Binnidi Village… బిన్నిడి గ్రామం.. అభివృద్ధిలో ఆదర్శం
ABN , Publish Date - Mar 28 , 2026 | 11:47 PM
“Binnidi Village… A Model of Development” అటవీ ప్రాంతంలో ఉన్న బిన్నిడి గ్రామం అభివృద్ధిలో ఇతర గిరిజన గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ‘ముస్తాబు’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన ఆ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్థులంతా కలిసి బిన్నిడిని సుందరంగా తీర్చిదిద్దడంపై ఆనందం వ్యక్తం చేశారు.
కొమరాడ, మార్చి28(ఆంధ్రజ్యోతి): అటవీ ప్రాంతంలో ఉన్న బిన్నిడి గ్రామం అభివృద్ధిలో ఇతర గిరిజన గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ‘ముస్తాబు’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన ఆ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్థులంతా కలిసి బిన్నిడిని సుందరంగా తీర్చిదిద్దడంపై ఆనందం వ్యక్తం చేశారు. ముందుగా గ్రామంలో సీసీ రోడ్డును ప్రారంభించారు. గిరిజన రైతుల భూమ సమస్యను అక్కడికక్కడే పరిష్కరించారు. విద్యుత్ సౌకర్యం కోసం ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేశారు. పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం భవనాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ ... ‘ముస్తాబు’ను బిన్నిడిలో ఒక ఉత్సవంలా నిర్వహించడం అభినందనీయమన్నారు. గత రెండు నెలలుగా గ్రామస్థులందరూ శ్రమించి.. వీధులను శుభ్రం చేసి.. మలేరియా రహిత గ్రామంగా బిన్నిడిని మార్చడం గొప్ప విషయమని తెలిపారు. భవిష్యత్‌లో ఆదాయం కోసం.. రోడ్డుకు ఇరువైపులా కొబ్బరి మొక్కలు నాటడం బాగుందన్నారు. గ్రామస్థుల దూరదృష్టికి ఇది నిదర్శనమని చెప్పారు. వెదురుతో కాంపౌండ్ వాల్స్ నిర్మించి గ్రామానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చారన్నారు. యువత కోసం పోటీ పరీక్షల పుస్తకా లతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమన్నారు. గ్రామ యువత ఉపాధి కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. అనంతరం దళాయిపేట గ్రామంలో మొక్కజొన్న పంటను కలెక్టర్ పరిశీలించారు. దిగుబడులు, పెట్టుబడి వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అధిక దిగుబడులకు నాణ్యమైన విత్తనాలు నాటాలని సూచించారు. అంతకుమందు గ్రామస్థులు సంద్రాయ నృత్యాలు, వాయిద్యాలతో సందడి చేశారు. ఈ కార్య క్రమంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డీపీవో టి.కొండలరావు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఐటీడీఏ ఈఈఏ మణిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
చెరువులను ఆక్రమిస్తే కఠిన చర్యలు
పార్వతీపురం, మార్చి28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎవరైనా చెరువులను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పార్వతీపురం, సాలూరు, పాలకొండ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్షిం చారు. ఆక్రమణల తొలగింపులో ఎటువంటి ఆటంకాలు ఉన్నా.. మున్సిపాలిటీ, రెవెన్యూ సంయు క్తంగా జాయింట్ ఆపరేషన్ నిర్వహించాలన్నారు. ఆక్రమణదారులకు నోటీసులు అందించాలని, వాటిని కలెక్టరేట్‌కు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఎదురైతే ఉన్నతాధికారులు దృష్టికి తీసుకురావాలన్నారు. బంగారు కుటుంబాల దత్తత కార్యక్రమం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల 30న జిల్లాకేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. మండల, నియోజకవర్గ స్థాయిల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఈ సమీక్షలో పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్వో కె.హేమలత తదితరులు పాల్గొన్నారు.