Being 'loaned' for harassment..వేధింపులకు ‘లోన్’వుతూ..
ABN , Publish Date - May 10 , 2026 | 12:25 AM
Being 'loaned' for harassment.. బొబ్బిలి మండలంలోని పిరిడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి రెండు నెలల క్రితం అపరిచిత నంబరుతో కాల్ వచ్చింది. ’మీరు ఫలానా అసామీకి లోన్ కోసం ష్యూరిటీ సంతకం పెట్టారు. అతను లోన్ డబ్బులు చెల్లించలేదు.
వేధింపులకు ‘లోన్’వుతూ..
లోనుకు ష్యూరిటీ ఉన్నారంటూ వరుస ఫోన్లు
వెంటనే చెల్లించాలని వేధింపులు
మానసిక క్షోభకు గురవుతున్న బాధితులు
లోన్ తీసుకున్న వ్యక్తులు పరారీ
విజయనగరం క్రైం,మే 9 (ఆంధ్రజ్యోతి):
- బొబ్బిలి మండలంలోని పిరిడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి రెండు నెలల క్రితం అపరిచిత నంబరుతో కాల్ వచ్చింది. ’మీరు ఫలానా అసామీకి లోన్ కోసం ష్యూరిటీ సంతకం పెట్టారు. అతను లోన్ డబ్బులు చెల్లించలేదు. కనుక మీరే కట్టాలి. సంబంధం లేదంటే కుదరదు. 24 గంటల్లో కట్టకపోతే మా యాక్షన్ వేరేలా ఉంటుంది. బీకేర్‌ఫుల్. మా సంగతి నీకు తెలియదు’అంటూ ఫోన్ పెట్టేశాడు. అప్పట్నుంచి ఒకటే టార్చర్. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఫోన్లూ చేస్తూ నరకం చూపిస్తున్నాడు.
- మెంటాడ మండలం పిట్టాడ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రెడ్డి ఆదినారాయణకు కొద్ది రోజుల క్రితం ఓ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. లోన్‌కు ష్యూరిటీ ఉన్నారని, కట్టకపోతే సంగతి తేలుస్తానంటూ బెదిరింపులకు దిగాడు. కుటుంబాన్ని వీఽధిలోకి లాగుతామని, అకౌంట్లలో డబ్బంతా లాగేస్తామని టార్చర్ పెట్టాడు. ఆ నంబరు బ్లాక్ చేస్తే వేర్వేరు నంబర్లతో ఫోన్ చేశాడు. మహిళలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడాడు.
- విజయనగరంకు చెందిన దామోదర్‌కి ఫోన్ కాల్ వచ్చింది. రెండు రాష్ట్రాల లాటరీలో మీ సిమ్ కార్డు ఎంపికైందని, రూ.1300 కడితే గ్రాము బంగారు లక్ష్మీదేవి లాకెట్, ఓ పట్టుచీర అందుతుందని, పార్సిల్ వచ్చినప్పుడు పోస్ట్‌మ్యాన్ చేతికి ఖర్చులు ఇస్తే సరిపోతుందని చెప్పడంతో అత్యాశకుపోయి రూ.1300 చెల్లించాడు. పార్సిల్ విడిపించి చూస్తే అందులో బజారులో రూపాయి రెండు రూపాయలకు దొరికే లక్ష్మీదేవి బొమ్మ, అత్యంత నాసిరకం చీర ఉండడంతో లబోదిబోమన్నాడు.
సైబర్ కేటుగాళ్ల స్వైర విహారానికి ఇవి ఉదాహరణలు మాత్రమే. జిల్లావ్యాప్తంగా ఈతరహా వేధింపులకు గురవుతున్నవారు ఎందరో! ఇప్పటికే ఎన్నో రూపాల్లో పంజా విసురుతున్న కేటుగాళ్లు తాజాగా తమ అమ్ములపొదిలోని లోను, ష్యూరిటీ అస్త్రాన్ని అమాయక ప్రజలపై ప్రయో గిస్తున్నారు. ఫలానా వారు తీసుకున్న లోనుకు ష్యూరిటీ ఇచ్చారని, ఆ డబ్బు వెంటనే చెల్లించకపోతే మీసంగతి తేలుస్తామని ఫోన్లో బెదిరింపులకు దిగుతున్నారు. మీ బ్యాంకు అకౌంట్లలోని డబ్బులు ఖాళీ చేస్తామని భయపెడుతున్నారు. ఈవిధంగా రోజుకు అరేడుసార్లు ఫోన్ చేస్తూ టార్చర్ పెడుతున్నారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వేరే నంబరుతో చేస్తున్నారు. బ్లాక్ లిస్టులో పెడితే కొత్తకొత్త నంబర్లతో చేస్తూ మానసికంగా వేధిస్తున్నారు. దీంతో ఫోన్ మోగితే పైప్రాణాలు పైనే పోయినంత పనవుతోంది. లోను తీసుకున్న వారు ఎవరో తెలియదు. తెలిసినా పరారీలో ఉంటుండడంతో సంబంధం లేని వ్యక్తులు వేధింపులకు గురవుతున్నారు.
జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఈ తరహా సైబర్ దాడులు అధికమయ్యాయి. ప్రతి పదిమందిలో ఒకరు కేటుగాళ్ల టార్చర్‌కు గురవుతున్నారు. ఒకట్రెండు నిమిషాలు మామూలుగా మాట్లాడుతున్న కేటుగాళ్లు తర్వాత తిట్ల దండకం మొదలుపెడుతున్నారు. ఎవరికీ చెప్పుకోలేని దుర్భాషలాడుతున్నారు. ఇంట్లో మహిళలను ఉద్దేశించి కూడా అతి జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు. రెచ్చగొట్టి సొమ్ము గుంజడమే వీరి లక్ష్యంగా కనిపిస్తోంది. మరోవైపు, అకౌంట్లలోని డబ్బు లాగేస్తామని వారు బెదిరిస్తుండడంతో వారు అన్నంత పని చేస్తారేమోనని బాధితులు అనుక్షణం ఆందోళన చెందుతూ ఎప్పటికప్పుడూ ఖాతాలను చెక్ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని కొందరు బాధితులు పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అయితే అవతలవారు ఆధారం లేని సిమ్‌లను వినియోగిస్తున్నారని, గుర్తించడం కష్టమని పోలీసులు చెబుతుండడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో చిత్రవధ అనుభవిస్తున్నారు.
’బుక్’ చేస్తున్నారు.
మరోవైపు జిల్లాలో కొత్త తరహా మోసం హల్‌చల్ చేస్తోంది. కొందరు వ్యక్తులు మేం ఫలానా నెట్వర్క్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నామని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల నిర్వహించిన డ్రాలో మీ సిమ్ ఎంపికైందని, కేవలం రూ.1300 రూపాయలు మీరు చెల్లిస్తే ఒక గ్రాము బంగారంతోపాటు విలువైన పట్టుచీర పంపుతామని చెప్పుకొస్తున్నారు. డబ్బులు ముందుగా కట్టక్కరలేదని, పోస్ట్‌మ్యాన్ నుంచి పార్సిల్ విడిపించినప్పుడు కడితే సరిపోతుందని నమ్మబలుకుతున్నారు. ఇంకేముంది రూ.1300 గ్రాము బంగారం, పట్టుచీర అనేసరికి ముందు వెనుక ఆలోచించకుండా పోస్టల్ అడ్రెస్ ఇవ్వడం, కొద్దిరోజుల తర్వాత పార్సిల్ రావడం, పోస్టు మ్యాన్‌కి సొమ్ము కట్టేసి పార్సిల్ విడిపించేయడం, ఆతృతగా విప్పి చూసి నిర్ఘాంతపోవడం మామూలైపోయింది. అందులో బజారులో రెండుమూడు రూపాయలకు దొరికే లక్ష్మీదేవి బొమ్మ, వంద రూపాయలకు మించని నాసిరకం చీర చూసి లబోదిబోమంటున్నారు.
- పార్సిల్ రూపంలో జరుగుతున్న మోసాలను చూస్తున్న పోస్ట్ మ్యాన్‌లు, పార్సిల్ విడిపించి మోసపోవద్దని చెబుతున్నారు. అయినా వినుకోకుండా సొమ్ము చెల్లించి పార్సిల్ విడిపించి ఆనక తెల్లమొహం వేస్తున్నారు. మొత్తానికి ఇటు ష్యురిటీ పేరుతో మానసిక వేధింపులతో కొందరు, అటు తక్కువ సొమ్ముకే బంగారు నాణెం, పట్టుచీర అంటూ అత్యాశకు పోయి ఇంకొందరు సైబర్ కేటుగాళ్ల బాధితులుగా మారుతున్నారు.
------------------