Share News

Beware of thieves! దొంగలొస్తారు జాగ్రత్త!

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:07 AM

Beware of thieves! ఉమ్మడి జిల్లా పాచిపెంట మండలం చినచీపురువలసలో ఈ నెల 11న అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా విరుచుకుపడింది. ఓ ఇంట్లో చొరబడి పెద్ద ఎత్తున బంగారం, నగదు పట్టుకుపోయారు. అక్కడకు నాలుగురోజుల వ్యవధిలోనే పోలీసులు ఆ ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠాలో ముగ్గురు మైనర్లు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

Beware of thieves! దొంగలొస్తారు జాగ్రత్త!

దొంగలొస్తారు జాగ్రత్త!

వేసవిలో అప్రమత్తంగా ఉండకపోతే ఇల్లు గుల్లే

గత ఏడాది 30కుపైగా ఘటనలు

- ఉమ్మడి జిల్లా పాచిపెంట మండలం చినచీపురువలసలో ఈ నెల 11న అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా విరుచుకుపడింది. ఓ ఇంట్లో చొరబడి పెద్ద ఎత్తున బంగారం, నగదు పట్టుకుపోయారు. అక్కడకు నాలుగురోజుల వ్యవధిలోనే పోలీసులు ఆ ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠాలో ముగ్గురు మైనర్లు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

- ఫిబ్రవరి 1న వేపాడ మండలం బొద్దాంలో భారీ చోరీ జరిగింది. పట్టపగలే ఎవరూ లేని ఇంట్లో చొరబడి 36 తులాల బంగారు ఆభరణాలను దోచుకుపోయారు. ఆ సమయంలో జనపరెడ్డి వెంకటరమణ, ముత్యాలమ్మ దంపతులు పొలానికి వెళ్లారు. అక్కడకు కూతవేటు దూరంలోని ప్రొఫెసర్‌ కృష్ణారెడ్డి ఇంట్లో దొంగతనం జరిగింది. 20 గ్రాముల బంగారాన్ని పట్టుకుపోయారు.

విజయనగరం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి):

అసలే వేసవి.. ఆపై ఆరుబయట, డాబాలపై నిద్రించాలనుకునే రోజులు. ఈ ఆలోచనే దొంగలకు అనుకూలం. గత ఏడాది వేసవిలో జిల్లాలో 30కు పైగా దొంగతనాలు జరిగాయి. అప్రమత్తంగా ఉండకపోతే ఇల్లు గుల్లే. ఇప్పటికే జిల్లాలో వారానికో రోజైనా భారీ చోరీ నమోదవుతోంది. ఇంట్లో లేని సమయం చూసి, కుటుంబ సభ్యులు బయటకు వెళ్లే టైమ్‌ చూసి దొంగలు పడుతున్నారు. పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. నిఘా పటిష్టంతో పాటు గస్తీ ముమ్మరం చేసినట్టు జిల్లా పోలీస్‌ యంత్రాంగం చెబుతున్నప్పటికీ చోరీలు తగ్గడం లేదు.

ఎల్‌హెచ్‌ఎమ్‌ఎస్‌(లాక్‌డ్‌ హౌస్‌ మానటరింగ్‌ సిస్టం)పై ప్రజల్లో అవగాహన పెరగలేదు. గ్రామీణ ప్రాంతాలనే టార్గెట్‌ చేసుకొని దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఇళ్లు, షాపులు, వాణిజ్య సముదాయాలు, చివరకు పొలాల్లో ఉన్న మోటార్లు, ఇంజన్లు, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను సైతం చోరీ చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదుచేస్తున్న పోలీసులు విచారణలో మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. జిల్లా మీదుగా ఉన్న అంతర్‌ రాష్ట్ర రహదారులు, రైలు మార్గాలు దొంగలు తప్పించుకునేందుకు అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో దొంగతనాల కేసులు పెరుగుతున్నాయి. ఉత్తరాధి రాష్ట్రాలకు చెందిన ముఠాలు జిల్లాలో ప్రవేశించాయన్న హెచ్చరికలు పోలీసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మొన్నామధ్య దొంగలు విజయనగరంలో బీభత్సం సృష్టించారు. బిచ్చగాళ్ల రూపంలో వచ్చి దొంగతనాలకు విఫలయత్నం చేశారు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపించాయి. ఇటు పోలీస్‌ శాఖకు సిబ్బంది కొరత వేధిస్తున్నట్లు తెలుస్తోంది. స్టేషన్‌కు సగటున 32 మందికిపైగా సిబ్బంది ఉండాలి.. కానీ ఎక్కడా లేరు.

జిల్లాలో 27 మండలాల్లో పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. విజయనగరంతో పాటు రాజాం, బొబ్బిలిలో పట్టణ పోలీస్‌స్టేషన్లు కొనసాగుతున్నాయి. వీటితో పాటు సీసీఎస్‌, మహిళా, ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లు కొనసాగుతున్నాయి. బీ గ్రేడ్‌ స్థాయిలో కొనసాగుతున్న విజయనగరం పోలీస్‌స్టేషన్లలో సైతం అరకొరగానే పరిస్థితి ఉంది. సీ గ్రేడ్‌లో ఉన్న రాజాం, బొబ్బిలి పోలీస్‌స్టేషన్లలో అదే పరిస్థితి. మూడు సబ్‌ డివిజన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఎస్పీతో పాటు అడిషనల్‌ ఎస్పీలు ముగ్గురు, డీఎస్పీలు 10 మంది శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. సీఐలు, ఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు 1,200 మంది విధులు నిర్వహిస్తున్నారు. 750 మంది వరకూ హోంగార్డులు సేవలందిస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 14,000 మంది కానిస్టేబుల్‌ కొరత ఉన్నట్టు పోలీస్‌ యంత్రాంగం చెబుతోంది. జిల్లాలో 1,000 మంది కానిస్టేబుళ్లను నియమిస్తే కానీ అన్ని పోలీస్‌స్టేషన్లలో సిబ్బంది కొరత తీరదని అధికారులు చెబుతున్నారు.

నిద్దరోడుతున్న నిఘా..

జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులు, కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు పోలీస్‌ శాఖ చెబుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వందలాది కెమెరాలు ఏర్పాటు చేశామంటున్నారు కానీ ఇందులో చాలా వరకు పనిచేయడం లేదు. నైట్‌ బీట్‌ కూడా తగ్గుముఖం పట్టింది. ప్రధాన రహదారుల్లో సైరన్‌తో చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలున్నాయి. దారినిపోయే వాహనదారుల ఫొటోలు, ఫింగర్‌ ప్రింట్స్‌ తీసుకొని వదిలేస్తున్నారన్న అపవాదు ఉంది. ఈ పరిస్థితిపై పోలీస్‌ శాఖ దృష్టిసారించాల్సిన అవసరముంది.

Updated Date - Apr 27 , 2026 | 12:07 AM