Cashew Cultivation జీడికి ప్రోత్సాహం
ABN , Publish Date - Feb 02 , 2026 | 12:08 AM
Boost for Cashew Cultivation కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అన్నివర్గాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. పర్యాటక ప్రాజెక్టులతో పాటు విద్య, వ్యవసాయం తదితర రంగాలకు పెద్దపీట వేశారు.
పర్యాటకం, విద్య, వ్యవసాయ రంగాలకు పెద్దపీట
క్యాన్సర్, షుగర్ మందులపై పన్నుల తగ్గింపు
బడ్జెట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబ్‌లు యథాయథం
పార్వతీపురం, ఫిబ్రవరి1(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అన్నివర్గాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. పర్యాటక ప్రాజెక్టులతో పాటు విద్య, వ్యవసాయం తదితర రంగాలకు పెద్దపీట వేశారు. క్యాన్సర్, డయాబెటిక్ మందులపై పన్నులు తగ్గించారు. ప్రధానంగా జీడి సాగుతో పాటు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించన్నారు. దీంతో జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ బడ్జెట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబ్ విధానంలో ఎటువంటి మార్పులు చేయకపోవడంతో వేతనజీవులకు నిరాశ ఎదురైంది.
జీడి ప్రాసెసింగ్ యూనిట్లకు సహకారం..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ జీడి రైతులకు ఊరట కలిగించింది. సాగుకు మరింత ప్రోత్సాహం అందించనుంది. జీడి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించనుంది. ప్రస్తుతం ఒక యూనిట్‌కు రూ. పది లక్షల వరకు సబ్సిడీ ఇసున్నారు. భవిష్యత్తులో దీనిని మరింత పెంచే అవకాశం ఉంది. కాగా జిల్లాలో పార్వతీపురం, సీతంపేట, ఐటీడీఏల పరిధిలో సుమారు 74 వేల ఎకరాలు జీడి సాగుతుంది. అత్యధికంగా గిరిజనులు ఈ పంటపై ఆధారపడి జీవనం సాగి స్తున్నారు. అయితే ఏటా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల కారణంగా వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవిష్యత్‌లో కేంద్రం సహకరిస్తే.. వారి పరిస్థితి మారనుంది. ఇదిలా ఉండగా ఆర్థిక ప్రోత్సాహం లేక.. జిల్లాలో మూతపడిన జీడి ప్రాసెసింగ్ యూనిట్ల పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
క్యాన్సర్, షుగర్ బాధితులకు ఊరట...
క్యాన్సర్ బాధితులు ఉపయోగించే 17 రకాల ఔషధాలపై ఈ బడ్జెట్‌లో పన్ను తగ్గించారు. దీంతో ఆయా మందుల ధరలు తగ్గనున్నాయి. జిల్లాలో నోటిక్యాన్సర్‌తో బాధపడుతున్నవారు 136 మంది, రొమ్ము క్యాన్సర్ బాధితులు 105 మంది ఉన్నారు. ఇటీవల చేపట్టిన సర్వేలో నోరు, రొమ్ము, ముక్కు క్యాన్సర్ లక్షణాలతో 346 మంది బాధపడుతున్నట్లు వైద్య సిబ్బంది గుర్తించారు. వారికి తగు వైద్య పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ నిర్ధారణ చేయాల్సి ఉంది. కాగా బడ్జెట్‌లో క్యాన్సర్ మందులపై పన్ను తగ్గించడంతో జిల్లాలో బాధితులకు కాస్త భారం తగ్గనుంది. ఇకపోతే షుగర్ మందులపై కూడా కేంద్రం పన్ను తగ్గించింది. దీంతో జిల్లాలో ఉన్న సుమారు 30 వేలకు పైబడి ఉన్న మధుమేహ బాధితులకు ఊరట కలగనుంది.
- సామాన్యులు సైతం ఆదాయ పన్ను రిటర్న్ చేసుకునేలా కేంద్రం అవకాశం కల్పించింది. దీనివల్ల ఆడిటర్లు చుట్టూ తిరిగే పనిలేకుండా చేశారు.
- కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా బాలికల కోసం వసతిగృహం ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే జిల్లాలో బాలికల వసతి గృహాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
- ఒకప్పుడు జిల్లాలో గోగునార సాగు ఎక్కువగా ఉండేది. జూట్ పరిశ్రమల మూతతో క్రమేణా వాటి సాగు తగ్గింది. కాగా జూట్ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ కోసం ప్రత్యేక కార్యచరణ ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో కేంద్రం సహకరిస్తే.. జిల్లాలో గోగునారు సాగు మళ్లీ ఊపందుకోనుంది.
- ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబ్ విధానంలో ఎటువంటి మార్పులు చేయకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వేతన జీవులకు కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచింది.
- సాలూరు రూరల్, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను కలుపుకొని రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించడంతో ఏవోబీలో అరుదైన ఖనిజాల తవ్వకాలకు మోక్షం లభించే అవకాశముందని పలువురు భావిస్తున్నారు. కొఠియా కొండల్లో బంగారం, వజ్రాలు (రంగురాళ్లు), బాక్సైట్, మాంగనీసు, గ్రాఫెట్ తదితర ఖనిజాలున్నట్టు గతంలో ఒక సర్వేలో వెల్లడైనట్టు భోగట్టా. దీనివల్లే ఇరు రాష్ట్రాలు కొఠియాపై ఆధిపత్యం కోసం సిగపాట్లు పడుతు న్నాయనే ప్రచారం ఉంది. కాగా ఒడిశా, ఏపీతో కూడిన రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు వల్ల ఇక్కడ ఖనిజ సంపదను వెలికితీసే అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఇదే జరిగితే ఈ ప్రాంతవాసులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. రాష్ట్రానికి కూడా ఆదాయం సమకూరే అవకాశముంది. మరో వైపు పర్యాటక రంగం పురోగతికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించడం వల్ల మన్యంలో పర్యాటక ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
సద్వినియోగం చేసుకోవాలి
జీడి పంటకు సంబంధించి బడ్జెట్‌లో పొందుపర్చిన అంశాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం అందించే సహకారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. జీడి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు రావాలి.
- సత్యనారాయణరెడ్డి, జిల్లా ఉద్యాన శాఖాధికారి
===============================
వేతన జీవులకు నిరాశ
ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబ్ విధానంలో ఎటువంటి మార్పు లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వేతనజీవులకు ఈ బడ్జెట్ తీవ్ర నిరాశ పరిచింది.
- జీవీఆర్‌ఎస్ కిషోర్, అధ్యక్షుడు, ఏపీ ఎన్జీవో జిల్లా సంఘం
===============================
విద్యాభివృద్ధికి దోహదం
విద్యాభివృద్ధికి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లా కేంద్రాల్లో బాలికల హాస్టల్‌తో పాటు, దేశవ్యాప్తంగా 15000 పాఠశాలలు, 500 కళాశాలల్లో కంటెంట్ క్రియేటర్ల ల్యాబ్ ఏర్పాటు హర్షణీయం. వీటి ఏర్పాటు వల్ల విద్యా నాణ్యత పెరుగుతుంది. ఏఐకు పెద్దపీట వేయడం వల్ల సాంకేతిక అభివృద్ధితో యువతకు మేలు జరుగుతుంది.
- ఇ.గున్నరాజు, పీఆర్‌టీయూ రాష్ట్రనేత
===============================
వైద్యానికి పెద్దపీట
ఈ బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వం వైద్యాఽనికి పెద్దపీట వేసింది. క్యాన్సర్ రోగుల మందులపై పన్ను తగ్గింపు సముచితం. ఆయుష్ కేంద్రాల అప్‌గ్రేడేషన్, సంప్రదాయ వైద్య పరిశోధనకు కేంద్రం ఏర్పాటు. వైద్యరంగంలో యువత కొత్త కోర్సుల ఏర్పాటు వల్ల ప్రయోజనం కలుగుతుంది.
- పి.శ్రీనివాసరావు, వైద్యుడు, సాలూరు
===============================
దివ్యాంగులకు చేయూత
దివ్యాంగులకు చేయూతగా దివ్యాంజన్ కౌశల్ యోజన, దివ్యాంగ సహకార యోజన పథకాలు ప్రకటన హర్షణీయం. ఈ కొత్త పథకాలు దివ్యాంగులకు మరింత చేయూతనందిస్తున్నాయి.
- జి.సీతారాం, మదర్ థెరిసా దివ్యాంగ సంస్థ ప్రధాన కార్యదర్శి, సాలూరు