Share News

బ్రేక్‌ఫెయిలై.. లోయలో పడి

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:10 AM

మండలంలోని దుగ్గేరు సమీపంలో బాగుజోల గ్రామం వద్ద గురువారం బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో వ్యాన్‌ బోల్తా పడింది.

 బ్రేక్‌ఫెయిలై.. లోయలో పడి
లోయలో పడిన వ్యాన్‌, గాసీరాం మృతదేహం

- బాగుజోల మలుపు వద్ద వ్యాన్‌ బోల్తా

- ఒకరి మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

- బాధితులంతా ఒడిశా వాసులే

మక్కువరూరల్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దుగ్గేరు సమీపంలో బాగుజోల గ్రామం వద్ద గురువారం బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో వ్యాన్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తిమృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం నవరంగపూర్‌ జిల్లా తెంతులకుంటి ప్రాంతానికి చెందిన గాసీరాం(49), తులసిరాం, పూర్ణచంద్‌హరిజన్‌ (డ్రైవర్‌), మరో ముగ్గురు వ్యక్తులు కొండచీపుర్లను కొనుగోలు చేసేందుకు కోరాపుట్‌ జిల్లా గుమ్మిటి గ్రామానికి బొలారో వ్యాన్‌లో వెళ్లారు. పని ముగించుకొని తిరిగి స్వగ్రామం బయలుదేరి వస్తుండగా మార్గమధ్యలో ఘాట్‌రోడ్డు నుంచి కిందకు దిగుతుండగా బ్రేక్‌ఫెయిల్‌ కావడంతో వ్యాన్‌ అదుపుతప్పి బాగుజోల గ్రామ మలుపు వద్ద లోయలో పడింది. ఈ ఘటనలో గాసిరాం అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో తులసిరాం పరిస్థితి విషమంగా ఉంది. మక్కువ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మక్కువ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఎం.వెంకటరమణ తెలిపారు.

Updated Date - Feb 13 , 2026 | 12:10 AM