Share News

ముచ్చట తీరకుండానే..

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:05 AM

కుమార్తె రజస్వల కావడంతో తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు.

 ముచ్చట తీరకుండానే..
లావణ్య (ఫైల్‌)

-కాషాయవలసలో గిరిజన విద్యార్థిని మృతి

- ఈ నెల 9న రజస్వల అయిన బాలిక

- మంగళ స్నానానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు

- కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించేలోగా మృతి

సాలూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కుమార్తె రజస్వల కావడంతో తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. తమ కుమార్తె పెద్దదయిందని చుట్టాలు, బంధువులకు చెప్పుకొని సంబరపడ్డారు. మంగళస్నానాలు తరువాత ఫంక్షన్‌ ఏర్పాటు చేసి ఊరంతా భోజనాలు పెట్టాలని భావించారు. కానీ, ఆ ముచ్చట తీరకుండానే ఆ గిరిజన విద్యార్థిని ప్రాణాలు వదిలింది. మంగళస్నానాల కోసం ఏర్పాట్లు చేస్తుండగా అకస్మాత్తుగా కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించేలా లోగా మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన సాలూరు మండలం కురుకూటి పంచాయతీ పరిధిలోని దిగువ కాషాయవలస గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. కాషాయవలసకు చెందిన తాడంగి రాజారావు, అమ్మాజీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. పెద్ద అమ్మాయి లావణ్య (14) కురుకూటి ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదవుతోంది. ఈ నెల 9న విద్యార్థిని రజస్వల కావడంతో పాఠశాల సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారు వచ్చి కుమార్తెను స్వగ్రామానికి తీసుకువెళ్లారు. గ్రామ ఆచారం ప్రకారం తొమ్మిది రోజుల అనంతరం మంగళస్నానానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే విద్యార్థినికి ఒక్కసారిగా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఇంతలోనే తీవ్ర నొప్పితో కుప్పకూలి మృతిచెందిందని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. ఈ ఘటనపై కురుకూటి ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.శివను వివరణ కోరగా.. ‘ఈ నెల 11న పాఠశాలలో లావణ్య రజస్వల కావడంతో తల్లిదండ్రులకు తెలియజేశాం. తల్లిదండ్రులతో అంగీకారపత్రం రాయించి బాలికను ఇంటికి పంపించాం. ఈ నెల 19న లావణ్య మృతి చెందిందని వారు చెప్పారు’ అని తెలిపారు.

Updated Date - Nov 21 , 2026 | 12:05 AM