Boochie behind the taste రుచి వెనుక బూచి
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:20 AM
Boochie behind the taste జిల్లాలో ఫాస్ట్‌ఫుడ్ సాంస్కృతి రోజురోజుకూ పెరుగుతోంది. పిజ్జా, బర్గర్, కేక్‌లు, పఫ్‌లు, చిప్స్, నూడిల్స్, శాండ్‌విచ్‌లు, కూల్‌డ్రింక్స్ వంటి పదార్థాలను పిల్లలతో పాటు యువత ఎక్కువగా తీసుకుంటున్నారు.
రుచి వెనుక బూచి
జిల్లాలో పెరుగుతున్న జంక్‌ఫుడ్ వినియోగం
ఆహారపు అలవాట్లు పెడదారి
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
పొంచి ఉన్న దీర్ఘకాలిక జబ్బులు
ఇప్పటికే కొందరు బాధితులు
పిల్లల్లో ఊబకాయం... పెద్దల్లో మధుమేహం
జిల్లాలో ఫాస్ట్‌ఫుడ్ సాంస్కృతి రోజురోజుకూ పెరుగుతోంది. పిజ్జా, బర్గర్, కేక్‌లు, పఫ్‌లు, చిప్స్, నూడిల్స్, శాండ్‌విచ్‌లు, కూల్‌డ్రింక్స్ వంటి పదార్థాలను పిల్లలతో పాటు యువత ఎక్కువగా తీసుకుంటున్నారు. పట్టణాలు, గ్రామాల్లో కూడా బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు పెరగడంతో ఆ రుచులకు అలవాటు పడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఆ ప్రభావంతో పిల్లల్లో ఊబకాయం సమస్యలు పెరుగుతుండగా.. పెద్దల్లో మధుమేహం, అధిక బరువు కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విజయనగరం రింగురోడ్డు, మార్చి 19(ఆంధ్రజ్యోతి):
ఫాస్ట్‌ఫుడ్ రుచికి ఎక్కువ మంది జిల్లా వాసులు అలవాటు పడుతున్నారు. ఎక్కువగా సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్‌లో పిజ్జా, బర్గర్, కేక్‌లను తింటూ సరిపెడుతున్నారు. విజయనగరంతో పాటు బొబ్బిలి, నెల్లిమర్ల, చీపురుపల్లి, కొత్తవలస, ఎస్.కోట, గజపతినగరం తదితర ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా ఫాస్ట్‌పుడ్ దుకాణాలు గణనీయంగా పెరిగాయి. పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఉన్న దుకాణాల్లో విద్యార్థులు ఎక్కువగా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తీసుకుంటున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. కాగా జంకుఫుడ్స్‌లో ప్రఽధానంగా మైదా, చక్కెర, ఉప్పు, అధిక కొవ్వు ఉండడం వల్ల తరచూ తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. చిన్న వయసులోనే అధిక బరువు పెరిగితే, భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్యమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే టైప్-2 డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండెజబ్బులు, ఫ్యాటీ లీవర్, అఽధిక కొలస్ట్రాల్, పేగు క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఫుడ్ చాలెంజ్‌ల సాంస్కృతి జిల్లాలో పెరుగుతోంది. ఇనస్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఫుడ్ చాలెంజ్‌లు ట్రెండ్‌గా మారాయి. జిల్లాలోనే అతి పెద్ద బర్గర్‌ను త్వరగా పూర్తి చేస్తే ఫ్రీ, స్పెషల్ చీజ్, పిజ్జా, ఒకసారి ఐదు పఫ్‌లు తింటే బిల్లు ఫ్రీ, ఆఫ్ కేజీ ఐస్‌క్రీమ్ పది నిమిషాల్లో పూర్తిచేస్తారా వంటి వీడియోలకు ఆకర్షితులవుతున్నారు. పలానా బేకరీ లేదా ఫాస్ట్‌పుడ్ సెంటర్లో ఈ ఆహారాన్ని టేస్ట్ చేశారా? చాలా బాగుంది తినండంటూ రీల్స్ విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఫుడ్ వ్లాగర్‌లు, ఇన్‌ఫ్లూయన్సర్‌లు చేసే వీడియోలు చూసి యువత పక్కదారి పడుతోంది.
పిల్లల్లో ఊబకాయం
వైద్యుల అంచనాల ప్రకారం పాఠశాల పిల్లల్లో, కళాశాల విద్యార్థుల్లో 10 నుంచి 15 శాతం వరకూ ఊబకాయ లక్షణాలు కన్పిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇది 20 శాతం వరకూ ఉండవ చ్చునని చెబుతున్నారు. ఇటీవల కొన్ని పాఠశాలలు నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో కూడా పిల్లల్లో అధిక బరువు కేసులు గుర్తించినట్టు వైద్యులు చెబుతున్నారు.
పెద్దల్లో మధుమేహం
జిల్లా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే రోగుల్లో 30 నుంచి 35 శాతం మంది అధిక బరువు సమస్యతో బాధపడుతుండగా, 10 నుంచి 12 శాతం మంది మధుమేహం వున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా 35 నుంచి 55 ఏళ్ల వయసు వారిలో ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తోంది.
వయసుల వారీగా ఆరోగ్య సమస్యలు
వయస్సు సమస్య అంచనా శాతం
6-12 సంవత్సరాలు ఊబకాయం ప్రారంభ లక్షణాలు 8 నుంచి 10 శాతం
13-18 సంవత్సరాలు అధిక బరువు, ఫ్యాటీ లీవర్ ప్రమాదం 12 నుంచి 15 శాతం
19-30 సంవత్సరాలు ఊబకాయం, కోలేస్ట్రాల్ పెరుగుదల 18 నుంచి 22 శాతం
31-40 సంవత్సరాలు ఫ్రీ-డయాబెటీస్, బరువు పెరుగుదల 20 నుంచి 25 శాతం
41-50 సంవత్సరాలు మధుమేహం, అధిక రక్తపోటు 25 నుంచి 30 శాతం
50 పైబడిన వారు గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు 30 నుంచి 35 శాతం
జీవనశైలిలో మార్పులు వల్లే
డాక్టరు ఐ.నరేష్‌కుమార్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, విజయనగరం
ఆహారంలో ఎక్కువగా మైదా, చక్కెర, ఉప్పు, అధిక కొవ్వు ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల చిన్న వయసులోనే అఽధిక బరువు పెరిగి, భవిష్యత్తులో తీవ్రమైన అరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. తరచుగా ప్రాసెస్‌డ్ మీల్స్ తీసుకోవడం వల్ల కులన్ సమస్యలు పెరగవచ్చు. ఫైబర్ తక్కువగా వుండే ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం, పేగుల ఇన్‌ఫ్లామేషన్, ఇరిటబుల్ బబేల్ సిండ్రోమ్ వంటి సమస్యలు రావచ్చు. దీర్ఘకాలంగా ఇలాంటి ఆహారం తీసుకుంటే కొలోరెక్టాల్ క్యాన్సర్ ప్రమాదం ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఫాస్ట్‌ఫుడ్స్, జంక్‌ఫుడ్స్ ఆహారాన్ని తగ్గించి పండ్లు, కూరగాయలు, పప్పులు, సాంప్రదాయ ధాన్యాలైన రాగులు, జొన్నలు, సజ్జలు ఎక్కువగా తీసుకోవాలి.
=========