చేదెక్కిన చెరకు
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:31 PM
జిల్లాలో చెరకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
- జిల్లాలో పూర్తిగా పడిపోయిన సాగు
- క్రషింగ్ చేయలేమంటున్న సంకిలి ఫ్యాక్టరీ
- ఈ సీజన్‌తో సరి అంటూ చేతులెత్తేసిన వైనం
- అగ్రిమెంట్లు చేసుకోవడానికి నిరాకరణ
- అగమ్యగోచరంలో రైతులు
బొబ్బిలి ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చెరకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఒకపక్క ప్రోత్సాహాలు లేక.. మరొపక్క వరుసగా మూతపడుతున్న చక్కెర పరిశ్రమలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పండించిన పంటను విక్రయించుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. ఇప్పుడు మిగిలి ఉన్న ఒక్క ఫ్యాక్టరీ కూడా మూతపడనుందనే సంకేతాలు వారిని మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. అదేగానీ జరిగితే చెరకు రైతులకు ఇక తీపి కరువై శాశ్వతంగా చేదు మిగిలే పరిస్థితి ఏర్పడనుంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలోని లచ్చయ్యపేట ఎన్‌సీఎస్ ఫ్యాక్టరీ, బీమసింగి సహకార చక్కెర మిల్లు రెండూ పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయాయి. దీంతో జిల్లాలో ప్రైవేటు యాజమాన్యంలో నడుస్తున్న రేగిడి మండలంలోని సంకిలి చక్కెర పరిశ్రమ రైతులకు దిక్కయ్యింది. జిల్లా నలుమూలల నుంచి రైతులు అతి కష్టమ్మీద సంకిలి ఫ్యాక్టరీకి చెరకు తరలించి విక్రయించుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో చాలామంది రైతులు చెరకు సాగును తగ్గించుకొని.. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టారు. మొక్కజొన్న, పత్తి , ఉద్యానవన పంటలైన మామిడి తదితర పంటల సాగుకు మళ్లారు. దీంతో ప్రతిఏటా చెరకు విస్తీర్ణం పడిపోతుంది. 2023లో 9,472 హెక్టార్లలో ఉన్న విస్తీర్ణం, 2024లో 6,468 హెక్టార్లకు పడిపోయింది. ఇప్పుడు కేవలం 3,500 హెక్టార్లకే పరిమితమైంది. అయితే, క్రషింగ్ సామర్థ్యానికి తగ్గట్టుగా చెరకు లేకపోవడంతో కొనుగోలుకు సంకిలి ఫ్యాక్టరీ వెనుకంజ వేసింది. జిల్లా మంత్రి, కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు సంకిలి యాజమాన్యంతో మాట్లాడి 2026-27 సీజన్‌లో పంటను కొనుగోలు చేసేందుకు ఒప్పించారు. దీంతో వచ్చే ఏడాది మార్చి లోపు వచ్చే పంటకు మాత్రమే రైతులతో ఫ్యాక్టరీ యాజమాన్యం అగ్రిమెంట్లు కుదర్చుకుంటుంది. ఆ తరువాత నుంచి అగ్రిమెంట్లు చేసుకోవడానికి ససేమిరా అంటుంది. ఈ సీజన్‌తో ఫ్యాక్టరీ నిర్వహణ ఆఖరు అని యాజమాన్యం చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
- లచ్చయ్యపేట ఎన్‌సీఎస్ చక్కెర కర్మాగారంలో సైరన్ మోగబోదని, ఈ ప్రాంత చెరకు పంటనంతటినీ సంకిలి ఈఐడీ చక్కెర కర్మాగారానికి పంపించుకోవాలని ఆ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. అదే ఇన్నాళ్లూ కొనసాగింది. దానికి కూడా వచ్చే సీజన్‌లో ఫుల్‌స్టాప్ పడబోతుంది. ఉత్తరాంధ్రలో దాదాపు అన్ని చక్కెర మిల్లులు మూతపడడంతో రైతులకు వేరే ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఉయ్యూరులోని కేసీపీ ఫ్యాక్టరీకి చెరకు తరలించాలంటే ఈ ప్రాంత రైతులకు సాధ్యం కాదు.
