్రస్తుతం 103.78 మీటర్ల మేర నీటి నిల్వలు ఉన్నాయి. అదనంగా చేరిన ఒక టీఎంసీని కిందకు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీటితో కుడి, ఎడమ ప్రధాన కాలువల పరిధిలో సుమారు 71,700 ఎకరాలకు ప్రయోజనం కలుగుతుంది. అధికంగా చెరువులు, కాలువలు నిండడంతో ప్రధానంగా వరి పంట సాగుకు ఏ ఇబ్బందీ ఉండదని రైతులు చెబుతున్నారు. వర్షాలతో మరోవైపు భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు.

- పెద్దగెడ్డ జలాశయంలోనూ నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. ప్రాజెక్టు సామర్థ్యం 213.800 మీటర్లకు గాను ప్రస్తుతం 208.90 మీటర్ల మేర నీటి నిల్వలు ఉన్నాయి. శుక్రవారం 700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. రానున్న రోజుల్లో సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రధాన కాలువ, రివర్‌ స్లూయిస్‌ల ద్వారా నీరు విడుదల చేయడం లేదని జేఈ మోహన్‌రావు తెలిపారు.

- జియ్యమ్మవలస మండలం వట్టిగెడ్డ రిజర్వాయర్‌లో 2 వేల క్యూసెక్కులు చేరింది. దీంతో అధికారులు స్పిల్‌వే రెండు గేట్లును ఎత్తి వెయ్యి క్యూసెక్కులను కిందకు విడుదల చేశారు. కాగా మండలంలో 16,675 ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందనుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 121.62 మీటర్లకు గాను ప్రస్తుతం 121.04 మీటర్ల మేర నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో రైతులు, మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్యాలెన్స్‌డు రిజర్వాయర్లుగా పేరున్న జగన్నాఽథసాగరం, ప్రతాపసాగరం చెరువులతో పాటు మండలంలో అన్ని చెరువులు జలకళను సంతరించుకున్నాయి.

- కొద్ది రోజుల కిందట నీరు లేక వెలవెలబోయిన వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టు నేడు జలకళతో కనువిందుచేస్తోంది. భారీ వర్షాల కారణంగా జలాశయానికి వరద పోటెత్తింది. ప్రాజెక్టు సామర్థ్యం 161 మీటర్లకు గాను ప్రస్తుతం 158 మీటర్ల మేర నీటి నిల్వలు ఉన్నాయి. ఇక గోముఖి రిజర్వాయర్‌ 163 మీటర్లకు 162 మీటర్ల మేర నీరు చేరడంతో దిగువకు 300 క్యూసెక్యులను విడుదల చేశారు. వీఆర్‌ఎస్‌లో, గోముఖిలో నీటి నిల్వలు పెరగడంతో పంటలకు ఇబ్బంది లేదని ఆయకట్టుదారులు చెబుతున్నారు. మక్కువ, సీతానగరం, బొబ్బిలి ప్రాంతాల్లో 24,700 ఎకరాల్లో పంటలకు ఢోకా ఉండదని తెలియజేస్తున్నారు.

అధికారులు ఏమన్నారంటే..

‘ఇటీవల కురిసిన వర్షాలకు తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టులో సుమారు ఒక టీఎంసీ వరకు అదనంగా నీరు చేరింది. ఒడిశా నుంచి 26 వేల క్యూసెక్కులు, జంఝావతి ప్రాజెక్టు నుంచి 20 వేల క్యూసెక్కుల పైబడి వరద పోటెత్తింది. దీంతో నాగావళి నదిలో ఇన్‌ఫ్లో పెరిగింది. నీటి నిల్వలకు ఢోకా లేదు.’ అని ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ మన్మథరావు తెలిపారు. ‘ వీఆర్‌ఎస్‌ ప్రాజెక్టు పరిధిలో తాజాగా 0.60 టీఎంసీల నీరు చేరింది. మరో నాలుగు వేల ఎకరాకలు పైబడి సాగునీరు అందించే అవకాశం ఉంది. ’ అని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సురేష్‌ చెప్పారు. ‘ప్రస్తుతం ఉన్న సాగునీటి నిల్వలతో మరో 1500 ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉంది.’ అని పెద్దగెడ్డ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు.

Updated Date - Sep 26 , 2026 | 12:23 AM