Share News

Big hospitals for name only పేరుకే పెద్దాసుపత్రులు

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:03 AM

Big hospitals for name only జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సేవలు మెరుగుపడడం లేదు. కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నా ఫలించడం లేదు. ముఖ్యంగా ఏపీ వైద్య విధాన పరిషత్‌ పరిధిలో ఉన్న ఆస్పత్రులు రోగుల్లో విశ్వాసం కల్పించలేకపోతున్నాయి. ఏడేళ్ల కిందట ప్రభుత్వం అభివృద్ధి పనులకు నాబార్డు నిధులు మంజూరు చేసింది. కాంట్రాక్టర్‌ సకాలంలో పనులు పూర్తి చేయక పోవడంతో ప్రభుత్వం వేరే కాంట్రాక్టర్‌కు అప్పగించింది. అయినా పనుల్లో వేగం లేదు.

Big hospitals for name only పేరుకే పెద్దాసుపత్రులు
రాజాం ఏరియా ఆసుపత్రిలో పనులు జరుగుతున్న దృశ్యం

పేరుకే పెద్దాసుపత్రులు

ముందుకు సాగని అభివృద్ధి పనులు

వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 8 ఆస్పత్రులు

ఏడేళ్లుగా పనులు సా...గుతున్న దుస్థితి

వైద్యసేవలు, పరీక్షలు అంతంతమాత్రమే

పెదవివిరుస్తున్న రోగులు

జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సేవలు మెరుగుపడడం లేదు. కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నా ఫలించడం లేదు. ముఖ్యంగా ఏపీ వైద్య విధాన పరిషత్‌ పరిధిలో ఉన్న ఆస్పత్రులు రోగుల్లో విశ్వాసం కల్పించలేకపోతున్నాయి. ఏడేళ్ల కిందట ప్రభుత్వం అభివృద్ధి పనులకు నాబార్డు నిధులు మంజూరు చేసింది. కాంట్రాక్టర్‌ సకాలంలో పనులు పూర్తి చేయక పోవడంతో ప్రభుత్వం వేరే కాంట్రాక్టర్‌కు అప్పగించింది. అయినా పనుల్లో వేగం లేదు.

రాజాం, మే 30(ఆంధ్రజ్యోతి):

వైద్య విధాన పరిషత్‌ పరిధిలో జిల్లాలో ఎనిమిది ఆస్పత్రులు ఉన్నాయి. రాజాం, గజపతినగరం, ఎస్‌.కోటలో ఏరియా ఆస్పత్రులు, బాడంగి, చీపురుపల్లి, బొబ్బిలి, భోగాపురం, నెల్లిమర్ల సీహెచ్‌సీలు ఏపీవీపీ పరిధిలో కొనసాగుతున్నాయి. వైసీపీ హయాంలో వీటిని అప్‌గ్రేడ్‌ చేసినా.. సేవలు మాత్రం పెరగలేదు. పేరుకే గైనిక్‌, పిడియాట్రిక్‌, ఎముకలు, కంటి, డెంటల్‌, జనరల్‌ సర్జరీ విభాగాలను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు కానీ ఓపీ సేవలు అందించడంలేదు. అటు ఇన్‌పేషెంట్‌ విభాగం కూడా అంతంతమాత్రమే. ప్రసవాలు, కుటుంబ నియంత్రణ చికిత్సలు కూడా లక్ష్యం మేర జరగడం లేదు. చాలా ఆస్పత్రుల్లో ఈసీజీ, ఎక్స్‌రే పనిచేయడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి.

ఓపీలోనూ వెనుకంజ

జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో 13 లక్షల వరకూ ఓపీ ఉండాలని నిర్దేశించారు. అందులో సగం కూడా పూర్తిచేయలేకపోయారు. ఇన్‌పేషెంట్ల విభాగం గురించి చెప్పనవసరం లేదు. ఆపరేషన్లు, ప్రసవాల టార్గెట్‌ కూడా అలానే ఉంది. అన్నింటిలోనూ వెనుకబాటే కనిపిస్తోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వ్యాధుల సీజన్‌ నడుస్తోంది. ఏ ఆస్పత్రి చూసినా రోగులతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో పేదలు, సామాన్యులు, ప్రభుత్వ ఆస్పత్రుల వైపు వస్తున్నా.. సిబ్బంది నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. దీంతో ప్రైవేటు వైద్యం వైపు వెళుతుండడంతో భారంగా మారుతోంది. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మరికొందరు ఉన్నత చదువులు పేరిట సెలవుల్లో ఉన్నారు. దీంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందడం లేదు.

వైద్య పరీక్షలు లేవు..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరగడం లేదు. జ్వరం వస్తే వైద్యులు రక్త పరీక్షలకు సిఫారసు చేస్తున్నారు. అయితే సరైన పరికరాలు లేకపోవడం, కొన్నిరకాల పరీక్షలు జరపకపోవడం, ల్యాబ్‌ టెక్నీషియన్‌ లేకపోవడం వంటి కారణాలతో చాలా ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు జరగడం లేదు. దీంతో పేద, సామాన్య ప్రజలు ప్రైవేటు ల్యాబ్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. సొంత డబ్బులు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఈ ఆస్పత్రుల్లో ఎక్స్‌రే, స్కానింగ్‌ విభాగాలు ఉన్నా రోగులకు రకరకాల కారణాలు చెప్పి బయటకు పంపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కనీసం వైద్య విధాన పరిషత్‌లో ఉన్న ఈ ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపరిస్తే జిల్లా వ్యాప్తంగా ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది.

ఓపి పెరిగింది కాని సేవలు సేవలు అందడం లేదు..

ప్రభుత్వాస్పత్రిలో సేవలు అంతంతమాత్రంగా అందుతున్నాయి. వైద్య పరీక్షలు సక్రమంగా జరగడం లేదు. ఎక్స్‌రే, స్కానింగ్‌ వంటివి బయట తీసుకురామంటున్నారు. రకరకాల కారణాలు చెబుతున్నారు. సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే మాలాంటి వారు కష్టమైనా ప్రైవేటు వైద్యం చేయించుకుంటున్నారు.

బేపల సాంబమూర్తి, స్థానికుడు, రాజాం

పనులు సకాలంలో పూర్తి చేయడానికి చర్యలు

రాజాం ఏరియా ఆసుపత్రిలో ఓపి పెరిగింది. సేవలు అందించడానికి వైద్యులు నానా అవస్దలు పడుతున్నారు. ఏడేళ్లుగా అభివృద్ధి పనులు జరుగుతుండటంతో రోగులు ఉండటానికి కూడా సౌకర్యం లేదు. పెండింగ్‌ పనులు పూర్తి చేయడానికి ఎప్పటి కప్పుడు కాంట్రాక్టర్‌తో చర్చిస్తున్నాం.

- ఎన్‌.పద్మశ్రీ రాణీ, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి

Updated Date - Jun 03 , 2026 | 12:03 AM