Beer.. Joss బీరు.. జోరు
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:47 PM
Beer.. Joss భానుడు ప్రతాపం చూపుతుండడంతో మద్యం ప్రియులు వేసవితాపం నుంచి సేదదీరేందుకు బీర్లు బాట పడుతున్నారు. కొద్దిరోజులుగా పెరుగుతున్న అమ్మకాలే ఇందుకు నిదర్శనం. సాధారణ మద్యం కన్నా బీర్లే అధికంగా అమ్ముడవుతున్నాయి. 2025 మార్చిలో 80,322 కేసుల బీర్లు అమ్ముడుపోగా, 2026 మార్చిలో లక్షా 4వేల 397కేసుల బీర్లు విక్రయాలు జరిగాయి. అంటే 24,075 కేసులు అధికమన్న మాట. 30 శాతం పెరిగినట్టు వెల్లడవుతోంది.
బీరు.. జోరు
వేసవితాపంతో పెరిగిన డిమాండ్
చిల్ అవుతున్న మద్యం ప్రియులు
గత ఏడాదితో పోల్చితే మార్చిలో 30శాతం పెరిగిన అమ్మకాలు
భానుడు ప్రతాపం చూపుతుండడంతో మద్యం ప్రియులు వేసవితాపం నుంచి సేదదీరేందుకు బీర్లు బాట పడుతున్నారు. కొద్దిరోజులుగా పెరుగుతున్న అమ్మకాలే ఇందుకు నిదర్శనం. సాధారణ మద్యం కన్నా బీర్లే అధికంగా అమ్ముడవుతున్నాయి. 2025 మార్చిలో 80,322 కేసుల బీర్లు అమ్ముడుపోగా, 2026 మార్చిలో లక్షా 4వేల 397కేసుల బీర్లు విక్రయాలు జరిగాయి. అంటే 24,075 కేసులు అధికమన్న మాట. 30 శాతం పెరిగినట్టు వెల్లడవుతోంది.
విజయనగరం కైం, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి):
నాలుగురోజుల కిందట ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో మద్యం విక్రయాలు బాగా జరిగినట్లు ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2025 ఏప్రిల్ నుంచి గత మార్చి వరకు విజయనగరం జిల్లాలో రూ.1344.17కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోల్చిచూస్తే అమ్మకాలు స్వల్పంగా తగ్గినట్టు కనిపిస్తున్నా సగటున పర్వాలేదనిపిస్తున్నాయి. అయితే గత మార్చి నుంచే భానుడు ప్రతాపం చూపుతుండడంతో మద్యం ప్రియులు వేసవితాపం నుంచి సేదదీరేందుకు బీర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయాన్ని అమ్మకాల లెక్కలు స్పష్టంచేస్తున్నాయి. 2025 మార్చినెలలో జిల్లాలో లక్షా 62వేల 949 కేసులు లిక్కర్ అమ్ముడుపోగా, 2026 మార్చిలో 1,61,653 లిక్కర్ కేసులు విక్రయాలు జరిగాయి. అంటే 1296 కేసులు తక్కువ నమోదయ్యాయి. ఆ లోటును బీర్లు భర్తీ చేశాయి. 2025 మార్చిలో 80,322 కేసుల బీర్లు అమ్ముడుపోగా, 2026 మార్చిలో లక్ష 4వేల 397కేసుల బీర్లు విక్రయాలు జరిగాయి. అంటే 24,075 కేసులు అధికంగా నమోదయ్యాయి. 2025 మార్చితో పోల్చితే, గతమార్చినెలలో లిక్కర్ అమ్మకాలు 1శతం తగ్గి, బీర్లు విక్రయాలు అమాంతం 30 శాతం పెరిగినట్టు స్పష్టమవుతోంది.
మన్యంలో రెండింటా..
విజయనగరం జిల్లాలో లిక్కర్ అమ్మకాలు తగ్గి బీర్లు విక్రయాలు పెరిగితే పార్వతీపురం మన్యం జిల్లాలో అటు లిక్కర్ ,ఇటు బీర్లు అమ్మకాల్లోనూ వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఈ జిల్లాలో 2025 మార్చిలో 49,833 కేసుల లిక్కర్ విక్రయాలు జరిగితే, 26,666 బీర్లు కేసులు అమ్ముడయ్యాయి. మొత్తం అమ్మకపు విలువ 32.12 కోట్ల రూపాయలు. ఈ ఏడాది మార్చిలో అమ్ముడైన లిక్కర్ కేసుల సంఖ్య 51,836 కాగా, బీర్లు కేసులు 31,034 వీటి మొత్తం అమ్మకాలు విలువ 38.38 కోట్ల రూపాయలు. అంటే 2025 మార్చితో పోల్చితే 6కోట్ల 26లక్షలు రూపాయలు అదనపు అమ్మకాలు జరిగినట్టు వెల్లడవుతోంది. లిక్కర్ అమ్మకాల్లో గ్రోత్ 4 శాతం పెరగ్గా, బీర్లలో 16 శాతం వృద్ధి నమోదైంది. అమ్మకపు విలువ 6 శాతం అధికంగా నమోదైనట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇక 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చివరకు మన్యం జిల్లాలో మద్యం విక్రయాలు 408కోట్ల 57 లక్షలు కాగా, గతేడాది మార్చి నుంచి ఈఎడాది మార్చి వరకు అమ్మకాలు 420.62 కోట్లు..దాదాపుగా 12 కోట్ల రూపాయల మేర అదనపు అమ్మకాలు జరిగినట్టు స్పష్టమవుతోంది.
బీర్లదే భారీ వాటా
ఎండల తీవ్రత పెరిగేకొద్దీ జిల్లాలో బీర్ల విక్రయాలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతిఏటా ఇది జరిగేదే అయినా ఈఏడాది భానుడి భగభగలపై వాతావరణ శాఖ అంచనాలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో బీర్ల కొరత ఏర్పడుతుందేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్సైజ్,ప్రొహిబిషన్ అధికారులు మాత్రం కొరత ప్రసక్తే రానీయబోమని చెబుతున్నారు.
మరింత పెరిగే అవకాశం
బి.శ్రీనాధుడు, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్, విజయనగరం
గతంతో పోల్చితే అమ్మకాలు పెరిగియి. 2024-25తో పోల్చితే ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలు పెరిగాయి. గత ఏడాదికన్నా ఈ ఏడాది మరింతగా మద్యం అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. అందుకు కారణం నాణ్యమైన మద్యం, అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉండటమే. వేసవిలో బీర్లు అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి.
----------------