Share News

బొత్స రాజీనామా చేయాలి

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:04 AM

‘తిరుపతి వేంకటేశ్వరస్వామి అన్నా.. హిందువుల మనోభావాలన్నా వైసీపీకి లెక్కలేదన్న విషయం మరోసారి స్పష్టమైంది.

బొత్స రాజీనామా చేయాలి
మాట్లాడుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున, పక్కన ఎమ్మెల్యే నాగమాధవి, ఎమ్మెల్సీ గ్రీష్మా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మ తదితరులు

- శాసనమండలిలో చెప్పులు వేసుకుని

వేంకటేశ్వరస్వామి ఫొటోలు ప్రదర్శించడం దారుణం

- హిందువుల మనోభావాలంటే వైసీపీకి లెక్కలేదు

- కూటమి నేతల ఆగ్రహం

విజయనగరం రూరల్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ‘తిరుపతి వేంకటేశ్వరస్వామి అన్నా.. హిందువుల మనోభావాలన్నా వైసీపీకి లెక్కలేదన్న విషయం మరోసారి స్పష్టమైంది. శాసనమండలిలో వైసీపీ నాయకులు చెప్పులు వేసుకుని వేంకటేశ్వరస్వామి ఫొటోలు ప్రదర్శించడం దారుణం. గౌరవ సభను కౌరవ సభగా మార్చేశారు.’ అని ఎమ్మెల్సీ కావాలి గ్రీష్మా, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, జిల్లా టీడీపీ, బీజేపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, ఉప్పలపాటి రాజేష్‌వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణకు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గ్రీష్మా మాట్లాడుతూ.. ‘వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు వేసుకుని, వేంకటేశ్వరస్వామి ఫొటోను ప్రదర్శించారు. నేను స్వయంగా సభలో చూశాను. శాసనమండలి వీడియో ఫుటేజీలను పరిశీలించినా ఎవరికైనా ఇదే అర్ధమౌతుంది. కానీ, బొత్స సత్యనారాయణ మాత్రం వచ్చి రాని మాటలతో.. అర్ధం కాని భాషలో వైసీపీ ఎమ్మెల్సీలు ఎవరూ అలా చేయలేదే! వీడియోలు చూసుకోవాలని చెప్పడం దారుణం. సభలో వైసీపీ ఎమ్మెల్సీలు అనుసరించిన తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం కన్పిస్తుంది. లడ్డూ విషయం మాట్లాడితే, హెరిటేజ్‌ గురించి బొత్స మాట్లాడుతున్నారు. వైసీపీ నేతల చేసిన తప్పులను వెనకేసుకొస్తున్నారు. జగన్‌ తిరుమతికి వచ్చేటప్పుడు డిక్లరేషన్‌ను ఎందుకు ఇవ్వడం లేదు.’ అని ప్రశ్నించారు.

కౌరవసభగా మార్చేస్తున్నారు: ఎమ్మెల్యే నాగ మాధవి

‘శాసన మండలిని జగన్‌ అండ్‌ కో నేతలు కౌరవ సభగా మార్చేస్తున్నారు. గతంలో నెల్లిమర్ల నియోజకవర్గంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసి హిందువుల మనోభావాలపై దెబ్బకొట్టారు. ఇప్పుడు శాసనమండలిలో వైసీపీ చేసిన విధ్వంసాన్ని సృష్టించారు. లడ్డూ కల్తీ పాపాన్ని కూటమి ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేయడం బాధాకరం.’ అని ఎమ్మెల్యే నాగమాధవి అన్నారు.

అబద్ధాలు ఆడడంలో బొత్స దిట్ట : నాగార్జున

అబద్ధాలు ఆడడంలో బొత్స సత్యనారాయణ దిట్ట. 2004 నుంచి ఆయన గురించి జిల్లా ప్రజలందరికీ తెలుసు. కొత్తగా ఆయన మాటలు విన్నవారు నిజమేనన్న భ్రమ పడతారు. బొత్స వ్యవహారం, ఆయన వ్యాఖ్యలు కౌన్సిల్‌లో రికార్డు అవుతాయన్న సంగతి మరిచిపోయి లేనిపోని అబద్ధాలు మాట్లాడడం ఎంత వరకూ సమంజసం. వైసీపీ ఎమ్మెల్సీలు కౌన్సిల్‌లో రాద్దాంతం చేశారు. వారంతా రాజీనామాలు చేయాలి. అన్ని మతాల మనోభావాలను కాపాడే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే.’ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున అన్నారు.

నీచ సంస్కృతి వైసీపీదే: రాజేష్‌ వర్మ

‘దేవదేవుడు శ్రీనివాసున్ని రాజకీయాల్లోకి వాడుకునే నీచస్థాయికి వైసీపీ నేతలు దిగారు. జగన్‌కు ఆ పార్టీ నాయకులకు దేవుడంటే భయం, భక్తి లేదు. హిందువుల మనోభావాలంటే లేక్కేలేదు.’ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్‌ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ప్రసాదుల ప్రసాద్‌, ఆల్తి బంగారుబాబు, కనకల మురళీమోహన్‌, గంటా రవి, పాసి అప్పలనాయుడు, మైలిపిల్లి పైడిరాజు, పొగిరి పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 12:04 AM