B.Pharmacy student dies in road accident. రోడ్డు ప్రమాదంలో బిఫార్మాసీ విద్యార్థిని మృతి
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:08 AM
B.Pharmacy student dies in road accident. రాజాపులోవ పంచాయతీ మహరాజపేట సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఉదయం స్కూటీని కంటైనర్ లారీ ఢీకొనడంతో అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం బుదిరెడ్డిపాలెంకు చెందిన బి.ఫార్మసీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని నల్లబోయిన మోహనలక్ష్మి(21) అక్కడికక్కడే మృతిచెందగా తండ్రి గంగరాజు గాయపడ్డాడు.
రోడ్డు ప్రమాదంలో బిఫార్మాసీ విద్యార్థిని మృతి
సెలవుల అనంతరం కళాశాలకు వెళ్తుండగా ప్రమాదం
ఢీకొన్న ట్రాలీ లారీ
తండ్రి కళ్ల ముందే కూతురు మృతి
కన్నీటి పర్యంతమైన తోటి విద్యార్థులు
భోగాపురం, జూన్ 15(ఆంధ్రజ్యోతి):
- ‘అమ్మా.. జాగ్రత్త.. చెల్లి జాగ్రత్త.. అప్పుడప్పుడు వస్తుంటాను. ఈఏడాదితో చదువు పూర్తి అవుతుంది. నా గురించి బెంగ పెట్టుకోవద్దు.. నేను అక్కడ సంతోషంగానే ఉంటాను’ అంటూ కుమార్తె చెప్పిన మాటలను తల్లి మరువలేక కన్నీరుమున్నీరైంది.
- నీ కూతురు మంచి గుణవంతురాలు ఎప్పుడు పెళ్లి చేస్తావు, మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకొంటాం అని కుటుంబీకులు, బంధువులు తరచూ కోరుతుండడాన్ని తలుచుకుని ఆ తండ్రి కుమిలిపోయాడు. తనకిప్పుడే పెళ్లి వద్దు.. చదువు పూర్తి అయ్యాక ఆలోచిద్దాం అనేదంటూ వాపోయాడు.
- తోటి విద్యార్థులంతా అచేతన స్థితిలో ఉన్న స్నేహితురాలిని చూసి ఒక్కసారి తమను చూడవా అంటూ రోదించారు.
రాజాపులోవ పంచాయతీ మహరాజపేట సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఉదయం స్కూటీని కంటైనర్ లారీ ఢీకొనడంతో అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం బుదిరెడ్డిపాలెంకు చెందిన బి.ఫార్మసీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని నల్లబోయిన మోహనలక్ష్మి(21) అక్కడికక్కడే మృతిచెందగా తండ్రి గంగరాజు గాయపడ్డాడు. ఘటనా ప్రాంతం విద్యార్థిని తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువుల రోదనలతో నిండిపోయింది. వేసవి సెలవుల అనంతరం కుమార్తెను కళాశాలలో దింపేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అనకాపల్లి జిల్లా బుదిరెడ్డిపాలెంకు చెందిన నల్లబోయిన గంగరాజు, సుజాత దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె మోహనలక్ష్మి విశాఖ జిల్లా దాకమర్రి సమీపంలో ఉన్న ఓ పైవేటు కళాశాలలో బి.ఫార్మసీ మూడో ఏడాది పూర్తయి నాలుగో ఏడాదిలోకి వచ్చింది. తగరపువలస హాస్టల్‌లో ఉండేది. చిన్న కుమార్తె కీర్తి వేరే కళాశాలలో చదువుతోంది. సెలవులకు స్వగ్రామం వెళ్లిన మోహనలక్ష్మి తిరిగి సోమవారమే కళాశాలకు బయలుదేరింది. ఇంటి వద్ద తల్లికి ధైర్యం, జాగ్రత్తలు చెప్పింది. అనంతరం స్కూటీపై తండ్రి గంగరాజు, మోహనలక్ష్మి, చిన్నాన కుమర్తె హరిప్రియ కలిసి కళాశాలకు బయలుదేరారు. మార్గమధ్యలో తగరపువలస సమీపంలో 6వ తరగతి చదువుతున్న హరిప్రియను ప్రైవేటు స్కూల్ వద్ద అప్పగించారు. తిరిగి తండ్రి, కుమార్తె స్కూటీపై తగరపువలస వచ్చారు. అక్కడి హాస్టల్లో లగేజీ ఉంచేసి కళాశాలకు వెళ్తున్నారు. ఇంతలో రాజాపులోవ పరిధిలోని మహరాజపేట సమీపానికి వచ్చేసరికి అదే రహదారిలో వెనుక నుంచి వస్తున్న ట్రాలీ లారీ వీరిని బలంగా ఢీకొంది. దీంతో స్కూటీపై ఉన్న గంగరాజు, వెనుక కూర్చొన్న మోహనలక్ష్మి రోడ్డుపై పడిపోయారు. మోహనలక్ష్మి పైనుంచి ట్రాలీ లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి గంగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన ట్రాలీ లారీ ఆగకుండా వెళ్లిపోయింది. విషయం తెలుసుకొన్న సీఐ కె.దుర్గాప్రసాదరావు, ఎస్‌ఐ వి.పాపారావు సీసీపుటేజ్ పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాలీ లారీని పోలీసులు వెంబడించి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వద్ద స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తీరలించారు.
- అప్పటివరకూ తనతో మాట్లాడిన కుమార్తె అంతలోనే అచేతనంగా చూసిన తండ్రి తట్టుకోలేకపోయాడు. తీవ్రంగా విలపించాడు. తన గాయాలను లెక్క చేయకుండా కూతురు కోసం పడిన తాపత్రయాన్ని చూసిన వారంతా అయ్యోపాపం అనుకున్నారు. పోలీసులు చికిత్స కోసం గంగరాజును ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టు కోసం మోహనలక్ష్మి మృతదేహాన్ని సుందరపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విషయం తెలుసుకొన్న తల్లి సుజాతతో పాటు కుటుంబీకులు ఆసుపత్రికి చేరుకొని కన్నీటిపర్యంతమయ్యారు. స్నేహితులు ఆసుపత్రికి భారీ సంఖ్యలో చేరుకొని ఆమెతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకొంటూ కన్నీరు పెట్టుకొన్నారు. సెలవుల అనంతరం సరదాగా కలుద్దాం అనుకొన్నామని, ఈ సమయంలోనే ఇలా జరగడం తట్టుకోలేకపోతున్నామని, చదువులో బాగా రాణించేదని స్నేహితులు వాపోయారు. తండ్రి గంగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ దుర్గాప్రసాదరావు తెలిపారు.