Share News

పంట మార్పిడితో లాభాలు

ABN , Publish Date - Apr 16 , 2026 | 11:19 PM

రైతులు పంట మార్పిడి విధానం అమలు చేయాలని, దీనివల్ల అధిక లాభాలు వస్తాయని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

పంట మార్పిడితో లాభాలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

- వరికి బదులు ఉద్యానవన పంటలు సాగు చేయండి

- కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

వీరఘట్టం, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): రైతులు పంట మార్పిడి విధానం అమలు చేయాలని, దీనివల్ల అధిక లాభాలు వస్తాయని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. డీఏఆర్‌టీపీ ప్రోగ్రాంలో భాగంగా వీరఘట్టంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం రైతులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు వరి పంట కాకుండా ఉద్యానవన పంటల వైపు దృష్టి సారించాలన్నారు. ఇక్కడ పండిస్తున్న ఉత్పత్తులకు మార్కెటింగ్‌ చేసే విధంగా షాపులు పెట్టించాలని డీఆర్‌డీఏశాఖకు ఆదేశించారు. పొలాల గట్లను ఖాళీగా ఉంచకుండా ఆకుకూరలు, తీగజాతి కూరగాయలు, కంది, అరటి, బొప్పాయి వంటి పంటలు వేసుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించాలన్నారు. వర్షాలు రాకముందు నవధాన్యాలు పీఎండీఎస్‌ 20-30 పంటల విత్తనాల మిశ్రమాన్ని భూమిలో వేసుకోవాలన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో 365 రోజులూ పండే ఏటీఎం మోడల్‌ కూరగాయల విత్తనాలను కలెక్టర్‌ వేశారు. అనంతరం వీరఘట్టం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించారు. జనగణనపై ఎన్యూమలేటర్లకు ఇస్తున్న శిక్షణను పరిశీలించారు. తప్పులు లేకుండా జనగణన చేపట్టాలని, ప్రజలకు వారి ఫోన్‌లోనే వివరాలు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం వీరఘట్టం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. వీరఘట్టంతో పాటు వంగర, బిటివాడ, జీఎంవలస, రావివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని రోగులు కూడా ఇక్కడికే వైద్యం కోసం వస్తున్నారని, ఈ పీహెచ్‌సీని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంగా మార్చాలని వైద్యులు ప్రదీప్‌కుమార్‌, సాయికుమార్‌ కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ పవర్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డిప్యూటీ కలెక్టర్‌ దిలీప్‌ చక్రవర్తి, ఏడీఏ రత్నకుమారి, మండల ప్రత్యేకాధికారి విజయశాంతి, ఏవో సౌజన్య, ఎంపీడీవో బి.వెంకటరమణ, తహసీల్దార్‌ సాయి కామేశ్వరరావు, ఉద్యాన, వెటర్నరీ శాఖల అధికారులు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2026 | 11:19 PM