ప్రపంచ స్థాయి ప్రమాణాలు..
ABN , Publish Date - Aug 02 , 2026 | 07:39 AM
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకుంది. ఎగిరే చేప ఆకృతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలను అడుగడుగున ప్రతిబింబిస్తోంది.
భోగాపురం,(ఆంధ్రజ్యోతి): భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకుంది. ఎగిరే చేప ఆకృతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలను అడుగడుగున ప్రతిబింబిస్తోంది. టెర్మినల్ భవనం 77,342 చ.మీ. విస్తీర్ణంలో రూపుదిద్దుకుంది. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణం చేయడానికి తగిన వసతులు ఉన్నాయి. తుఫాన్ గాలులు గంటకు 275 కి.మీ. వేగంతో వచ్చినా టెర్మినల్ చెక్కు చెదరదు. 3,800 మీటర్ల పొడవైన రన్‌వే, సమాంతరంగా టాక్సీవే, 18 విమానాలకు స్టాండ్లు, 55 మీటర్ల ఎత్తున ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ఉన్నాయి. 5 వేల చ.మీ. విస్తీర్ణంలో నిర్మించిన కార్గో టెర్మినల్ ద్వారా ఏటా 25 వేల టన్నుల సరుకు రవాణాకు వీలుంటుంది. భవిష్యత్తులో ఎంఆర్‌ఓ (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్), లాజిస్టిక్స్ హబ్ కోసం 154 ఎకరాల ఏరోసిటీ, సిబ్బందికి 139 ఎకరాల్లో టౌన్‌షిప్, ఇవి కాకుండా మరో 500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్ నిర్మించనున్నామని జీఎంఆర్ యాజమాన్య ప్రతినిధులు జీబీఎస్ రాజు, ఐ.ప్రభాకర్‌రావు, ఎస్‌జీకే కిశోర్, కన్వర్‌బీర్ సింగ్‌లు తెలిపారు.