Better to go an hour earlier గంట ముందు వెళ్తే మంచిది
ABN , Publish Date - Mar 16 , 2026 | 12:14 AM
Better to go an hour earlier పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు వారికే కేటాయించిన పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకుంటే చాలా ప్రయోజనం ఉంటుందని, పరీక్షను ప్రశాంతంగా రాయగలరని జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనాయుడు తెలిపారు.
గంట ముందు వెళ్తే మంచిది
ప్రశాంతంగా పరీక్ష రాసే అవకాశం
ప్రతి ప్రశ్న జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి
హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
‘ఆంరఽఽధజ్యోతి’తో జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యంనాయుడు
విజయనగరం కలెక్టరేట్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి):
పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు వారికే కేటాయించిన పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకుంటే చాలా ప్రయోజనం ఉంటుందని, పరీక్షను ప్రశాంతంగా రాయగలరని జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనాయుడు తెలిపారు. పరీక్ష పత్రంలో ఉన్న ప్రశ్నలను పూర్తిగా చదివి అర్థం చేసుకుని చక్కని చేతి రాతతో సమాధానాలు రాయాలని సూచించారు. పరీక్షల మధ్య ఉన్న విరామ సమయాన్ని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలన్నారు. పరీక్షల సమయంలో చదువుతో పాటు ఆరోగ్యం కూడా చాలా కీలకమని, ప్రతి విద్యార్థి పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. పరీక్షలకు సంబంధించిన పలు అంశాలపై ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
హాల్ టిక్కెట్ చూపిస్తే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు హాల్ టిక్కెట్ చూపిస్తే ఆర్‌టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. హాల్ టిక్కెట్‌పై ఉన్న క్యూర్ కోడ్ ద్వారా సెంటర్ లొకేషన్ తెలుసుకోవచ్చు. ప్రతి విద్యార్థి దీనిని గమనించుకోవాలి. హాల్ టిక్కెట్లపై ఏమైనా పొరపాట్లు ఉంటే నామినల్ రోల్స్ ద్వారా సరిచేసుకోవచ్చు. పరీక్ష కేంద్రంలోకి హాల్ టిక్కెట్, ఫ్లాంక్, పెన్నులు మాత్రమే తీసుకువెళ్లాలి. ఎటువంటి ఎలక్ర్టానిక్ పరికరాలు తీసుకు రాకూడదు. ఏదైనా కారణంతో పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి ఆలస్యమైతే ఉదయం 10 గంటల వరకూ అనుమతిస్తారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
ప్రతి కేంద్రంలో మౌలిక సదుపాయాలు
జిల్లాలోని 119 పరీక్ష కేంద్రాల్లోనూ మౌలిక సదుపాయాలు కల్పించాం. తాగునీరు. విద్యుత్ సదుపాయం, సరిపడా బెంచీలు, వైద్య సదుపాయాలు కల్పించాం. ఎక్కడా అసౌకర్యం కలగకుండా పక్కా ఏర్పాట్లు చేశాం.
పరీక్షల పర్యవేక్షణకు ప్రత్యేక తనిఖీ బృందాలు
జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల పర్యవేక్షణకు ప్రత్యేకంగా తనిఖీ బృందాలను నియమించాం. జిల్లా వ్యాప్తంగా 119 కేంద్రాల్లో 22,961 మంది రెగ్యూలర్, 564 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్ష హాజరవుతున్నారు. అందుకు 119 మంది సిఎస్‌లు, 119 మంది డీవోలు, 30 మంది అదనపు అధికారులు, 1210 మంది ఇన్విజిలేటర్లను నియమించాం. జిల్లా పరిశీలకునిగా ఆర్‌జేడీ తెహరా సుల్తాన్‌ను ప్రభుత్వం నియమించింది.
ఎనిమిది కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ పరీక్షలు
జిల్లాలోని ఎనిమిది కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ పరీక్షలు జరుగనున్నాయి. వీటికి హాజరయ్యే విద్యార్థులు ఇప్పటికే హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 631 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. వీటికి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తి చేశాం.
కంట్రోల్ రూం ఏర్పాటు
పరీక్షల సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఏమైనా సందేహాలు, సమస్యలు ఉంటే నివృత్తి చేయడానికి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. 08922-351399,7382157686 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.
అందరికీ ఆల్‌ది బెస్ట్
విద్యార్థి భవిష్యత్తుకు టెన్త్ పరీక్షలు తొలిమెట్టు. మరో కొద్ది గంటల్లో పరీక్ష రాస్తున్నవారందరికీ ఆల్‌ది బెస్ట్ ... ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు తీసుకురావాలి.
============