ఆ హామీలు ఏమయ్యాయి..
జిల్లాలోని రైతుల ప్రయోజనార్ధం వ్యవసాయాధారిత పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని, అన్నదాతల దశను పూర్తిగా మార్చివేస్తామని గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ప్రొసెసింగ్ యూనిట్లు, వాల్యూయాడెడ్ సిస్టమ్, ఆధునిక మార్కెటింగ్ సదుపాయాలతో రైతులకు విపరీతమైన లబ్ధి చేకూరస్తామని గొప్పలు చెప్పారు. కానీ, ఐదేళ్ల పాలనలో కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి చెందిన పెద్దలు సైతం సమయం దొరికినప్పుడల్లా వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు.
రైతులు ఏమైపోవాలి
సంకిలి ఫ్యాక్టరీకి చెరకును తరలించేందుకు రైతులు అవస్థలు పడేవారు. ఆ అవకాశం కూడా ఈ సీజన్‌తో సరి అని అంటున్నారు. చెరకును కొనుగోలు చేయకపోతే రైతులు ఏమైపోవాలి. క్రషింగ్ సీజన్లలో సంకిలి ఫ్యాక్టరీని నడపకుండా ఉంటే ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు. కనీసం ఇంకొకరికైనా అప్పగించడం లేదు. చెరకు పండించే వారు ఇకమీదట బెల్లం తయారీకి తప్ప ఇతర దేనికి సరఫరా చేయలేని నిస్సహాయస్థితి ఏర్పడనుంది. అలా అయితే బెల్లం ధర తగ్గి రైతులు కుదేలైపోతారు. చక్కెర మిల్లుల విషయంలో ప్రభుత్వం ఓ ప్రగతిశీల కార్యక్రమాన్ని అమలు చేయాలి.
-ఎస్.గోపాలం, రైతు సంఘం నేత బొబ్బిలి
సాగుకు స్వస్తి పలికాం
నేను ప్రతిఏటా 350 నుంచి 400 టన్నుల చెరకును పండించే వాడిని. మా గ్రామంలో చెలికాని రాజగోపాల్ రెండువేల టన్నులు పండించేవారు. గ్రామానికి చెందిన చొక్కాపు సంజీవినాయుడు, గంట సత్యంనాయుడు, తెర్లి సింహాచలం, దత్తి అప్పలనాయుడు వంటి రైతులు కూడా చెరకు పంటను బాగా పండించే వారు. సంకలి ఫ్యాక్టరీ మనుగడ దెబ్బతిని బిల్లులు సకాలంలో అందకపోవడంతో చెరకు సాగుకు పూర్తిగా స్వస్తి పలికాం. ఇప్పుడు ఫ్యాక్టరీ కూడా కరువవుతుండడం దురదృష్టకరం.
-చెలికాని కేశవ, కారాడ, బొబ్బిలి మండలం
ఫ్యాక్టరీని నడపలేమన్నారు.
ఈ సీజన్‌లో సంకిలి ఫ్యాక్టరీని నడపలేమని యాజమాన్యం చెప్పింది. జిల్లా పెద్దలు, అధికారులు తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి వారిని ఒప్పించారు. ప్రస్తుత సీజన్‌లో 3,500 ఎకరాల్లో మాత్రమే పంట సాగు జరిగింది. 80 లేదా 90 వేల టన్నులు కన్నా చెరకు దిగుబడి ఉండదు. ఫ్యాక్టరీకి క్రషింగ్ సీజన్‌లో ఐదారు లక్షల టన్నుల చెరకు అవసరం ఉంటుంది. ఈ ఏడాది క్రషింగ్ జరిపి, వచ్చే ఏడాది నిలుపుదల చేస్తామని యాజమాన్యం చెప్పింది. ఈ విషయాన్ని రైతులకు ముందుగా తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వారు బోర్డు మీటింగ్ పెట్టుకొని ఈ నిర్ణయాన్ని రైతులకు తెలియజేస్తారు.
-మునుకోటి సత్యనారాయణ, డిప్యూటీ కేన్ కమిషనర్, బొబ్బిలి