Share News

Heat నిప్పుల కొలిమి!

ABN , Publish Date - May 29 , 2026 | 10:56 PM

Blazing Heat Furnace! రోహిణి కార్తె ప్రభావంతో మన్యం జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అధిక ఎండలు, ఉక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో గిరిపుత్రులు అల్లాడుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల తర్వాత బయటకు వచ్చేందుకు ఎవరూ సాహించడం లేదు.

 Heat నిప్పుల కొలిమి!
మధ్యాహ్నం సమయంలో నిర్మానుష్యంగా పాలకొండ-హడ్డుబంగి రహదారి

  • ఉక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరి

పాలకొండ/సీతంపేట రూరల్‌, మే 29(ఆంధ్రజ్యోతి): రోహిణి కార్తె ప్రభావంతో మన్యం జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అధిక ఎండలు, ఉక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో గిరిపుత్రులు అల్లాడుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల తర్వాత బయటకు వచ్చేందుకు ఎవరూ సాహించడం లేదు. సాయంత్రం ఆరు గంటలైనా వాతావరణంలో వేడి అధికంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి వేతనదారులు వేసవి తాపానికి విలవిల్లాడుతున్నారు. వడదెబ్బకు గురై మంచాన పడుతున్నారు. కొందరు ఆసుపత్రు లకు క్యూ కడుతున్నారు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో సీతంపేట, పాలకొండలో ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. మరోవైపు పల్లె, పట్టణ ప్రాంతాల్లో అప్రకటిత విద్యుత్‌కోతలు తీవ్ర మయ్యాయి. దీంతో ప్రజలు ఇంట్లో ఉండలేక.. బయటకు రాలేక నానా అవస్థలు పడుతున్నారు. అధిక ఎండల నేపథ్యంలో జిల్లాలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం పెరిగింది. దీంతో ట్రాన్స్‌ఫార్మర్లు ట్రిప్పు అవుతున్నాయి. అధిక లోడు పడుతుండడంతో మరమ్మతులకు గుర వుతున్నాయి. దీనికి తోడు అడపాదడపా వీచే ఈదురుగాలులతో విద్యుత్‌ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. దీంతో అప్రకటిత విద్యుత్‌ కోతలు తప్పడం లేదు. ఏదేమైనా రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో మన్యం వాసులు బెంబేలెత్తిపోతున్నారు.

Updated Date - May 29 , 2026 | 10:56 PM