కుక్క అడ్డు రావడంతో బైక్ బోల్తా
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:18 AM
తన చిన్నాన్న కూతురికి కొడుకు పుట్టాడని సంతోషంగా చూసేందుకు వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
రాజాం రూరల్, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): తన చిన్నాన్న కూతురికి కొడుకు పుట్టాడని సంతోషంగా చూసేందుకు వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాజాంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెర్లాం మండలం డి.గద బవలస గ్రామానికి చెందిన చిట్టి చంద్రశేఖర్(44) శుక్రవారం ఉదయం రాజాం ఏరియా ఆసుపత్రిలో తన చిన్నాన్న కూతురికి కొడుకు పుట్టాడని తెలిసి.. ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. పట్టణంలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయానికి సమీపంలోకి వచ్చేసరికి కుక్క అడ్డంగా రావడంతో తప్పించబోయి బోల్తాపడ్డారు. ఇదే సమయంలో రాజాం నుంచి గదబవలస వైపు వెళ్తున్న ఆటో డ్రైవర్ జావాన రమేష్‌నాయుడు చంద్రశేఖర్‌ను గుర్తించి, 108 వాహనంలో రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. పరిస్థితి విషమించడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని రిమ్స్ వైద్యులు తెలిపారు. రాజాంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకవస్తుండగా మార్గ మధ్యంలో చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయారు. ఏఎస్‌ఐ పి.జనార్దనరావు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.