చెరకు రైతుకు చేదు కబురు..!
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:04 AM
ఉమ్మడి జిల్లా చెరకు రైతులకు చేదు కబురు. విజయనగరం జిల్లాలో ఉన్న ఏకైక చక్కెర పరిశ్రమ సంకిలి ఇఐడీప్యారీ(ఇండియా) లిమిటెడ్‌లో వచ్చే ఏడాది క్రషింగ్ నిలిచిపోనుంది. రైతులు ఊహించినట్లే చెరకు సాగుకు బ్రేక్ వేయనున్నట్లు ప్రకటించింది.
చెరకు రైతుకు చేదు కబురు..!
2027-28 సీజన్‌కు సంకిలి సుగర్స్ గానుగ నిలిపివేస్తామన్న యాజమాన్యం
రైతులు చెరకు సాగు చేపట్టవద్దని సూచన
సుపర్ ఎల్‌నినో పరిస్థితులపై నిర్ణయం
రేగిడి, ఆగస్టు21(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా చెరకు రైతులకు చేదు కబురు. విజయనగరం జిల్లాలో ఉన్న ఏకైక చక్కెర పరిశ్రమ సంకిలి ఇఐడీప్యారీ(ఇండియా) లిమిటెడ్‌లో వచ్చే ఏడాది క్రషింగ్ నిలిచిపోనుంది. రైతులు ఊహించినట్లే చెరకు సాగుకు బ్రేక్ వేయనున్నట్లు ప్రకటించింది. ఈఏడాది క్రషింగ్ సీజన్‌కు డోకా లేకపోయినా సుపర్ ఎల్‌నినో పరిస్థితుల పేరుతో 2027-28 క్రషింగ్ సీజన్‌కు(వచ్చే ఏడాదికి) చెరకు గానుగ నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఈమేరకు హెచ్‌ఆర్ మేనేజర్ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత కొన్నాళ్లుగా చెరకు సాగు తగినంతగా లేకపోవటం, ప్రస్తుతం నెలకొన్న సుపర్ ఎల్‌నినో పరిస్థితులతో 2027-28 క్రషింగ్ సీజన్(డిసెంబర్ 2027 నుండి మార్చి 2028వరకు) ప్రతిపాదించిన చెరకు క్రషింగ్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. అయితే తర్వాత క్రషింగ్ సీజన్ కోసం యాజమాన్యం ఏమీ ప్రస్తావించక పోవడంతో ఫ్యాక్టరీ కొనసాగింపుపై రైతుల్లో అయోమయం నెలకొంది.