మెరుగైన వైద్య సేవలు అందించాలి
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:17 AM
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.విజయలక్ష్మి సూచించారు.
- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజయలక్ష్మి
గరుగుబిల్లి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.విజయలక్ష్మి సూచించారు. సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా గురువారం పెదగుడబలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అక్టోబరు ఒకటో తేదీ వరకు సేవా సంకల్ప అభియాన్-2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ఆరోగ్య కేంద్రాలకే వైద్యులు పరిమితం కాకుండా, గ్రామాల్లో శిబిరాలు నిర్వహించి ప్రజలకు చేరువకావాలన్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. 15 మండలాల పరిధిలో నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అవసరమైన మందులు, పరీక్షలు నిర్వహణకు ల్యాబ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రసవాలు జరిగేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. అనంతరం రోగులతో మాట్లాడి అభిప్రాయాలను సేకరించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వైద్య సిబ్బందితో ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్‌ఎంకే తిరుమలప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.