Bhogapuram Airport భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతం
ABN , Publish Date - Jul 27 , 2026 | 12:51 AM
Bhogapuram Airport to Boost North Andhra's Development విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతమివ్వడం ఖాయమని, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
పార్వతీపురం, జూలై 26(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతమివ్వడం ఖాయమని, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు ఒకటో తేదీన ఎయిర్‌పోర్టు ప్రారంభమవుతుందన్నారు. ఆదివారం జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె విమానాశ్రయాన్ని సందర్శించారు. భద్రతా, వేదిక, ట్రాఫిక్, పార్కింగ్, తాగునీరు వైద్య సేవలపై అక్కడున్న సిబ్బందితో చర్చించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టు నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎంతో కృషి చేశారన్నారు. ప్రారంభోత్సవ సమయంలో తమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థులతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. విమానాశ్రయంతో ఉత్తరాంధ్రలో యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందడానికి ఎయిర్‌పోర్టు ఒక వెన్నెముకగా నిలుస్తుందని వెల్లడించారు. ఈ సందర్శనలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం, పాలకొండ ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ , ఆర్టీసీ రీజనల్ చైర్మన్ దున్ను దొర, మాజీ ఎమ్మెల్యే గిడ్డ ఈశ్వరి, టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి, ఉమ్మడి జిల్లాల గ్రంథాలయాల సంస్థ చైర్మన్ డి.రామకృష్ణ తదితరులు ఉన్నారు.