Bottom in Per Capita Rankings తలసరిలో లాస్ట్!
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:12 AM
Bottom in Per Capita Rankings ప్రజల జీవన ప్రమాణాలకు అద్దం పట్టే తలసరి ఆదాయంలో జిల్లా అట్టడుగున నిలిచింది. పారిశుధ్య నిర్వహణ, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహ ణతో పాటు మిగిలిన రంగాల్లోనూ చివరి స్థానాల్లోనే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బుధవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో జిల్లాకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అదేబాటలో ఇతర రంగాలు
గిరిజన సంక్షేమ వసతిగృహాల నిర్వహణలో రెండోస్థానం
పరిశ్రమలు, సేవా రంగం కేపీఐలో ఏ ప్లస్ గ్రేడ్
కలెక్టర్ల కాన్ఫరెన్స్ నివేదికలో కీలక విషయాలు వెల్లడి
పార్వతీపురం, మార్చి11(ఆంధ్రజ్యోతి): ప్రజల జీవన ప్రమాణాలకు అద్దం పట్టే తలసరి ఆదాయంలో జిల్లా అట్టడుగున నిలిచింది. పారిశుధ్య నిర్వహణ, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహ ణతో పాటు మిగిలిన రంగాల్లోనూ చివరి స్థానాల్లోనే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బుధవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో జిల్లాకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధికారిక నివేదికల ప్రకారం.. గిరిజన సంక్షేమ వసతిగృహాల నిర్వహణలో జిల్లా (కీ ఫెర్మార్మన్స్ ఇండికేటర్స్ (కేపీఐ)లో రెండో స్థానంలో ఉంది. పరిశ్రమలు, సేవా రంగంలో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచి.. ఏ ప్లస్ గ్రేడ్ పొందింది. సర్వీసెస్ సెక్టార్ ఎకానమీలో 9వ స్థానంలో నిలవగా ఏ ప్లస్ గ్రేడ్ సాధించింది. 2025-26లో జీడీపీ ఆదాయం రూ.17,262 కోట్లు అంచనా వేయగా.. గతేడాదితో పోలిస్తే 7.39 శాతం వృద్ధి సాధించింది. మొత్తంగా కేపీఐలో జిల్లా అన్ని రంగాల్లో 83 మార్కులతో ఏ గ్రేడ్‌లో నిలిచి 21వ స్థానంలో ఉంది.
తలసరి ఆదాయంలో...
తలసరి ఆదాయంలో జిల్లా చివరి స్థానంలో ఉంది. 2024-25లో తలసరి ఆదాయం రూ. 1,46,039గా నమోదైతే 2025-26లో రూ.1,56,875గా నమోదైంది. మొత్తంగా7.42 శాతం పురోగతి సాధించినప్పటికీ రాష్ట్రంలో జిల్లా 28వ స్థానంలో నిలిచింది.
స్కిల్ స్ర్కీనింగ్ రిజిస్ర్టేషన్‌లో ..
రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం నిర్వహిస్తున్న నైపుణ్య పరీక్షల (స్కిల్ స్ర్కీనింగ్ ) నమోదులో జిల్లాకు 24వ స్థానం లభించింది. మొత్తంగా 2668 మంది రిజిస్ర్టేషన్ చేసుకున్నారు.
పీఎం సూర్యఘర్ అమలులో..
ప్రధానమంత్రి సూర్యఘర్ అమలులో జిల్లా 21వ స్థానంలో నిలిచింది. మన్యంలో ఇప్పటివరకు 14,110 మంది సూర్యఘర్ వినియోగదారులున్నారు.
అగ్రి ఎలైడ్ సెక్టార్లో..
అగ్రి ఎలైడ్ సెక్టార్లో జిల్లా 26వ స్థానంలో ఉంది. వ్యవసాయ, ఉద్యానశాఖలతో పాటు గొర్రెలు, మేకలు, చేపల పెంపకం వాటి ద్వారా రూ.6505 కోట్ల ఆదాయం నమోదైంది.
ఇతర రంగాల్లో..
