Believing... deceiving నమ్మించి.. వంచించి
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:26 AM
Believing... deceiving జిల్లా చరిత్రలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ప్రజల నమ్మకాన్ని రెండుచేతులా సొమ్ముచేసుకొని బోర్డు తిప్పేసిన నయా దోపిడీ బాగోతం బయటపడింది. వందలాదిమంది నెత్తిన సుమారు 50 కోట్ల రూపాయల మేర కుచ్చుటోపీ పెట్టి బోర్డు తిప్పేసిన జ్యూవలరీ షాపుల యజమానుల దోపిడీ బండారం బట్టబయలైంది.
నమ్మించి.. వంచించి
జిల్లాలో మరో ఘరానా మోసం
ఇద్దరు జ్యూవలరీ వర్తకుల నిర్వాకం
ప్రజల బంగారం, డబ్బుకు టోకరా
వందలాదిమంది నెత్తిన శఠగోపం
సుమారు రూ.50కోట్ల వరకు కుచ్చుటోపీ
కేసులు నమోదు చేసిన పోలీసులు
స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న బాధితులు
జిల్లా చరిత్రలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ప్రజల నమ్మకాన్ని రెండుచేతులా సొమ్ముచేసుకొని బోర్డు తిప్పేసిన నయా దోపిడీ బాగోతం బయటపడింది. వందలాదిమంది నెత్తిన సుమారు 50 కోట్ల రూపాయల మేర కుచ్చుటోపీ పెట్టి బోర్డు తిప్పేసిన జ్యూవలరీ షాపుల యజమానుల దోపిడీ బండారం బట్టబయలైంది. ప్రజల బంగారం, డబ్బుకు టోకరా వేసి వందలాదిమంది నెత్తిన శఠగోపం పెట్టి పరారయ్యారు. బాధితుల్లో కొందరు పోలీసులను ఆశ్రయించగా, ఇంకొందరు మధ్యవర్తుల ద్వారా కొంతైనా రాబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
- మెంటాడకు చెందిన కొల్ల భరత్‌కుమార్‌కు కొత్తగా పెళ్లయింది. భార్యకు అత్తవారు పెట్టిన బంగారు ఆభరణాలు మార్చుదామని ఆరునెలల కిందట సుమారు 17 తులాలు బరువున్న బంగారు వడ్డాణం, నల్లపూసల తాడు తీసుకుని విజయనగరంలోని ఓ బంగారు షాపునకు వెళ్లారు. వడ్డాణానికి ఉన్న చిన్నరంధ్రం పూడ్చి పెద్దది చేయాలని, నల్లపూసల చైను సైజు పెంచాలని కోరాడు. షాపు యజమాని సరేనన్నాడు. నెలల తరబడి తిరుగుతున్నా ఎంతకూ ఇవ్వకపోవడంతో గట్టిగా అడగాలని వెళ్తే షాపు యజమాని బోర్డు తిప్పేశాడని తెలిసి కుప్పకూలిపోయాడు. పోలీసులను ఆశ్రయించాడు.
- డెంకాడకు చెందిన పైల రాజు విజయనగరంలోని ఓ షాపులో రెండు తులాల బంగారు గాజులు పద్దుపెట్టి 40 వేల రూపాయలు తీసుకున్నాడు. కొన్నాళ్లకు వాటిని విడిపించేందుకు వెళ్తే బోర్డు తిప్పేసిన విషయం తెలిసి బావురమంటూ వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించాడు.
- పూసపాటిరేగకు చెందిన వి.నరసింగరావు బంగారుగొలుసు చేయాలని ఓ షాపునకు వెళ్లి లక్ష రూపాయలు అడ్వాన్సుగా చెల్లించాడు. ఆషాపు యజమాని బోర్డు తిప్పేసాడని తెలియడంతో లబోదిబో మంటూ ఏం చేయాలో అర్థంకాక ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
- మెంటాడ గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు డొంకాడ రామమోహన్ రెండు తులాల బరువు కలిగిన బంగారు చైను, ఉంగరం, చెవిదిద్దుల ఆభరణాలను ఓ దుకాణంలో ఇచ్చి కొత్తనగలు తయారుచేయాలని కోరాడు. ఏడాదిన్నర అవుతున్నా ఇవ్వకపోవడంతో మోసపోయానని తెలుసుకొని కన్నీటిపర్యంతమవుతున్నాడు.
