Share News

తల్లిపాలే అమృతం

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:48 AM

తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం. అంతకు మించి బాలింతకు ఆరోగ్యకరం.

    తల్లిపాలే అమృతం
గుర్ల: జమ్ముపేటలో తల్లిపాల ఆవశ్యకతను వివరిస్తూ ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం(ఫైల్‌)

- బిడ్డ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం

- తల్లికీ వ్యాధులు దూరం

- డబ్బాపాలుకు దూరంగా ఉండడమే మేలు

- జిల్లాలో తల్లిపాల వారోత్సవాలు

-రాజాం పట్టణానికి చెందిన ఓ మహిళ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. తనకు పుట్టిన చిన్నారిని తల్లిదండ్రుల వద్ద ఉంచి హైదరాబాద్‌ వెళ్లిపోయింది. అయితే తరచూ ఆ చిన్నారి అస్వస్థతకు గురవుతోంది. ఇటీవల విరోచనాలతో బాధపడుతుండడంతో వారు చిన్నారిని పిల్లల వైద్యుడి వద్దకు తీసుకొచ్చారు. తల్లి పాలు పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి అని తేల్చేశారు.

- తల్లి పాలు ఇస్తే శారీరాకృతిలో తేడా వస్తుందని భావించిన ఓ మహిళ పుట్టిన నాటి నుంచి శిశువుకు డబ్బాపాలు పట్టింది. 3 నెలల తరువాత చూస్తే బిడ్డ ఎదుగుదలలో తేడా కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తీసుకురాగా వైద్యులు పరీక్షించారు. పుట్టిన సమయంలో 3 కిలోలు ఉన్న బిడ్డ..3 నెలల తరువాత కేవలం 3.5 కిలోలే ఉండడాన్ని గుర్తించారు. తల్లి రోజులో ఒకసారి మాత్రమే పాలిచ్చి..మిగతా పూటల్లో డబ్బాపాలు పట్టడం వల్లే ఎదుగుదల లేదని నిర్థారించారు. తల్లిపాల ఆవశ్యకత గురించి అవగాహన కల్పించి పంపించారు.

రాజాం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం. అంతకు మించి బాలింతకు ఆరోగ్యకరం. కానీ ఈ విషయం తెలియని చాలామంది తల్లులు తమ బిడ్డలకు పాలివ్వడం లేదు. తమ అందం, ఛాయ తగ్గిపోతుందని చాలామంది తల్లులు బిడ్డలకు తల్లిపాలు ఇవ్వడం మరుస్తున్నారు. దీనివల్ల బిడ్డల అనారోగ్యానికి గురవుతున్నారు. వారు సైతం రొమ్ము క్యాన్సర్‌తో పాటు రక్తపోటు, మధుమేహం వంటి బారినపడుతున్నారు. తల్లిపాల ఆవశ్యకతను చాటి చెప్పేందుకు ఏటా ఆగస్టు ఒకటో తేదీ నుంచి వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. జిల్లాలో రెండు రోజులుగా తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి.

రుగ్మతలు దూరం..

బిడ్డ పుట్టిన వెంటనే పాలు ఇవ్వడం ప్రారంభించాలి. అలా రెండేళ్ల వయసు వరకూ ఇవ్వొచ్చు. మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలి. తద్వారా అస్తమా, ఎలర్జీ, ఇమ్యూనిటీ లోపం, బీపీ, బ్లడ్‌క్యాన్సర్‌, డయాబెటిస్‌, ఎదుగుదల లోపం వంటి రుగ్మతల నుంచి బిడ్డను కాపాడవచ్చు. అయితే నవజాత శిశువులకు కొందరు తల్లిపాలకు బదులు పోతపాలు పడుతుండడంతో వారు పలు రుగ్మతల బారిన పడుతున్నారు. ఎదుగుదల లోపం, శ్వాస సంబంధ వ్యాధులు, అస్తమా వంటి వాటికి గురవుతున్నారు. ప్రాథమిక స్థాయిలో తల్లిపాలు ఇవ్వకపోతే ఆ చిన్నారి భవితకే ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రయోజనాలివే..

బిడ్డకు జన్మనిచ్చిన నాలుగురోజుల వరకూ తల్లి వక్షోజాల్లో ఉత్పత్తి అయ్యే పాలను ముర్రుపాలు అంటారు. అవి పిల్లలకు ఎలాంటి అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు సోకకుండా కాపాడతాయి. ఈ పాలు పిల్లల జీర్ణవ్యవస్థకు ఎలాంటి హాని కలగకుండా రక్షిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తల్లిపాలు తాగి పెరిగిన పిల్లల మెదడు చురుగ్గా పనిచేస్తుందని పలు అధ్యయనాలు తేల్చాయి. పిల్లలు బాగా చదవాలన్నా..భవిష్యత్‌లో అభివృద్ధి సాధించాలన్నా..పుట్టిన పాపాయికి కొన్ని నెలల పాటు తల్లిపాలు తాగించడం ఎంతో శ్రేయస్కరం. తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. ఈ పాలలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కార్పోహైడ్రేట్‌లు వంటి ఎన్నో పోషక గుణాలు ఉంటాయి. పాపాయి శరీరానికి అవసరమైన కొవ్వును కూడా అందిస్తాయి. ఇవన్నీ బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదపడతాయి. తల్లిపాలు సులభంగా జీర్ణం కావడంతో మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురుకాకుండా ఉంటాయి. ఎదిగే బిడ్డ వయసుకు తగ్గట్టు బరువును ఉంచడంలో కూడా తల్లిపాలు కీలక పాత్ర పోషిస్తాయి.

తల్లికి ఎంతో మేలు..

పుట్టిన బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల ఆ తల్లి మధుమేహం, అధిక రక్తపోటు వంటి బారినపడే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు. పాలు ఇవ్వడం వల్ల తల్లి హాయిగా నిద్రపోవచ్చు. బిడ్డకు పాలిచ్చే మహిళలకు గర్భాశయ క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌ ముప్పు చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. కాన్పు తరువాత ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటివి పూర్తిగా తగ్గుతాయి. పాలిచ్చే క్రమంలో తల్లి శరీరంలో ఉండే క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. తద్వారా చాలా సులువుగా బరువు తగ్గవచ్చు.

తల్లిపాలు సురక్షితం

తల్లిపాలు సురక్షితం, ఎంతో శ్రేయస్కరం. అందుకే తల్లిపాల వారోత్సవాలు నిర్వహించి సమాజంలో అవగాహన పెంచుతున్నాం. జిల్లాలో 11 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలోని 2,206 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 293 మినీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి.

-విమలారాణి, ఐసీడీఎస్‌ పీడీ, విజయనగరం

తల్లిపాలే ఇవ్వాలి..

పుట్టిన నాటి నుంచి పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించాలి. వారిలో ఎటువంటి రుగ్మతలు దరిచేరకుండా తల్లిపాలు రక్షణ కవచంలా పనిచేస్తాయి. పోత పాలు, డబ్బా పాలు పట్టకుండా ఉండాలి. అలా చేస్తున్నవారు తమ పిల్లలను అనారోగ్యంలో నెడుతున్నారన్న విషయాన్ని గ్రహించాలి. తల్లిపాలు పడితే శరీర ఆకృతి దెబ్బతింటుందన్నద వారి భ్రమ. పాలు పట్టించడం వల్ల పాపాయితో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటారు.

-శెట్టి సత్యవతి, గైనకాలజిస్టు, రాజాం

Updated Date - Aug 03 , 2026 | 12:48 AM