- ఇండస్ర్టీ సెక్టార్‌లో రూ. 1574 కోట్ల ఆదాయంతో 26వ స్థానంలో మన్యం నిలిచింది. సర్వీస్ సెక్టార్ల ( కమ్యూనికేషన్స్, హోటల్స్, రెస్టారెంట్స్, రవాణా శాఖ, రియల్ ఎస్టేట్) లోనూ ఇదే స్థానంలో ఉండగా.. జిల్లా ఆదాయం రూ.6788 కోట్లుగా నమోదైంది. కేపీఐలో మాత్రం ఈ రంగంలో జిల్లా ఏప్లస్ గ్రేడ్ సాధించింది.
- నిధుల వినియోగంలో జిల్లా 25వ స్థానంలో నిలిచింది. మొత్తంగా రూ.281 కోట్లు మం జూరు కాగా ఇప్పటివరకు రూ.219 కోట్లు ఖర్చుచేసినట్లు నివేదక ద్వారా తెలుస్తోంది.
- అన్నా క్యాంటీన్ల నిర్వహణ, ఫ్రంట్ లైన్ సర్వీసెస్, ఎనర్జీ సర్వీసెస్ తదితర సేవలపై 69.4 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో రేషన్ పంపిణీపై 75.6 శాతం కార్డుదారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
- పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన వినతుల పరిష్కరించడంలో 78 శాతం మంది సంతృప్తి చేయగా 22 శాతం మంది అసంతృప్తితో ఉన్నారు.
- పారిశ్రామిక రంగంలో 7.56 శాతం మన్యం జిల్లా గ్రోత్ సాధించింది. 2024-25లో రూ.1,574 కోట్లు సాధించగా, 2025-26లో రూ.1,693 కోట్ల ఆదాయం పొందింది. పారిశ్రామిక రంగానికి సంబంధించి 250 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమతో ఎంవోయూ చేసుకోవాల్సి ఉంది.
- వ్యవసాయం రంగంలో 2024-25లో రూ.6,500 కోట్ల ఆదాయం రాగా.. 2025-26లో రూ.6440 కోట్ల ఆదాయం నమోదైంది. మొత్తంగా 0.88 శాతం ఆదాయం తగ్గింది. ఈ రంగం కేపీఐలో 80 మార్కులతో ఏ గ్రేడ్‌లో ఉండగా.. 23వ స్థానంలో నిలిచింది.
- మున్సిపాలిటీల పనితీరులో జిల్లా 22వ స్థానంలో ఉన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా మురుగునీటి శుద్ధి కోసం జిల్లాలో పది ప్రాజెక్టులను ప్రతిపాదించగా వీటికి సంబంధించి 4.36 ఎకరాలు అవసరమని గుర్తించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా మున్సి పాలిటీలను అభివృద్ధి చేయనున్నారు.
- నారాయణపురం బొబ్బిలి చీరను మేడిన్ ఆంధ్ర బ్రాండ్ ప్రొడక్ట్‌గా ఎంపిక చేశారు. చేనేత గిరి జన, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించి పది మంది ఉత్పత్తిదారులను గుర్తిం చారు. ఇక జిల్లాకు 19 రైల్వే లెవెల్ క్రాసింగ్‌లు మంజూరవగా.. మరో రెండు మంజూరవ్వాల్సి ఉందని నివేదికలో పొందుపరిచారు.
డ్రోన్ల వినియోగంపై కలెక్టర్ ప్రతిపాదన
అధునాతన సాంకేతికత పద్ధతులతో వ్యవసాయ రంగాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కీలక కార్యాచరణను ప్రకటించారు. బుధవారం అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ ఆధునికీకరణ, డ్రోన్ల వినియోగం, నానో యూరియా ప్రోత్సాహంపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి.. డ్రోన్ల వినియోగంపై వినూత్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అతి తక్కువ ధరలకు డ్రోన్ సేవలను రైతులకు చేరువ చేయాలన్నారు. కేవలం రూ.50తో డ్రోన్ ద్వారా మందుల పిచికారీ వంటివి చేయించాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి చం ద్రబాబునాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని ఆదేశించారు.