Boost for coconut.. Encouragement for industries కొబ్బరికి ఊతం.. పరిశ్రమలకు ప్రోత్సాహం
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:46 PM
Boost for coconut.. Encouragement for industries కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఆదివారం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ కొన్ని వర్గాలకు ఊరట ఇచ్చింది. కొబ్బరి, మత్స్య రంగాలకు, భవిష్యత్ వనరులైన ఖనిజాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు.
కొబ్బరికి ఊతం.. పరిశ్రమలకు ప్రోత్సాహం
కొబ్బరికి ‘రీ-ప్లాంటేషన్’ దన్ను...
తీరప్రాంత ఇసుకలో ‘రేర్ ఎర్త్’ మెరుపులు
అంతర్జాతీయ జలాల్లో వేటకు పన్ను మినహాయింపు
మత్స్యకారులకు పండగే!
జూట్ మిల్లులకు ‘నేషనల్ ఫైబర్’ ఊపిరి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఆదివారం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ కొన్ని వర్గాలకు ఊరట ఇచ్చింది. కొబ్బరి, మత్స్య రంగాలకు, భవిష్యత్ వనరులైన ఖనిజాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ‘రేర్ ఎర్త్’ కారిడార్ ప్రకటన జిల్లా పారిశ్రామిక ప్రగతికి సరికొత్త బాటలు వేయనుంది. మూతపడే దశలో ఉన్న జూట్ మిల్లులకు ‘నేషనల్ ఫైబర్ మిషన్’ ద్వారా నిధులొచ్చే వీలుంది. ఇది మిల్లుల ఆధునికీకరణకు, కార్మికుల భద్రతకు దోహదపడుతుంది. ఈసారి పర్యాటక ప్రాజెక్టులకు కూడా అగ్ర ప్రాధాన్యం ఇచ్చారు. ఆరోగ్యానికి సంబంధించి బీపీ, క్యాన్సర్, డయాబెటిక్ మందుల ధరలు తగ్గనున్నాయి. వీటికి పన్ను మినహాయింపు ఇచ్చారు. దేశీయంగా తయారయ్యే దుస్తుల విషయంలో కూడా మినహాయింపులు ఇచ్చారు. ఇది జిల్లాలో చేనేతరంగానికి కొంత ఊతమిచ్చినట్టవుతుంది.
విజయనగరం, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి):
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొన్ని కీలక అంశాలు జిల్లాకు మేలు చేయనున్నాయి. తుఫాన్లు, చీడపీడలు, వృద్ధాప్యంతో సతమతమవుతున్న కొబ్బరి రైతులకు బడ్జెట్ భరోసా ఇచ్చింది. ‘కొబ్బరి ప్రోత్సాహక పథకం’ కింద .. దిగుబడి రాని చెట్ల స్థానంలో కొత్త హైబ్రిడ్ మొక్కలు నాటడానికి నిధులు కేటాయించారు. రైతులు తమ తోటలను పునరుద్ధరించుకోవడానికి ఇది గొప్ప అవకాశం. కొత్త రకం మొక్కలతో దిగుబడి, ఆదాయం రెండూ పెరుగుతాయి. జిల్లాలో సుమారు 2500 ఎకరాల్లో కొబ్బరి సాగుచేస్తున్నారు. అలాగే మన తీరం అపారమైన ఖనిజ సంపదకు నిలయం. అరుదైన ఖనిజాల (రేర్ ఎర్త్) వెలికితీత, శుద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌లో ‘డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్’ ఏర్పాటు చేయనున్నారు. తీరంలో మోనజైట్, ఇల్మినైట్, గార్నెట్ వంటి ఖనిజాల ఆధారిత పరిశ్రమలు జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే వీలుంది. మరోవైపు గంగపుత్రుల సంక్షేమానికి బడ్జెట్ రెండు ప్రధాన వరాలు ప్రకటించింది. భారతీయ నౌకలు అంతర్జాతీయ జలాల్లో (హై సీస్) వేటాడే చేపలపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా ఎత్తివేశారు. ఇది డీప్ సీ ఫిషింగ్ చేసే బోటు యజమానులకు భారీ ఊరట. రొయ్యలు, చేపల ప్రాసెసింగ్‌లో వాడే ముడిసరుకుల దిగుమతి సుంకం మినహాయింపు పరిమితిని ఒక శాతం నుంచి 3 శాతానికి పెంచారు. ఇది జిల్లాలో ఆక్వా పరిశ్రమలకు లాభదాయకం.
- రాజాం, కొత్తవలస, నెల్లిమర్ల, గరివిడి, మెరకముడిదాం ప్రాంతాల్లో ఉన్న జూట్ మిల్లులకు ‘నేషనల్ ఫైబర్ మిషన్’ ద్వారా నిధులొచ్చే వీలుంది. ఇది మిల్లుల ఆధునికీకరణకు, కార్మికుల భద్రతకు దోహదపడుతుంది.
- పర్యాటక, తీర ప్రాంత అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. తూర్పు కనుమల్లో ఉన్న అరకు వ్యాలీకి మౌంటైన్ రైళ్లు ఏర్పాటుచేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. విశాఖతో పాటు విజయనగరం నుంచి ఈ రైళ్లు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.
- విభజన చట్టంలో భాగంగా ఉత్తరాంధ్ర స్పెషల్ ప్యాకేజీ ఇస్తామన్నారు. ఆ ఊసేలేదు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న గిరిజన విశ్యవిద్యాలయం గురించి ప్రస్తావన లేదు. విజయనగరం రైల్వేస్టేషన్ సుందరీకరణ చేస్తామన్నారు. ఇప్పటికీ పనులు ప్రారంభం లేదు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు విశాఖ నుంచి అనుసంధానం చేస్తూ మెట్రో రైలు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ బడ్జెట్‌లో నిధుల గురించి ప్రస్తావించలేదు.
- విశాఖ ఐటీ హబ్‌గా మారుతున్న తరుణంలో జిల్లా భూభాగంలో కూడా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు జరగుతున్నాయి. ప్రధానంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటు జరుగుతున్న భీమిలి జిల్లాకు సరిహద్దు. మరోవైపు భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం కావడంతో అంతర్జాతీయ సంస్థలు విశాఖకు చిరునామాగా చేసుకొని జిల్లాలో సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే అనుకూలత వ్యక్తం చేస్తున్నాయి.
కొబ్బరికి ప్రోత్సాహం మంచిదే
కొబ్బరి ప్రోత్సాహక పథకం కింద .. దిగుబడి రాని చెట్ల స్థానంలో కొత్త హైబ్రిడ్ మొక్కలు నాటడానికి నిధులు కేటాయించడం స్వాగతించాల్సిన విషయం. రైతులు తమ తోటలను పునరుద్ధరించుకోవడానికి ఇది మంచి అవకాశం. కొత్త రకం మొక్కలతో దిగుబడి, ఆదాయం పెరుగుతాయి. అలాగే కొబ్బరిలో అంతర పంటలకు ప్రభుత్వం రాయితీ ఇవ్వాలి.
- కె.సూరప్పారావు, కొబ్బరి రైతు, భోగాపురం.
------------------