Share News

Crops పంటలకు ఊపిరి

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:52 PM

Breath of Life for Crops బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో ముసురు వాతావరణం నెలకొంది. గురువారం సాయంత్రం నుంచి ఓ మోస్తరుగా వాన కురిసింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం తెరిపి ఇచ్చినా.. కొండవాగులు, గెడ్డలు మాత్రం ఉప్పొంగి ప్రవహించాయి. నదులు, చెరువుల్లోనూ నీటి ప్రవాహం పెరిగింది. అయితే ఖరీఫ్‌ రైతులు ఈ నీటిని ఒడిసిపట్టి పంట పొలాలకు తరలిస్తున్నారు. మొత్తంగా పొలాల్లో వర్షపు నీరు చేరుతుండడంతో పంటకు ఊపిరిపోటినట్టయింది.

 Crops  పంటలకు ఊపిరి
వీపీరాజుపేట జంక్షన్‌ వద్ద పంట పొలాల్లో నిలిచిన వర్షపునీరు

  • ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, గెడ్డలు

  • నదులు, చెరువులకు జలకళ

  • ఆ నీటిని పొలాలకు మళ్లిస్తున్న రైతులు

పాలకొండ, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో ముసురు వాతావరణం నెలకొంది. గురువారం సాయంత్రం నుంచి ఓ మోస్తరుగా వాన కురిసింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం తెరిపి ఇచ్చినా.. కొండవాగులు, గెడ్డలు మాత్రం ఉప్పొంగి ప్రవహించాయి. నదులు, చెరువుల్లోనూ నీటి ప్రవాహం పెరిగింది. అయితే ఖరీఫ్‌ రైతులు ఈ నీటిని ఒడిసిపట్టి పంట పొలాలకు తరలిస్తున్నారు. మొత్తంగా పొలాల్లో వర్షపు నీరు చేరుతుండడంతో పంటకు ఊపిరిపోటినట్టయింది. మరో పది రోజుల వరకు సాగునీటికి ఏ ఇబ్బంది లేదని అన్నదాతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా జంపరకోటగెడ్డ, రావాడగెడ్డ, తంపరగెడ్డ, ఓనిగెడ్డలు కలిసే చోట వీపీరాజుపేట, పాలకొండ, బుక్కూరు, యరకారాయపురం, తంపటాపల్లి, గోపాలపురం గ్రామాల్లో తంపరభూములు నీటమునిగాయి. అయితే మూడు రోజులు అయితే గానీ వరదనీరు తగ్గుముఖం పట్టే అవకాశం లేదు. ప్రస్తుతం తొలిదశలోనే పంటలు ఉండడంతో నష్టం ఉండదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పాలకొండ మండలంలో ఓనిగెడ్డ ఉప్పొంగి ప్రవహించడంతో ఓని, గుడివాడ, స్కాట్‌దొరవలస గ్రామాలకు గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. గెడ్డల్లో మరో వారం రోజుల పాటు వరదనీరు ఉధృతంగా ప్రవహించే అవకాశమున్నందున.. ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది. గ్రామస్థులు, పశువులు, గొర్రెల కాపర్లు వరద నీటిలో గెడ్డలు దాటకుండా చూడాలని ముంపు ప్రాంతవాసులు కోరుతున్నారు.

నాగావళి, వంశధారకు వరద

- గరుగుబిల్లి: తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదికి వరద పోటెత్తుతోంది. గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతం ఒడిశాతోపాటు జిల్లాలోనూ వర్షాలు కురుస్తుండడంతో నదిలోకి శుక్రవారం 10 వేల క్యూసెక్కులు చేరింది. ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమై స్పిల్‌వే గేట్లు నుంచి దిగువకు 8,200 క్యూసెక్కులను విడుదల చేశారు. ప్రధాన కాలువల నుంచి 1,254 క్యూసెక్కులను సాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తున్నారు. వరద ఉధృతి పెరిగే దిగువకు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఏఈలు బి.కిశోర్‌కుమార్‌, శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ప్రాజెక్టు ప్రాంతంలో సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు.

- భామిని: మండల పరిధిలోని వంశధార నదిలో వరద ప్రవాహం పెరిగింది. సింగిడి రిజర్వాయర్‌కు నీరు చేరడంతో బ్యాక్‌వాటర్‌ కారణంగా భామిని మండలంలో 44 గ్రామాల్లో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. కాట్రగడ ఓపెన్‌ హెడ్‌ చానల్‌లోకి నీరు చేరడంతో హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద నీటిని మళ్లిస్తున్నారు. ప్రస్తుతం నదిలో ఆరు వేల క్యూసెక్కులు ఉండగా, సైడ్‌ వియర్‌ ద్వారా వరద కాలువలోకి రెండు వేల క్యూసెక్కులు విడుదల చేశారు. సింగిడి, పారాపురం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు నిండిన అనంతరం హిరమండలం రిజర్వాయర్‌కు నీరు చేరుతుందని వంశధార డీఈ భవానీ శంకర్‌ తెలిపారు.

నిలిచిన రాకపోకలు

కొమరాడ: నాగావళి నది ఉధృతంగా ప్రవహించడంతో కొమరాడ-కొట్టు గ్రామాల మధ్య శు క్రవారం పడవ ప్రయాణానికి బ్రేక్‌ పడింది. దీంతో నది ఆవల తీరంలోని 9 పంచాయతీల విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు ఇళ్లకే పరిమితమయ్యారు. పూర్ణపాడు-లాబేసు వంతెన పూర్తయితే తమకీ కష్టాలు తప్పుతాయని వారు వాపోయారు.

నేలకొరిగిన భారీ చెట్టు

సీతంపేట : ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడగండి సచివాలయం సమీ పంలో శుక్రవారం భారీ చెట్టు నేలకొరిగింది. దీంతో అటువైపుగా వెళ్లే వాహనచోదకులు ఇబ్బందులుపడ్డారు. స్థానిక యువత, గ్రామస్థులు కలిసి చెట్టును కట్‌చేశారు. యంత్రాల సహాయంతో చెట్టును రహదారిపై నుంచి తొలగించారు. దీంతో రాకపోకలకు మార్గం సుగమమైంది.

Updated Date - Sep 11 , 2026 | 11:52 PM