Share News

రక్తమోడిన రహదారులు

ABN , Publish Date - May 11 , 2026 | 12:43 AM

జిల్లాలో రహదారులు రక్తమోడాయి. రెండు చోట్ల జరిగిన ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు.

 రక్తమోడిన రహదారులు
ఉదయ్‌కుమార్‌ (ఫైల్‌). హర్షచైతన్య (ఫైల్‌). సన్యాసిరావు(ఫైల్‌)

- జిల్లాలో రెండు చోట్ల ప్రమాదాలు

- జామిలో వ్యాన్‌ ఢీకొని ఇద్దరు బీటెక్‌ విద్యార్థుల దుర్మరణం

- డెంకాడలో పెళ్లిఆటోని ఢీకొన్న టిప్పర్‌

- పెళ్లికొడుకు తండ్రి, పెళ్లికూతురు చిన్నాన్న మృతి

- వరుడి తల్లి, చెల్లికి తీవ్రగాయాలు

జిల్లాలో రహదారులు రక్తమోడాయి. రెండు చోట్ల జరిగిన ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. జామిలో పెళ్లికి వెళ్లి ద్విచక్ర వాహనంపై వస్తున్న మన్యం జిల్లాకు చెందిన ఇద్దరు బీటెక్‌ విద్యార్థులను వ్యాన్‌ ఢీకొంది. ఈ ఘటనలో వారిద్దరూ మృతి చెందారు. డెంకాడలో పెళ్లిఆటోను టిప్పర్‌ ఢీకొట్టడంతో పెళ్లికొడుకు తండ్రి, పెళ్లికూతురు చిన్నాన్న మృతి చెందగా, పెళ్లికొడుకు తల్లి, చెల్లికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

పెళ్లింట విషాదం..

జామి, మే 10 (ఆంధ్రజ్యోతి): తన చిన్నకొడుకు పెళ్లిని ఎంతో వైభవంగా చేశారు. ఆ కుటుంబమంతా ఎంతో సంతోషపడ్డారు. పెళ్లి తంతు ముగియడంతో మిగతా కార్యక్రమాలు చేయాలని అంతా నిశ్చయించుకొని సంబర పడుతున్న వేళ ఓ టిప్పర్‌ రెండు ఇళ్లల్లో కోలుకోలేని విషాదం నింపింది. పెళ్లింట మోగిన బాజా శబ్దాలు మరవకముందే చావు బాజా వినిపించింది. ఈ సంఘటనతో జామి మండలం అన్నంరాజుపేట, విజయనగరం సమీపంలోని చాకలీపేటలో విషాదచాయలు నెలకొన్నాయి. జన్నివలస హైవేపై ఆదివారం వేకువజామున ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లిఆటోను టిప్పర్‌ ఢీకొనడంతో పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లికూతురు చిన్నాన్న మృతి చెందారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు..జామి మండలం అన్నంరాజుపేట గ్రామానికి చెందిన మట్టా సన్యాసిరావు చిన్న కొడుకుకు, పాచిపెంట మండలం తోటవలసకు చెందిన యువతితో శనివారం రాత్రి పెళ్లి జరిగింది. ఈ వేడుక వధువు ఇంటి వద్ద నిర్వహించారు. పెళ్లి తరువాత వధూవరులు కారులో అన్నంరాజుపేట వెళ్లిపోయారు. తరువాత పెళ్లికొడుకు తండ్రి సన్యాసిరావు(48), తల్లి కనకమ్మ, వీరి కుమార్తె మంగమ్మతోపాటు చాకలిపేటకు చెందిన పెళ్లికూతురు చిన్నాన్న లావేరు పైడిరాజు(55), తోటవలసకు చెందిన మరో యువకుడు, ఆటో డ్రైవర్‌ మొత్తం ఆరుగురు బయలుదేరి అన్నంరాజుపేట వస్తున్నారు. అయితే వీరు ప్రయాణిస్తున్న ఆటో జన్నివలస హైవే వద్ద పైడితల్లమ్మ గుడికి చేరుకుంటున్న సమయంలో విశాఖ జిల్లాకు చెందిన టిప్పర్‌ రాంగ్‌రూట్లో వస్తూ టైరు పేలడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న పెళ్లి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన వారందరినీ 108 వాహనంలో విజయనగరం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సన్యాసిరావు, పైడిరాజు మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన పెళ్లికొడుకు తల్లి, చెల్లితో పాటు స్వల్పగాయాలైన ఆటో డ్రైవర్‌, మరో యువకుడు చికిత్స పొందుతున్నారు. ఎస్‌ఐ వైవీ జనార్దన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

ఆరిన ఆశలు దీపాలు..

డెంకాడ, మే 10 (ఆంధ్రజ్యోతి): వారికి మధ్య తరగతి కుటుంబాలు. అయినప్పటికీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉన్నత చదువులు చదివిస్తున్నారు. పిల్లలు ఉద్యోగం చేసి తమను ఆదుకుంటారని సంతోషంలో ఉన్నారు. అయితే ఆ కుటుంబాలపై విధి కన్నెర్ర చేసింది. మరో మూడేళ్లలో చేతికి అందివస్తారనుకున్న పిల్లలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ ఆశల దీపాలు ఆరిపోయాయని రోదిస్తున్నారు. డెంకాడ మండలం అయినాడ కూడలి వద్ద 26వ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు తాన్న హర్షవర్ధన్‌(20), రెడ్డి ఉదయ్‌కుమార్‌ (19) మృతిచెందారు. డెంకాడ పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం వెంకంపేట గ్రామానికి చెందిన హర్షవర్ధన్‌ చింతలవలస (విజయనగరం) ఎంవీజీఆర్‌ కళాశాలలో బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. సీతానగరం మండలం కొత్తవలస గ్రామానికి చెందిన ఉదయ్‌కుమార్‌ ఏలూరు సీఆర్‌.రెడ్డి కాలేజీలో బీటెక్‌ చదువుతున్నాడు. వీరిద్దరూ శనివారం ఉదయం ద్విచక్ర వాహనంపై విజయనగరంలో జరుగుతున్న పెళ్లికి హాజరయ్యారు. తిరిగి శనివారం అర్ధరాత్రి చింతలవలసలో ఉన్న హర్షవర్ధన్‌ రూముకు నిద్రపోయేందుకు వెళుతుండగా అయినాడ కూటలి వద్ద విశాఖపట్నం వైపు నుంచి విజయనగరం వైపు వస్తున్న వ్యాన్‌ వీరి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలై రోడ్డుపై పడి ఉన్నారు. అదే సమయంలో విజయనగరం నుంచి అతివేగంగా వస్తున్న కారు రోడ్డుపై పడి ఉన్న ఉదయ్‌కుమార్‌ను సుమారు 30 మీటర్ల వరకు ఈడ్చుకుని వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. హర్షవర్ధన్‌ను 108 వాహనంపై చికిత్స నిమిత్తం విజయనగరం మహారాజా ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. స్థానిక ఎస్‌ఐ సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - May 11 , 2026 | 12:43 AM