Bhogapuram... A dream realized.భోగాపురం.. కల సాకారం
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:31 AM
Bhogapuram... A dream realized. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం అదిరింది. ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జాతికి అంకితం చేసిన దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరూ పులకించిపోయారు.
భోగాపురం.. కల సాకారం
అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం
ప్రధాని నోట పైడితల్లమ్మ మాట..
అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైఉండాలన్న మోదీ
లక్షలాది మంది ప్రజలతో కిక్కిరిసిన సభాప్రాంగణం
మరో లక్షమంది బయటే..
ప్రారంభోత్సవం, సభ గ్రాండ్ సక్సెస్
విజయనగరం ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి):
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం అదిరింది. ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జాతికి అంకితం చేసిన దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరూ పులకించిపోయారు. లక్షలాదిమంది కరతాల ధ్వనులు, ఈలలు, జై ఉత్తరాంధ్ర నినాదాల నడుమ అంగరంగ వైభవంగా ఆవిష్కరించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దగ్గరుండి ఈ కార్యక్రమం నిర్వహించారు. వేదికపై ప్రధాని, ముఖ్యమంత్రితో పాటు గవర్నర్ అబ్దుల్‌నజీర్, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్‌కల్యాణ్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ, గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు ఆశీనులయ్యారు.
ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభ ఉపన్యాసంలో ఉత్తరాంధ్ర విశిష్టతను ప్రస్తావించారు. పవిత్రమైన మాసంలో ఉత్తరాంధ్ర పర్యటనకు రావడం తన మనసుకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. సింహాచలం వరహాలక్ష్మీ నృసింహస్వామి, శ్రీకూర్మనాథ స్వామి, విజయనగరం జిల్లా ప్రజల ఇలవేల్పు పైడితల్లమ్మ వారి పాదాలకు నమస్కారాలు సమర్పిస్తున్నామన్నారు. ప్రధాని మాటలకు మద్దతుగా జిల్లా ప్రజలంతా చప్పట్లతో మారుమోగించారు. కొబ్బరి కాయ మనమే కొట్టాం.. గుమ్మడి కాయ మనమే కొట్టాం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించటంతో కూటమి నేతలంతా.. ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు. అంతకుముందు ముమ్మారు భారత మాతకు జై అంటూ నినదించారు. అంతకుముందు ప్రధాని మోదీకి 13వేల మంది బాలికలతో థింసా నృత్యం, 200 మంది బాలికల కూచిపూడి కళారూపకంతో ప్రఽధాని మోదికీ ఘన స్వాగతం పలికారు. సరిగ్గా ఉదయం 10.36 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. 1.26 నిమిషాల వరకు భోగాపురం ఎయిర్‌పోర్టులో ఉన్నారు. తదనంతరం ఆదే విమానంలో కర్ణాటక తిరిగి ప్రయాణమయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపుతో విజయవంతం
రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా చేసిన ఏర్పాట్లతో కార్యక్రమం విజయవంతం అయ్యింది. సీఎం చంద్రబాబు పలువురు మంత్రులు, అధికారులతో నిత్యం సమీక్షలు చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడి పర్యవేక్షణ, మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో 11 మంది మంత్రుల బృందం వారం రోజులుగా ఇక్కడే మకాం వేసి ఏర్పాట్ల పనులు పర్యవేక్షించడం కలిసివచ్చింది. సభ నిర్వహణ, పారిశుధ్యం, తాగునీరు, భోజన వసతులు, అతిథులకు స్వాగతం, భద్రత, వాహనాల పార్కింగ్, దారి మళ్లింపు ఇలా ప్రతి అంశాన్ని సమన్వయం చేసుకోవడంతో ఎటువంటి అసౌకర్యాలు లేకుండా కార్యక్రమం సజావుగా ముగిసేందుకు దోహదపడింది. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చే బస్సులను రూట్ల వారీగా 10 చోట్ల 5 వేల బస్సులకు పార్కింగ్ ఏర్పాటుచేశారు. దీంతో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాలు, బస్సులు ముందుకు సాగాయి. ఉదయం వచ్చేటప్పుడు బస్సుల్లోనే అల్పాహారం అందజేశారు. సభ ముగిసిన తరువాత భోజన పొట్లాలు సమకూర్చారు. బస్సులకు సచివాలయలు, మండలాల వారిగా సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయి అధికారులు సమన్వయం చేసుకున్నారు. దీంతో ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా ప్రజల తరలింపు, స్వగ్రామాలకు సురక్షితంగా తీసుకెళ్లడం జరిగింది.
పోలీసుల సేవలు భేష్
ప్రధాని పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. డీజీపీ హరిష్‌కుమార్ గుప్తా, విశాఖ రేంజ్ డీఐజీ, ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్సీలు, సీఐలు, ఎస్‌ఐలు నేతృత్వంలో 7 వేల మంది పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. సెక్టార్లుగా విభజించుకొని ముందుకు సాగారు. అటు ప్రముఖుల భద్రత, ఇటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, బస్సుల పార్కింగ్‌లు..ఇలా అడుగడుగునా పోలీస్ ముద్ర కనిపించింది.
కీలక బాధ్యతల్లో ఎమ్మెల్యేలు
విమానాశ్రయ ప్రారంభ కార్యక్రమానికి నియోజకవర్గాల వారీగా విచ్చేసిన ప్రజలకు భోజనాలు, రవాణా సౌకర్యాలను ఎమ్మెల్యేలు పర్యవేక్షించారు. రోడ్డుమార్గం పక్కనే టెంట్లు ఏర్పాటుచేసి భోజన వసతి కల్పించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భోజన, మంచినీరు సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు కిమిడి కళావెంకటరావు, లోకం నాగమాధవి, పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు, కోళ్ల లలితకుమారి, బేబినాయన, కోండ్రు మురళీమోహన్, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు తదితరులు కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.