Share News

blood wanted రక్తం అందట్లే!

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:23 AM

blood wanted జిల్లాలో ఆశించిన స్థాయిలో రక్తం లభ్యత లేదు. రక్త నిల్వలు నిండుకుంటున్నాయి. అటు రక్తదాతలు ముందుకు రావడం లేదు. అసలే వేసవి అనారోగ్యాలు, ఆపై రోడ్డు ప్రమాదాలతో రక్తం అవసరం ఉంటోంది. కానీ లభ్యత లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని జీజీహెచ్‌తో పాటు ఘోషాస్పత్రికి రోజుకు సగటున 25 రక్తం యూనిట్లు అవసరం.

blood wanted రక్తం అందట్లే!

రక్తం అందట్లే!

ఆపద కాలంలో అందని అపర సంజీవిని

జిల్లాలో నిండుకున్న రక్త నిల్వలు

అవసరానికి తగ్గట్టు కానరాని లభ్యంత

రాజాం, మార్చి19 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఆశించిన స్థాయిలో రక్తం లభ్యత లేదు. రక్త నిల్వలు నిండుకుంటున్నాయి. అటు రక్తదాతలు ముందుకు రావడం లేదు. అసలే వేసవి అనారోగ్యాలు, ఆపై రోడ్డు ప్రమాదాలతో రక్తం అవసరం ఉంటోంది. కానీ లభ్యత లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని జీజీహెచ్‌తో పాటు ఘోషాస్పత్రికి రోజుకు సగటున 25 రక్తం యూనిట్లు అవసరం. కానీ అక్కడ స్టాక్‌ ఉన్నది కేవలం 220 యూనిట్లు మాత్రమే. అంటే 10 రోజులకు కూడా సరిపోవన్న మాట. సాధారణంగా రక్తం అవసరం అనుకుంటే అందరూ రెడ్‌క్రాస్‌ వైపు చూస్తారు. అక్కడ కూడా రక్తం నిల్వలు నిండుకున్నాయి. ఇదే అదునుగా ప్రైవేటు రక్తనిధి కేంద్రాలు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలో తొమ్మిది రక్తనిధి కేంద్రాలున్నాయి. ఇందులో ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలు కేవలం రెండు మాత్రమే. చీపురుపల్లిలో రూ.80 లక్షలతో భవన నిర్మాణం పూర్తయినా కేంద్రం సేవలను మాత్రం ప్రారంభించలేదు. ఇక ప్రైవేటు రక్తనిధి కేంద్రాలు ఏడు వరకూ ఉన్నాయి. రక్తాన్ని నిల్వ చేసే కేంద్రాలు 11 వరకూ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎండలు ప్రారంభమయ్యాయి. మలేరియాతో పాటు డయేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎక్కువ మందిలో ప్లేట్‌లెట్స్‌ పడిపోతున్నాయి. ఈ క్రమంలో రక్తం అవసరం ఉంటోంది. ఆ సమయంలో అండగా నిలవాల్సిన బ్లడ్‌బ్యాంక్‌లు అవసరాన్ని అనుకూలంగా మలుచుకుని దోపిడీకి పాల్పడుతున్నాయన్న విమర్శలున్నాయి.

అధికంగా కొరత..

జిల్లాలో రక్తం కొరత అధికంగా ఉంది. అవసరానికి తగ్గట్టు దాతలు ముందుకు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వందల యూనిట్లు అవసరం కాగా.. పదుల సంఖ్యలో యూనిట్ల సేకరణే జరుగుతోంది. ప్రమాదం జరిగినప్పుడు, ప్రసవ సమయం, శరీరం కాలిపోయినప్పుడు, తలసేమియా, లుకేమియా, సికిల్‌ సెల్‌, అనీమియా లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు రక్తం కీలకం. మూత్రపిండాల వ్యాధులకు గురైన వారికి డయాలసిస్‌ సమయంలో రక్తం చాలా అవసరం. ఒక వ్యక్తి రక్తదానం చేయడం ద్వారా నలుగురి ప్రాణాలు కాపాడవచ్చు. ఒక వ్యక్తిలో శరీరంలో ఉన్న రక్తం మోతాదు వారి ఎత్తు, బరువు, వయసు ఆధారంగా నిర్ణయించబడుతుంది. సాధారణ వయోజనుడు తన శరీరంలో దాదాపు ఐదు లీటర్ల రక్తం కలిగి ఉంటాడు. ఈ మోతాదు 4,500 నుంచి 5,700 మిల్లీలీటర్ల మధ్య మారుతూ ఉంటుంది. గర్భిణుల్లో 300 నుంచి 400 మిల్లీలీటర్ల మధ్య అదనంగా రక్తం ఉంటుంది. ఈ అదనపు రక్తం ప్రసవ సమయంలో రక్తస్రావాన్ని నియంత్రిస్తుంది.

రక్తదానంపై విస్తృత అవగాహన

జిల్లాలో అవసరానికి తగ్గట్టు రక్తసేకరణ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. అయితే రెడ్‌క్రాస్‌ రక్తదానం విషయంలో విస్తృత అవగాహన చేపడుతోంది. రక్తదానంపై అవగాహన ఉన్నవారు మాత్రమే దానం చేస్తున్నారు. కొత్తవారు రావడం లేదు. రక్తదానంపై ప్రజల్లో ఉన్న అపోహలు పోవాలి. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు కృషిచేయాలి.

- ప్రసాదరావు, రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌, విజయనగరం

--------------

Updated Date - Mar 20 , 2026 | 12:23 AM