టెట్ ఉత్తీర్ణత కాలేదని..
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:24 AM
ఉపాధ్యాయ వృత్తి అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఎలాగైనా ఉపాధ్యాయ కొలువు సాధించాలనే లక్ష్యంతో బీఈడీ పూర్తి చేసి డీఎస్సీకి సిద్ధమవుతోంది.
- మనస్తాపంతో నవవధువు ఆత్మహత్య
- పెళ్లయిన 50 రోజులకే..
దత్తిరాజేరు, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ వృత్తి అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఎలాగైనా ఉపాధ్యాయ కొలువు సాధించాలనే లక్ష్యంతో బీఈడీ పూర్తి చేసి డీఎస్సీకి సిద్ధమవుతోంది. అయితే, రెండుసార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) టెట్ రాసినా ఉత్తీర్ణత కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. పెళ్లయిన 50 రోజులకే నవవధువు తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన దత్తిరాజేరు మండలం చినరాజేరులో చోటుచేసుకుంది. పెదమానాపురం ఎస్‌ఐ జి.కళాధర్ వివరాల మేరకు.. విజయనగరం మండలం అయ్యన్నపేట గ్రామానికి చెందిన వి.చంద్రశేఖరరావు వీరఘట్టం పోలీసు స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన తన కుమార్తె తనూజ (25)ను చినరాజేరు గ్రామానికి చెందిన తన అక్క కుమారుడైన ప్రసన్నకుమార్‌కు ఇచ్చి గతనెల 2న వివాహం చేశాడు. ప్రసన్నకుమార్ ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. తనూజ గతంలో టెట్ రాసి ఫెయిల్ అయింది. మరలా ఇటీవల నిర్వహించిన టెట్ పరీక్షను రాసింది. అదే విధంగా మిగతా పోటీ పరీక్షలకు కూడా సిద్ధమవుతుంది. బుధవారం టెట్ ఫలితాలు వెలువడడంతో మళ్లీ ఉత్తీర్ణత కాలేదు. దీంతో మనస్తాపం చెంది చినరాజేరులోని తన అత్తవారింట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె మామయ్య, రిటైర్డ్ టీచర్ ఈశ్వరరావు ఫోన్‌లో చంద్రశేఖరరావుకు చెప్పాడు. కుమార్తె మృతిపై తనకు ఎవరిపై ఎటువంటి అనుమానాలు లేవని చంద్రశేఖరరావు తెలిపాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు గజపతినగరం సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ కళాధర్ సంఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనూజ మృతితో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.