Share News

ఊరూరా బెల్ట్‌!

ABN , Publish Date - Aug 23 , 2026 | 11:50 PM

సీతంపేట ఏజెన్సీలో గొలుసు (బెల్ట్‌షాపు) దుకాణాల దందా నడుస్తోంది.

 ఊరూరా బెల్ట్‌!

- విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

- క్వార్టర్‌పై అదనంగా రూ.50 వసూలు

- చోద్యం చూస్తున్న ఎక్సైజ్‌ అధికారులు

- ఇదీ సీతంపేట ఏజెన్సీలో పరిస్థితి

సీతంపేట, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో గొలుసు (బెల్ట్‌షాపు) దుకాణాల దందా నడుస్తోంది. ఊరూరా బెల్టు షాపులు దర్శనమిస్తోన్నాయి. మండలంలోని దోనుబాయి, పొల్ల, మానాపురం, కిండంగి, కుసిమి, మర్రిపాడు, పూతికవలస, చిన్నబగ్గ, జి.గుమ్మడ, శంభాం తదితర గ్రామాల్లో 25 వరకు బెల్ట్‌ షాపులు నడుస్తోన్నాయి. మండల కేంద్రం సీతంపేటలోనే ఏడు వరకు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ బెల్ట్‌ షాపులకు మద్యం వ్యాపారులే నేరుగా సరుకు సరఫరా చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో మద్యం సీసాలను రవాణా చేసి బెల్టు దుకాణాలకు చేరవేస్తున్నారు. గ్రామాల్లో అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఎవరికి వారే మద్యం అమ్మకాలను కొనసాగిస్తున్నారు. బెల్ట్‌ నిర్వాహకులు క్వార్టర్‌ బాటిల్‌పై అదనంగా రూ.50 వసూలు చేస్తూ మందుబాబులను దోచుకుంటున్నారు. ఉదయం 5 గంటల నుంచి 10గంటల వరకు ఒక ధర, 10 గంటల నుంచి రాత్రి వరకూ ఒక్కరేటు ఉంటుంది. చీప్‌ లిక్కర్‌ కంపెనీలైన హెచ్‌డీ, బెంగళూరు మద్యం బాటిల్‌పై ఎంఆర్‌పీ రూ.99 ఉంటే రూ.150కు విక్రయిస్తున్నారు. ఓసీ విస్కీ ఎంఆర్‌పీ రూ.160ఉంటే రూ.210కు, ఎంహెచ్‌ విస్కీ ఎంఆర్‌పీ రూ.210ఉంటే రూ.250కు అమ్ముతున్నారు. మందుబాబులకు మంచింగ్‌తో పాటు కూర్చోవడానికి బల్లలు, ఇతరాత్ర సౌకర్యాలు కల్పిస్తున్నారు. కిరాణా, టిఫిన్‌ సెంటర్‌, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలుగా ఈ బెల్ట్‌ దుకాణాలను నిర్వహిస్తున్నారు. బెల్టు దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే హెచ్చరిస్తున్నా ఎక్సైజ్‌ అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత మూడునెలలుగా ఒక్క కేసు నమోదు చేసిన దాఖలాలు లేవు. మద్యం వ్యాపారులు సిండికేట్‌ కావడంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. తూతూ మంత్రంగా దాడులు చేసి కొన్ని మద్యం సీసాలు పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

లైసెన్స్‌డ్‌ దుకాణాల్లోనూ ధరల మోత

సీతంపేట ఏజెన్సీలో ఉన్న రెండు లైసెన్స్‌డ్‌ మద్యం దుకాణాల్లో కూడా ధరల మోత మోగుతోంది. ఎంఆర్‌పీకే మద్యాన్ని విక్రయించాల్సి ఉండగా సిండికేట్‌ ముసుగులో వ్యాపారులు మందుబాబులను నిలువునా దోచుకుంటున్నారు. ఎక్సైజ్‌శాఖ సహకారంతో దుకాణ యజమానులు ఒక్కో బాటిల్‌పై రూ.10నుంచి రూ.25 వరకు అదనపు వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. చీప్‌ లిక్కర్‌ మద్యం సీసాపై ఎంఆర్‌పీ రూ.99ఉంటే మద్యం దుకాణంలో రూ.125కి విక్రయిస్తున్నారు. లైసెన్స్‌డ్‌ మద్యం దుకాణాల్లోనే ఈ పరిస్థితి ఉంటే బెల్ట్‌దుకాణాల గురించి చెప్పనవసరం లేదని మందుబాబులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

కేసులు నమోదు చేస్తాం..

గ్రామాల్లో బెల్ట్‌ షాప్‌లు లేకుండా చర్యలు తీసుకుంటాం. బెల్ట్‌ షాప్‌లు నడుపుతున్నట్లు తెలిస్తే ప్రజలు మాకు సమాచారం ఇవ్వాలి. వెంటనే దాడులు చేసి కేసులు నమోదు చేస్తాం. లైసెన్స్‌డ్‌ మద్యం దుకాణాల్లో ఎంఆర్‌పీకే మద్యం విక్రయించాలి. అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తాం.

-వెంకటరాజ్‌, పాలకొండ ఎక్సైజ్‌ సీఐ

Updated Date - Aug 23 , 2026 | 11:50 PM