విజయనగరం క్రైం, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి):
కొత్తనగల తయారీకోసం ఇచ్చిన పాత నగలను మింగేసి, కుదువ పెట్టిన బంగారాన్ని సైతం కైంకర్యం చేసి నెత్తిన శఠగోపం పెట్టిన ప్రభుద్దుడు ఒకరైతే, బంగారు ఆభరణాలతోపాటు మజూరీ ఖర్చుల పేరుతో మరికొంత గుంజి చివరకు బొమ్మ చూపించిన నమ్మకద్రోహి ఇంకొకరు. మోసాన్ని ఊహించలేక బంగారం, డబ్బు రెండూ పోగట్టుకొని పిచ్చివాళ్లలా తిరుగుతున్న బాధితులు వందల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. మోసపోయిన వారిలో కొందరు జ్యూయలరీ వర్తకులు, బంగారపు పనివారు, గ్రామీణులతో పాటు పట్నంవాసులు కూడా ఉన్నట్టు సమాచారం. పోగొట్టుకున్నది రాబట్టుకోవడం కోసం బాధితుల్లో కొందరు పోలీసులను ఆశ్రయించగా, ఇంకొందరు మధ్యవర్తుల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తిరిగి తిరిగి అడిగి అడిగి విసిగి వేసారి ఆశలు వదులుకున్న వారూ ఉన్నారు. బంగారం,డబ్బు రెండూ పోగొట్టుకొని ఎవరికీ చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్న వారు ఇంకెందరో
ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యధ
ఇలా ఒకరా ఇద్దరా ఎంతోమంది బాధితులు. ఒక్కొక్కరిదీ ఒక్కోకథ. పెళ్లికి పురమాయించిన నగలు సమయానికి చేతికి అందని కారణంగా అవమానాలు పడ్డ ఆడపిల్లల తల్లిదండ్రులు, కొత్త మోడల్ నగలపై మనసు పారేసుకొని, ఇంట్లోని పాత బంగారం అప్పజెప్పేసి రెంటికీ చెడ్డ రేవడిలా నష్టపోయిన మధ్యతరగతి కుటుంబాలు, పిల్లల చదువులు కోసం, ఇతర కుటుంబ అవసరాలకోసం నగలు కుదువ పెట్టి నష్టపోయిన పేదవర్గాలు...తోటి జ్యూయలరీ వర్తకులు,బంగారుపు పనివారు ఇలా ఎంతోమంది బాధితుల జాబితాలో ఉన్నారు.
న్యాయం కోసం
న్యాయం జరగకపోతుందా అన్న ఆశతో బాధితులు ఎప్పటికప్పుడు షాపుల దగ్గరకు వెళ్తే, అక్కడ బోర్డు తిప్పేసిన షాపులు వారిని వెక్కిరిస్తున్నాయి. కొంతమంది పోలీసులను ఆశ్రయించగా విచారణలో ఆటంకాలు ఎదురవుతుండడంతో పురోగతి కనిపించడంలేదు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారం పట్టణంలోని మిగిలిన బంగారు నగల వ్యాపార వర్గాల్లో కలకలం రేపుతోంది. తమ విశ్వసనీయతపైనా ఎంతోకొంత ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు.
విచ్చలవిడిగా లైసెన్సులు
చిన్నచిన్న వ్యాపారాలకు లైసెన్సులు మంజూరు చేసేందుకు ఎన్నో శల్య పరీక్షలు చేసే అధికారులు,కోట్ల రూపాయల టర్నోవర్ ఉండే బంగారు షాపుల ఏర్పాటుకు కేవలం మీసేవ కేంద్రాల ద్వారా ఇలా దరఖాస్తు చేస్తే అలా లైసెన్సులు ఇచ్చేస్తున్నారు. దీనివల్లే ఇటువంటి ఘరానా మోసాలకు ఆస్కారమిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖాతాదారులకు నమ్మకం ఉండేలా బ్యాంకు షూరిటీగా కొంత డబ్బు లేదా ఆస్తిని డిపాజిట్ చేయించుకుంటే ఈతరహా మోసాల వల్ల నష్టపోయిన బాధితులకు కొంత ఉపశమనం కలిగించేందుకు వీలుంటుందని చెబుతున్నారు.