Bhogapuram Airport is the jewel in the crown of North Andhra. భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర మణి కిరీటం
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:35 AM
Bhogapuram Airport is the jewel in the crown of North Andhra. భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకే మణి కిరీటంగా మారనుందని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టును ఆయన మంగళవారం సందర్శించి అణువణువూ పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎయిర్‌పోర్టును తొలిసారిగా 2024 జూలై 10న సందర్శించానని, తరువాత అదే ఏడాది జూలై12న ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుతో సందర్శించానని గుర్తుచేశారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు
ఉత్తరాంధ్ర మణి కిరీటం
ఏరో డ్రోమ్ లైసెన్స్ మంజూరుతో శతశాతం పూర్తి
ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు
ఎయిర్‌పోర్టులో స్థానికులకు ఉద్యోగావకాశాలు ఎక్కడ : బంగార్రాజు
విజయనగరం/భోగాపురం, జూలై 7(ఆంధ్ర జ్యోతి):
భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకే మణి కిరీటంగా మారనుందని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టును ఆయన మంగళవారం సందర్శించి అణువణువూ పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎయిర్‌పోర్టును తొలిసారిగా 2024 జూలై 10న సందర్శించానని, తరువాత అదే ఏడాది జూలై12న ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుతో సందర్శించానని గుర్తుచేశారు. అప్పుడే లక్ష్యం పెట్టుకున్నామని, అందుకు అనుగుణంగా భోగాపురం ఎయిర్‌పోర్టును రెండేళ్లలో పూర్తి చేశామన్నారు. ఏరో డ్రోమ్ లైసెన్స్ మంజూరుతో విమానశ్రయం శతశాతం పూర్తి అయినట్లేనని చెప్పారు. ప్రధాని మోదీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సంప్రదిస్తున్నారని, మోదీ చెప్పిన తేదీనే భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తామన్నారు. ఈనెలాఖరు లేదా వచ్చేనెలలో ప్రారంభించే అవకాశం ఉందన్నారు.
ఎయిర్‌పోర్టు నిర్మాణం అందరి సహకారంతోనే జరిగిందని, ముఖ్యంగా ఇక్కడి ప్రజలు, రైతుల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డిసెంబరు 2026 నాటికి పూర్తి కావాలని చెప్పారని, కానీ ఆరు నెలల ముందుగానే నిర్మాణం పూర్తి చేయగలిగామన్నారు. మన ప్రాంతం కావడంతో ఇక్కడి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక శ్రద్ధ చూపి నిర్మాణం పూర్తి చేసేలా ప్రయత్నించామన్నారు. రెండు నెలలుగా ఎయిర్‌పోర్టుకు సంబంధించిన అన్ని విభాగాల వారు పరిశీలించారని, తద్వారా ఏరో డ్రోమ్ లైసెన్స్ మంజూరు అయిందని, దీంతో శతశాతం ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి అయినట్టేనని చెప్పారు. ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం అయ్యాక వారం రోజుల తరువాత పూర్తి స్థాయి కార్యకలాపాలు జరుగుతా యన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని 4కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు అనువుగా ఉండేలా ప్లాన్ చేశామన్నారు.
అనేక ప్రత్యేకతలతో..
భోగాపురం ఎయిర్‌పోర్టును ఎగిరే చేప ఆకృతిలో 78,000 చదరపు అడుగుల పరిమాణంలో టెర్మినల్ భవనం నిర్మించామని, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ వద్ద మన కళలు, చరిత్ర, స్థానిక సంసృతి, సాంప్రదాయాలు అద్దంపడతాయన్నారు. విశాఖపట్నంకు భోగాపురం ఎయిర్‌పోర్టు దూరం అవుతుందనే అపోహను పెట్టుకోవద్దని, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ లేని విశాలమైన ఏడు రోడ్లు నిర్మాణం చేపడుతున్నామన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్ పరిపూర్ణంగా అమలు చేసే దిశగా భోగాపురం విమానశ్రయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పదిసార్లు క్షేత్ర స్థాయి పర్యటనలు చేశామని గుర్తుచేశారు. 20000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో భోగాపురం కార్గో నిర్మానం జరుగుతుందన్నారు. ఫార్మా రంగంతో పాటు మామిడి, ఇతర ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవడానికి భోగాపురం విమానాశ్రయం ఓ వారధిగా ఉపయోగపడుతుందన్నారు. ఆయన వెంట విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్, జీఎంఆర్ సిబ్బంది, ఆర్డీవో సుధాసాగర్, తహసీల్దార్ హేమంత్‌కుమార్, నాయకులు కరోత్రు సత్యన్నారాయణ తదితరులు ఉన్నారు.
ఎయిర్‌పోర్టులో స్థానికులకు ఉద్యోగాలేవీ : బంగార్రాజు
ఎయిర్‌పోర్టు నుంచి కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తిరుగుముఖం పడుతున్న సమయంలో మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగారాజ్రు, టీడీపీ కార్యకర్తలు ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు. ఇక్కడ భూములు ఇచ్చిన రైతు కటుంబాలకు, స్థానికులకు ఎయిర్‌పోర్టులో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలేదని, భూములిచ్చిన రైతు కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని గతంలో ప్రకటించారని గుర్తుచేశారు. దీనిపై స్పందించాలంటూ కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడ్ని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ భూ నిర్వాసితులు, ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జీఎంఆర్ సంస్థ ప్రతినిధులకు ఆదేశించారు. అందుకు సంబంధించిన ఫైల్‌ను కూడా సంస్థ ప్రతినిధులకు అందజేశారు. వీలైనంత త్వరగా స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.