Share News

Brake on Constructions నిర్మాణాలకు బ్రేక్‌

ABN , Publish Date - Apr 21 , 2026 | 12:18 AM

Brake on Constructions పశ్చిమాసియాలో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడినా.. ఆ ప్రభావం మాత్రం భవన నిర్మాణ రంగంపై ఇంకా కనిపిస్తోంది. నిర్మాణాలకు కీలకమైన ఇనుము, సిమెంట్‌ తయారీ పరిశ్రమలకు గ్యాస్‌ సరఫరా కొరత కారణంగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సి వస్తోంది. ఆ భారాన్ని సర్దుబాటు చేసుకునేందుకు పరిశ్రమలు సిమెంట్‌, ఇనుము ధరలను పెంచేస్తున్నాయి. దీంతో నెల రోజుల వ్యవధిలో వాటి ధరలు గణనీయంగా పెరిగాయి.

Brake on Constructions  నిర్మాణాలకు బ్రేక్‌
పాలకొండ పట్టణంలో అర్ధాంతరంగా నిలిచిన భవన నిర్మాణం

  • పెరుగుతున్న బడ్జెట్‌..

  • పనులను వాయిదా వేసుకుంటున్న ప్రజలు

పాలకొండ, ఏప్రిల్‌20(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడినా.. ఆ ప్రభావం మాత్రం భవన నిర్మాణ రంగంపై ఇంకా కనిపిస్తోంది. నిర్మాణాలకు కీలకమైన ఇనుము, సిమెంట్‌ తయారీ పరిశ్రమలకు గ్యాస్‌ సరఫరా కొరత కారణంగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సి వస్తోంది. ఆ భారాన్ని సర్దుబాటు చేసుకునేందుకు పరిశ్రమలు సిమెంట్‌, ఇనుము ధరలను పెంచేస్తున్నాయి. దీంతో నెల రోజుల వ్యవధిలో వాటి ధరలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది డిసెంబరులో జిల్లాలో టన్ను ఇనుము ధర జీఎస్‌టీతో కలిసి రూ.54 వేలు ఉండేది. ఫిబ్రవరి నెలాఖరులో రూ.65 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.76 వేలకు చేరింది. సిమెంట్‌ విషయానికొస్తే కంపెనీని బట్టి బస్తాపై రూ.50 నుంచి రూ.70 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇక ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో వినియోగించే టైల్స్‌, మర్బుల్స్‌ ధరలకు రెక్కలొచ్చాయి. వాస్తవంగా ఇవి ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు దిగుమతి అవుతుంటాయి. అయితే గ్యాస్‌ కొరత కారణంగా కొన్నిచోట్ల పరిశ్రమలు మూతపడడంతో వాటి ఉత్పత్తి తగ్గింది. ఇదే అదునుగా వ్యాపారులు అందుబాటులో ఉన్న సరుకును అధిక ధరలకు అమ్ముతున్నారు. చదరపు అడుగు టైల్స్‌, మార్బుల్స్‌ మీద రూ.10 వరకు పెంచారు. జిప్సం షీట్‌పై రూ.500 వరకు పెంచేశారు. జింకు పైపుల ధరలు గతంలో కిలో రూ. 75 ఉంటే ఇప్పుడు రూ.90కు చేరుకుంది. 20 అడుగులు పొడవు ప్లాస్టిక్‌ పైపు గతంలో రూ.300 ఉంటే ప్రస్తుతం రూ.450 చెబుతున్నారు. గతంలో చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.2,500 ఉండగా, ప్రస్తుతం అది రూ.3 వేలు పలుకుతోంది. మొత్తంగా పెరిగిన ధరలకు భయపడి కొంతమంది సామాన్య, మధ్యతరగతి వర్గాలు ఇళ్ల నిర్మాణాలను వాయిదా వేస్తున్నాయి. అనుకున్న బడ్జెట్‌ దాటిపోతుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి నిర్మాణ పనులు చేపడతామని మరికొంతమంది భావిస్తున్నారు. కాగా నిర్మాణాలు తగ్గడంతో ఆ పనులపై ఆధారపడిన కార్మికులకు ఉపాధి కొరవడింది. యుద్ధం మళ్లీ మొదలైతే ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు.

Updated Date - Apr 21 , 2026 | 12:19 AM